logo

సొంతింటి కల.. నెరవేరునులే..

పేదలకు రెండు పడక గదులను (డబుల్‌ బెడ్‌ రూం) నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఈ క్రమంలోనే జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్మాణ పనులను ప్రారంభించింది. దీంతో పేద, దిగువ మధ్యతరగతి వారిలో ఆశలు రేకెత్తుతున్నాయి.

Published : 25 Jan 2022 02:44 IST

వడివడిగా రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు

న్యూస్‌టుడే, పరిగి


పూర్తికావచ్చిన మూడు బ్లాకులు

పేదలకు రెండు పడక గదులను (డబుల్‌ బెడ్‌ రూం) నిర్మించి ఇవ్వాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఈ క్రమంలోనే జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్మాణ పనులను ప్రారంభించింది. దీంతో పేద, దిగువ మధ్యతరగతి వారిలో ఆశలు రేకెత్తుతున్నాయి. గతంలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యేది. ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం చేసి మిగతా కొంత మొత్తాన్ని లబ్ధిదారులు భరించాల్సి వచ్చేది. ఇది పేదలకు భారంగా మారుతుందని భావించిన ముఖ్యమంత్రి రెండు పడక గదులు, హాలు, వంటగదితో పాటు ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలని శ్రీకారం చుట్టారు. పరిగి నియోజకవర్గ వ్యాప్తంగా 510 ఇళ్లు కేటాయిస్తే వీటిలో సగానికి పైగా తుది దశకు చేరుకున్నాయి. మరికొన్ని చోట్ల ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ కల నెరవేరబోతోందని పేదలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

అన్ని మండలాల్లోనూ..

రెండు పడక గదులను అన్ని మండలాల్లోనూ చేపడుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 510 ఇళ్లకు రూ.26.95కోట్లు వెచ్చిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో యూనిట్‌ నిర్మాణానికి రూ.5.04లక్షలు కాగా పురపాలక సంఘం పరిధిలోని వారికి మాత్రం ఒక యూనిట్‌కు రూ.5.3లక్షలను కేటాయించారు. 560 చదరపు అడుగుల నిర్మాణంలో ఇంటి పనులు చేపడుతున్నారు.

* పరిగి పట్టణంలో విద్యారణ్యపురి ప్రాంతంలో 300 ఇళ్లు మంజూరయ్యాయి. ఐదు బ్లాకులు శ్లాబ్‌ స్థాయి వరకు పూర్తయ్యాయి. 120 ఇళ్లు ఇంకా ప్రారంభించాల్సి ఉంది. * దోమ మండలానికి 50ఇళ్లు మంజూరు కాగా ఒక బ్లాక్‌ స్లాబ్‌ వరకు పూర్తిచేశారు. ఒక బ్లాకులో 24 ఇళ్లు ఉండేలా ఏర్పాటు చేశారు. * కుల్కచర్ల మండలానికి 80 గృహాలు మంజూరు కాగా ఇక్కడ స్థలం కొరత ప్రధాన సమస్యగా ఉంది. కొన్నేళ్లుగా మండల కేంద్రంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అందుబాటులో ప్రభుత్వ స్థలం లేకపోవడం, రెవెన్యూ అధికారులు ఇంజినీరింగ్‌ అధికారులకు స్థలం చూపకపోవడంతో నిర్మాణ పనులకు బ్రేక్‌ పడింది. * ఇదే మండలంలోని అడవి వెంకటాపూర్‌లో 30ఇళ్లు ఇప్పటికే పూర్తిచేయగా ప్రారంభానికి ఎదురు చూస్తున్నాయి. కరోనా పరిస్థితుల కారణంగా జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. * పూడూరు మండలానికి 50 చొప్పున మంజూరు కాగా నిర్మాణ పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి.

జూన్‌ వరకు పూర్తయ్యేలా కృషి : - వివేక్‌, జెఈఈ, రోడ్లు, భవనాల శాఖ

కరోనా పరిస్థితుల నేపథ్యంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో కొంత జాప్యం జరిగింది. కుల్కచర్లలో స్థలం కొరత మినహా మిగతా మండలాల్లో పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. వాస్తవానికి డిసెంబరు నాటికి పూర్తికావాల్సి ఉండగా జరిగిన జాప్యంతో ప్రభుత్వం కొంత గడువు ఇచ్చింది. నిర్ణీత సమయానికి అన్నిచోట్లా పూర్తిచేసేందుకు పక్కా ప్రణాళికతో పనిచేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని