logo

కాలుష్యం ముప్పు.. కలగదా కనువిప్పు

జిల్లాలో ఆర్థిక రాజధానిగా తాండూరు పట్టణం వెలుగొందుతోంది. సిమెంటు, నాపరాయి పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే సమయంలో ఎటు చూసినా గుంతల రహదారులు.

Published : 25 Jan 2022 02:49 IST

తాండూరులో కోరలు చాస్తున్న వైనం

వేసవిలో తీవ్రత పెరిగే అవకాశం

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌

న్యూస్‌టుడే, తాండూరుటౌన్‌

జిల్లాలో ఆర్థిక రాజధానిగా తాండూరు పట్టణం వెలుగొందుతోంది. సిమెంటు, నాపరాయి పరిశ్రమలతో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే సమయంలో ఎటు చూసినా గుంతల రహదారులు. దుమ్ము, ధూళితో విపరీతమైన గాలి కాలుష్యం. పట్టణంపై మంచు పొర కప్పినట్లు ధూళి కమ్ముకుంటోంది. దీంతో ప్రజలకు ఆరోగ్య సమస్యలు తప్పడంలేదు. రానున్నది వేసవి కావడంతో ఈ సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉంది. కనీసం ఇప్పుడైనా అధికారులు వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు చేపట్టి ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది.

దేశ రాజధానినే మించి పోయింది

కాలుష్య తీవ్రతలో తాండూరు పట్టణం దేశ రాజధాని దిల్లీని మించిపోయింది. కాలుష్య నియంత్రణ మండలి లెక్కల ప్రకారం ఒక క్యూబిక్‌ మీటరు గాలిలో 10 పీఎం పరిమాణం గల ధూళి కణాలు 100 మైక్రో గ్రాముల (10 పీఎం) కంటే తక్కువగా ఉండాలి. అయితే ఇక్కడ మాత్రం 650 మైక్రో గ్రాములుగా (2016) నమోదు కాగా, ప్రస్తుతం 250 మైక్రో గ్రాముల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎండాకాలంలో 700 మైక్రో గ్రాములు దాటుతుందని అంచనా. 2.5 పీఎం పరిమాణం గల ధూళి కణాలు 40 మైక్రో గ్రాములు మాత్రమే ఉండాలి. స్థానికంగా అవి 125 మైక్రో గ్రాములు నమోదవుతుండటం పర్యావరణ ప్రేమికులను ఆందోళనకు గురిచేస్తోంది.


బషీర్మియా తండా- రాజీవ్‌ గృహకల్ప మధ్య బైపాస్‌ రహదారి నిర్మించాల్సిన ప్రదేశం

తీవ్రత ఎక్కడెక్కడ..

గోపన్‌పల్లి సమీపంలో క్యూబిక్‌ మీటరు గాలికి సుమారు 600 మైక్రో గ్రాముల 10పీఎం దూళి కణాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇందర్‌చేడ్‌, శివాజీచౌక్‌, గౌతాపూర్‌, కరణ్‌కోట్‌, తాండూరు-లక్ష్మీనారాయణపూర్‌ కూడలి, తదతర ప్రాంతాల్లో వాయుకాలుష్యం అధికంగా నమోదవుతోంది.

అర్ధంతరంగా నిలిచిన బైపాస్‌ పనులు

తాండూరులో కాలుష్య నివారణకు ప్రధాన ప్రత్యామ్నాయమైన బైపాస్‌ రహదారికి 2017లో రూ.73 కోట్లు కేటాయించారు. పనులు ప్రారంభించిన గుత్తేదారు మధ్యలోనే విడిచిపెట్టేశారు. మరో వైపు భూ సేకరణకు సంబంధించి పరిహారం రాలేదని బషీర్మియా తండాకు చెందిన రైతులు ఆందోళన చేస్తున్నారు. దీంతో రాజీవ్‌ గృహకల్పం నుంచి తండా వైపు ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

బైపాస్‌ దారే ప్రత్యామ్నాయం: వెంకన్న, ఈఈ పీసీబీ

కాలుష్య నివారణకు బైపాస్‌ రహదారి ముఖ్యం. ఇది ప్రారంభమైతే వాహనాల రద్దీ తగ్గి గాలిలో కాలుష్యం తగ్గ్గుతుంది. గతంలో గణాంకాల ఆధారంగా సీసీఐకి నోటీసులు ఇచ్చాం. కాలుష్య నియంత్రణకు పల్స్‌ జెట్‌ బ్యాగ్‌ హౌస్‌ ఏర్పాటు చేశారు. అటువైపు నుంచి ఇబ్బంది లేదు. పట్టణంలో అంతర్గత రహదారులు మెరుగుపడితే సమస్య తీరుతుంది.

ఇవీ ప్రధాన కారణాలు

* రహదారులను సరిగా నిర్వహించకపోవడం.

* ఇసుక, మట్టి, గుంతల దారులపై భారీ లోడ్లతో వాహనాలు ఇష్టారీతిన తిరగడం.

* సిమెంటు కర్మాగారాలు, అధికారులు పర్యావరణ పరిరక్షణకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడంలేదు..

* దుమ్ము లేవకుండా రోడ్లపై నీటిని చల్లడంలేదు.

* నాపరాయి వ్యర్థాలను రహదారికి ఇరువైపులా, రహదారి గుంతల్లో పారబోయడం, భారీ వాహనాలు వచ్చినపుడు బూడిదగా మారి గాలిలో కలిసిపోవడం.


రాజకీయ అజెండాగానే వాడుకుంటున్నారు

- శ్రీనివాస్‌రెడ్డి, తాండూరు నివాసి

తాండూరు పట్టణం, పరిసర ప్రాంతాల్లో కాలుష్య సమస్యను రాజకీయ అజెండాగానే వాడుకుంటున్నారు తప్ప ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోవడంలేదు. దశాబ్దాలుగా సమస్య ఉందని తెలిసినా పరిష్కరించే మార్గాలు అన్వేషించడం లేదు. బైపాస్‌ రోడ్డు నిర్మిస్తామన్నారు. సగం పనులు చేసి వదిలేశారు. నాలుగేళ్లు కావస్తోంది. దానిపైనా దృష్టిపెట్టడంలేదు.


2014 నుంచి పోరాడుతున్నాను..

- రాజగోపాల్‌, సామాజికవేత్త, తాండూరు

పట్టణంలో కాలుష్య నివారణకు నావంతుగా 7 ఏళ్లుగా పోరాడుతున్నాను. కోర్టులో కేసు వేయడం, ఫిర్యాదులు చేయడంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కదిలివచ్చారు. కాలుష్యాన్ని కొలిచే పరికరాలను తెచ్చి పెట్టారు. దిల్లీ కంటే ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని తేలింది. ప్రజలు రోగాల బారినపడుతున్నారు. దీనిపై పురపాలక సంఘం, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం కోరుతూ కేసు వేశాను. పట్టణ ప్రజలు అంతా తమ కుటుంబాల ఆరోగ్య రక్షణకు ముందుకు రావాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని