logo

నేర వార్తలు

‘సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోకుండా తనను అనవసరంగా జైలుకు తరలించారు. ఈ విషయమై గతంలో మోమిన్‌పేట ఎస్సైగా పనిచేసిన కరంపురి రాజుకు, అప్పటి అదనపు న్యాయముర్తి లక్ష్మికి హైకోర్టు తాఖీదులు జారీ చేసిందని’ హక్కు చట్టం

Updated : 26 Jan 2022 06:30 IST

ఉద్యోగం వచ్చిందంటూ బురిడీ రూ.1.10 లక్షలు మాయం

మనోహరాబాద్‌, న్యూస్‌టుడే: మీకు ఉద్యోగం వచ్చింది.. నగదు కడితే సరిపోతుందని ఫోన్‌ రావడంతో ఆ యువకుడు ఎగిరి గంతేశాడు. వారు సూచించిన మేర వివిధ నెంబర్లుకు ఆన్‌లైన్‌ ద్వారా నగదు పంపించాడు. ఆ తర్వాత ఎలాంటి సమాచారం రాకపోవడంతో తిరిగి తనకు వచ్చిన ఫోన్‌ నెంబర్లకు కాల్‌ చేయగా స్విచ్చాఫ్‌ రావడంతో తాను మోసపోయానని గ్రహించారు. ఈ ఘటన మనోహరాబాద్‌ మండలం దండుపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ రాజుగౌడ్‌ తెలిపిన వివరాలు.. కర్ణాటక రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా తాండావాల్గా గ్రామానికి చెందిన మేత్రి నాగేశ్‌ దండుపల్లిలోని ఐటీసీ పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పని చేస్తూ ఇక్కడే ఓ గది అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. ఈ నెల 16న గూగుల్‌లో ఎల్‌అండ్‌టీ పరిశ్రమలో ఉద్యోగాలు ఉంటూ వచ్చిన ప్రకటన చూసి అందులో సూచించిన నెంబరుకు మేసేజ్‌ పంపించాడు. మరుసటి రోజు 17వ తేదీన ఓ వ్యక్తి ఎల్‌అండ్‌టీ సంస్థ నుంచి మాట్లాడుతున్నానని 94329-20178 నెంబరు నుంచి ఫోన్‌ వచ్చింది. అవతలి వ్యక్తి మీ బయోడేటా పంపించి టోకెన్‌ నగదుగా రూ.2,999 పంపించాలని చెప్పాడు. దీంతో నాగేశ్‌ అదే నెంబరు నగదు పంపించాడు. ఆ తర్వాత 18న అదే నెంబర్‌ నుంచి ఫోన్‌ రాగా, ప్రాసెస్‌లో ఉంది, నగదు పంపించాలని సూచించడంతో పలు దఫాలుగా గూగుల్‌పే, పేటీఎం, ఫోన్‌పే ద్వారా అవతలి వ్యక్తి సూచించిన మేర యూకో బ్యాంకు ఖాతాకు రూ.96 వేలు పంపించాడు. ఈ నెల 22న మళ్లీ ఫోన్‌ చేసి నగదు పంపాలని కోరగా అనుమానం వచ్చిన నాగేశ్‌ సైబర్‌ క్రైమ్‌ టోల్‌ ప్రీ నెంబరు 155260కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు 84819-96937 నెంబరు ఫోన్‌ చేసి మీ ఉద్యోగం ఖరారైందని, రూ.10 వేలు పంపించాలని కోరడంతో పేటీఎం ద్వారా బదిలీ చేశాడు. అప్పటి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అనుమానం వచ్చి తనకు వచ్చిన నెంబర్లకు ఫోన్‌ చేయగా.. స్విచ్చాఫ్‌ రావడంతో తాను మోసపోయానని గ్రహించాడు. ఈ మేరకు స్థానిక పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు.


సెల్‌ఫోన్‌ దొంగను పట్టిచ్చిన యాప్‌

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: సెల్‌ఫోన్‌ను చోరీ చేసిన దొంగ ఆ ఫోన్‌లో ఉన్న యాప్‌ ఆధారంగా పట్టుబడ్డాడు. సికింద్రాబాద్‌ జీఆర్పీ ఇన్‌స్పెక్టర్‌ ఎం.శ్రీను, ఎస్సై మాజీద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్‌కు చెందిన సాయిసర్‌ రాహుల్‌(22) క్యాటరింగ్‌ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా రైళ్లలో ప్రయాణిస్తూ బ్యాగులు, సెల్‌ఫోన్ల చోరీలకు పాల్పడుతున్నాడు. ఈనెల 23 రాత్రి నర్సాపూర్‌ నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న రైల్లో సిద్దుసాయి అనే యువకుడు నగరానికి వస్తున్నాడు. ఆ సమయంలో ఛార్జింగ్‌ పెట్టిన కొద్దిసేపటి తర్వాత సెల్‌ఫోన్‌ కనిపించలేదు. విజయవాడకు పనిమీద వెళ్లిన రాహుల్‌ తిరిగి అదే రైల్లో నగరానికి వస్తున్నాడు. రైలు సత్తెనపల్లి-నడికుడి ప్రాంతానికి చేరుకున్న సమయంలో సెల్‌ఫోన్‌ను దొంగిలించాడు. ఫోన్‌ కోసం వెతుకున్న సిద్దుసాయి తన ఫోన్‌లో ఉన్న యాంటీ తఫె్ట్‌ అప్లికేషన్‌ ద్వారా ఫోన్‌ను గుర్తించి నిందితుడిని ప్రయాణికుల సాయంతో పట్టుకున్నాడు. రైలు సోమవారం సికింద్రాబాద్‌కు చేరుకున్న అనంతరం పోలీసులకు అప్పగించారు. నిందితుడిని విచారించిన పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేసి రిమాండుకు తరలించారు. ఫోన్లను గుర్తించే విధంగా యాప్‌లు ఉంచుకుంటే మంచిందని ఇన్‌స్పెక్టర్‌ శ్రీను సూచించారు.


ఎస్సైకి, అదనపు న్యాయమూర్తికి తాఖీదులు జారీ

మోమిన్‌పేట: ‘సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోకుండా తనను అనవసరంగా జైలుకు తరలించారు. ఈ విషయమై గతంలో మోమిన్‌పేట ఎస్సైగా పనిచేసిన కరంపురి రాజుకు, అప్పటి అదనపు న్యాయముర్తి లక్ష్మికి హైకోర్టు తాఖీదులు జారీ చేసిందని’ హక్కు చట్టం ఉద్యమకారుడు తెలంగాణ సీపీఐ జిల్లా ఇన్‌ఛార్జి కె.కళప్ప తెలిపారు. మంగళవారం ఆయన మోమిన్‌పేటలో మాట్లాడుతూ 2017 జనవరి 4న తనపై 354, 506 సెక్షన్ల కింద మోమిన్‌పేట పోలీసు స్టేషన్లో అప్పటి ఎస్సై కరంపురి రాజు (ప్రస్తుతం ఈయన సైబరాబాద్‌ పరిధి పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్లో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు.) కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ల కింద తనకు ఏడేళ్ల జైలు శిక్ష పడే వీలుంది. అయితే ఇలాంటి కేసుల విషయంలో గతంలో (2014) సుప్రీం కోర్టు స్థానిక పోలీస్‌ స్టేషన్లోనే బెయిల్‌ ఇవ్వవచ్చని తీర్పు చెప్పింది. కోర్టు తీర్పును పరిధిలోకి తీసుకోకుండా తనని ఎస్సై రిమాండ్‌కు తరలించారు. అదే సమయంలో అప్పటి వికారాబాద్‌ మొదటి తరగతి అదనపు జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ లక్ష్మికూడా (ప్రస్తుతం జడ్చర్లలో కొనసాగుతున్నారు). తీర్పును గమనించక జైలుకు పంపించారు. న్యాయం కోసం వీరిద్దరిపై గత సంవత్సరం డిసెంబర్‌ 6న తాను హైకోర్టును ఆశ్రయించగా ఇరువురికీ ఈనెల 28న హైకోర్టుకు రావాలని నోటీసులు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. ప్రజలు సమాచారం హక్కు చట్టంపై అవగాహన పెంపొందించుకుంటే ఎంతో మేలు జరుగుతుందన్నారు.


తనిఖీల్లో గంజాయి పట్టివేత.. ముగ్గురిపై కేసు

పరిగి గ్రామీణ: అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తితోపాటు కొంటామని చెప్పిన మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన పరిగి పురపాలిక పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై విఠల్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం నగరానికి వెళ్లే రహదారిపై పోలీస్‌ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహించారు. మన్నెగూడ నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని (స్కూటీ) ఆపి పత్రాలు అడగగా వాహనదారుడు తడబడుతూ సమాధానం ఇచ్చాడు. అనుమానం వచ్చి వాహనాన్ని తనిఖీ చేయగా అందులో గంజాయి దొరికింది. వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు తరలించి రెవెన్యూ అధికారుల సమక్షంలో పరిశీలించి తూకం వేయగా 250 గ్రాముల బరువున్న గంజాయిగా తేలింది.ఆ వ్యక్తి నగరంలోని ధూల్‌పేట్‌ ప్రాంతానికి చెందిన మహేందర్‌ సింగ్‌గా గుర్తించారు. పరిగికి చెందిన శ్రీవదన్‌, సాయిప్రణీత్‌లు కొనుగోలు చేస్తామని చెప్పడంతో గంజాయిని తీసుకుని వచ్చినట్లు నిందితుడు తెలపడంతో ముగ్గురిపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.


బాలికపై లైంగిక వేధింపులు.. యువకుడి అరెస్టు

పంజాగుట్ట: బాలికను లైంగికంగా వేధించిన యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేసి పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌పెక్టర్‌ నిరంజన్‌ రెడ్డి వివరాల ప్రకారం.. జహీరాబాద్‌కు చెందిన మహమద్‌ మోహిజ్‌ (19) ఎంఎస్‌ మక్తాలో నివాసం ఉంటూ వెల్డింగ్‌ పనులు చేస్తుంటాడు. సమీపంలో ఉంటున్న 13 ఏళ్ల బాలికను 3 నెలలుగా లైంగికంగా వేధిస్తున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో భవనంపైకి తీసుకెళ్లి, మెట్లపైన బాలికను వేధించేవాడు. ఒంటిపై కొరకడంతో బాలికకు జ్వరం వచ్చింది. తల్లి గమనించి.. గాయాలు ఏమిటని ప్రశ్నించింది. బాలిక అసలు విషయం చెప్పడంతో అతడికి దేహశుద్ధి చేసి పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.


గుట్కా, బాణసంచా నిల్వలు స్వాధీనం

దుబ్బాక, న్యూస్‌టుడే: ప్రభుత్వం నిషేధించిన గుట్కాలను, ఎలాంటి అనుమతులు లేకుండా లక్షల విలువ చేసే బాణసంచా అక్రమంగా నిల్వ ఉంచి, అమ్ముతున్న ఇంటిపై దాడి చేసి, వాటిని స్వాధీనం చేసుకున్న ఘటన దుబ్బాక మండలంలోని హబ్షీపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. సిద్దిపేట టాస్క్‌ఫోర్స్‌ సీఐ దిలీప్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హబ్షీపూర్‌ గ్రామంలో వీరమల్లు మధుకర్‌ అనే వ్యక్తి కిరాణంతో పాటు మెడికల్‌ షాప్‌ నిర్వహించేవాడు. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది దాడులు చేపట్టారు. రూ.2.25 లక్షల విలువైన గుట్కాలు, రూ.4 లక్షల విలువైన పటాకులను స్వాధీనం చేసుకున్న దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేశారు.


ఏటీఎం కార్డు కొట్టేశారు.. డబ్బులు తీయబోయి దొరికారు

రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: రైల్లో ప్రయాణికుడి ల్యాప్‌లాప్‌, ఏటీఎం కార్డు దొంగిలించి డబ్బులు తీయబోయిన ఇద్దరిని సికింద్రాబాద్‌ జీఆర్పీ పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై మాజీద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బన్సీలాల్‌పేట్‌కు చెందిన నానీ(22), మహబూబాబాద్‌కు చెందిన రాము(29)లు సికింద్రాబాద్‌లోని పెట్రోల్‌ బంక్‌ల వద్ద కార్‌పాలిష్‌ బాటిళ్లు విక్రయిస్తుంటారు. ఆ ఆదాయం సరిపోక చోరీల బాటపట్టారు. ఈనెల 21న మణుగూరు ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు సీట్‌పై ఉంచిన ల్యాప్‌లాప్‌ బ్యాగుతోపాటు అందులో ఉన్న ఏటీఎం కార్డును దొంగిలించారు. మంగళవారం సికింద్రాబాద్‌ ప్రాంతంలోని ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేందుకు ప్రయత్నిస్తుండగా.. బాధితునికి వచ్చిన సందేశం ఆధారంగా పోలీసులు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై దగ్గరలోనే ఉన్న ఏటీఎం వద్దకు వెళ్లి అక్కడున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణంలో వారు నేరం అంగీకరించారు. వారి వద్ద నుంచి ల్యాప్‌టాప్‌, ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని