logo

కొడంగల్‌ అభివృద్ధి పైనే నా ధ్యాస: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఉన్నా.. దిల్లీలో ఉన్నా.. హైదరాబాదులో ఉన్నా తనకు కొడంగల్‌ అభివృద్ధిపైనే ధ్యాస అని పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం కోస్గి పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశానికి ఆయన

Published : 26 Jan 2022 01:22 IST


అత్యధిక సభ్యత్వం చేసిన వారిని సన్మానిస్తూ...

కోస్గి, బొంరాస్‌పేట, న్యూస్‌టుడే: స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ఉన్నా.. దిల్లీలో ఉన్నా.. హైదరాబాదులో ఉన్నా తనకు కొడంగల్‌ అభివృద్ధిపైనే ధ్యాస అని పీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం కోస్గి పట్టణంలో కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెరాస శ్రేణులు రాష్ట్రంలో అభివృద్ధికి మారుపేరుగా చెప్పుకొంటున్న సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాల తరహాలో కొడంగల్‌ ప్రాంత అభివృద్ధి మూడేళ్లలో ఎందుకు సాధ్యం కాలేదని ప్రశ్నించారు. నియోజకవర్గంలో లోఓల్టేజీ సమస్యతో రైతులు ఇబ్బందులకు గురవుతుంటే వారి సమస్యలు తీర్చేందుకు తాను 20 విద్యుత్తు ఉప కేంద్రాలు, 5 వేల నియంత్రికలు మంజూరు చేయించానన్నారు. అలాగే కొడంగల్‌లో డిగ్రీ, కోస్గిలో పాలిటెక్నిక్‌ కళాశాల ఏర్పాటుకు కృషి చేశానన్నారు. రైతు ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ హయాంలోనే రూ.72 వేల కోట్ల రుణం మాఫీ చేశారని, రుణమాఫీ పొందని రైతులకు వైఎస్‌ రూ.5 వేలు అందించారని అన్నారు. తెరాస పాలనలో సంక్షేమ పథకాల అమలు తీరుపై ప్రశ్నిస్తే కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై దాడి చేసిన ఘనత ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికే దక్కుతుందన్నారు. తాను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎవరిపైనైనా దాడి చేసిన సంఘటనలు చోటుచేసుకున్నాయో నిరూపించాలన్నారు. కొందరు పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, అకారణంగా కొడుతున్నారని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత అలాంటి వారికి చక్రవడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. నియోజకవర్గంలో లక్ష సభ్యత్వ నమోదు లక్ష్యం పెట్టుకోగా 80శాతం పూర్తయిందని అన్నారు. నిరుపేదలను ఆదుకునేందుకు నాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశారన్నారు. పేదింటి బిడ్డలకు ఉన్నత చదువుల కోసం ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ను అమలు చేసిందీ కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, పేదలను ఆదుకుకోవాలంటే మళ్ళీ కాంగ్రెస్‌ ప్రభుత్వమే అధికారంలోకి రావాల్సిన అవసరముందన్నారు. పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, నాయకులు జైపాల్‌రెడ్డి, వార్ల విజయ్‌ కుమార్‌, రఘుపతరెడ్డి, బెజ్జు రాములు, భానునాయక్‌, రఘువర్ధన్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, తుడుం శ్రీనివాస్‌, నరేందర్‌, నర్సింహులు, విద్యాసాగర్‌ తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని