logo

మదుపు చేస్తే నెల రోజుల్లో డబుల్‌!

మదుపు చేస్తే నెలరోజుల్లో రెట్టింపు డబ్బు ఇస్తామంటూ హైదరాబాద్‌లో ఓ విద్యా సంస్థల నిర్వాహకుడి నుంచి రూ.1.2కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో చిత్తూరు జిల్లా తిరుమల....

Published : 25 Jan 2022 02:26 IST

ట్రేడ్‌ ప్రాఫిట్‌ ఫండ్‌ పేరుతో వ్యాపారికి రూ.1.2 కోట్లు టోకరా

తిరుమల ఏఎస్పీ మునిరామయ్యకు పోలీసుల తాఖీదులు

ఈనాడు, హైదరాబాద్‌: మదుపు చేస్తే నెలరోజుల్లో రెట్టింపు డబ్బు ఇస్తామంటూ హైదరాబాద్‌లో ఓ విద్యా సంస్థల నిర్వాహకుడి నుంచి రూ.1.2కోట్లు వసూలు చేసిన వ్యవహారంలో చిత్తూరు జిల్లా తిరుమల ఏఏస్పీ మునిరామయ్యకు హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రేడ్‌ ప్రాఫిట్‌ ఫండ్‌ పేరుతో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి, తన స్నేహితుడు కె.జయప్రతాప్‌, కేవీరాజు, మునిరామయ్యలు మోసం చేశారంటూ సీహెచ్‌ సునీల్‌కుమార్‌ గతేడాది నవంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. కె.జయప్రతాప్‌ రెండేళ్ల క్రితం బాధితుడు సునీల్‌ను కలిశాడు. చిత్తూరులో ఓ వ్యక్తి ట్రేడ్‌ ప్రాఫిట్‌ ఫండ్‌ పేరుతో షేర్‌ మార్కెట్‌ కంటే ఎక్కువ లాభాలొస్తున్న వ్యాపారం నిర్వహిస్తున్నాడని చెప్పాడు. తనకు బాగా పరిచయమున్న డీఎస్పీలు కేవీరాజు, మునిరామయ్యలు పెట్టుబడులు పెట్టి నెలరోజుల్లోపే రెట్టింపు తీసుకున్నారని నమ్మించాడు. సునీల్‌ను హిమాయత్‌ నగర్‌లోని ఓ హోటల్‌కు రావాలన్నాడు. అక్కడ కేవీరాజు, మునిరామయ్యలున్నారు. నలుగురూ మాట్లాడుకున్నాక తొలుత రూ.1.5కోట్లు మదుపు చేస్తే.. నెల రోజుల్లోపు రూ.3కోట్లు వస్తాయని మునిరామయ్య వివరించారు. అలా సునీల్‌ వద్ద రూ.1.2 కోట్లు ఇప్పించుకున్నారు.

వ్యవధి దాటి.. రెండేళ్లైనా.. నెల రోజుల్లో రూ.3కోట్లు వస్తాయని నమ్మిన సునీల్‌కు ఆ వ్యవధి దాటినా జయప్రతాప్‌ డబ్బు పంపలేదు. దీంతో జయప్రతాప్‌కు సునీల్‌ ఫోన్‌చేయగా.. ఇద్దరూ పోలీసు అధికారులే ఇస్తారంటూ చెప్పాడు. రెండేళ్లు పూర్తైనా డబ్బు ఇవ్వకపోవడంతో సునీల్‌ చిత్తూరులో ట్రేడ్‌ ప్రాఫిట్‌ ఫండ్‌ నిర్వహిస్తున్న వ్యక్తి, డీఎస్పీ కేవీరాజులపై ఆరా తీయగా కేవీరాజు పోలీస్‌ శాఖ అధికారి కాదని తెలుసుకున్నాడు. ఈ వివరాలతో గతేడాది అక్టోబరులో ఏఎస్పీ మునిరామయ్యకు ఫోన్‌ చేశాడు. సమాధానం ఇవ్వకపోవడంతో నవంబరు నెలలో నలుగురిపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మునిరామయ్యకు సీఆర్‌పీసీ 41సెక్షన్‌ ప్రకారం తాఖీదులు పంపించారు. ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు తాఖీదులు అందుకున్న మునిరామయ్య ఇప్పటివరకూ సీసీఎస్‌ పోలీసుల ఎదుట హాజరు కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని