logo

అప్రమత్తతేఆయుధం..కట్టడి అవసరం

ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జ్వర సర్వే చేపట్టింది. జిల్లా యంత్రాంగం అందుకు అనుగుణంగా బృందాలను ఏర్పాటు చేసి, ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తోంది. ఈ సమయంలో వేలాది మంది ఇంట్లోనే ఉంటూ జ్వరం, జలుబు, దగ్గు,

Published : 26 Jan 2022 01:22 IST

జిల్లాలో భారీగా కరోనా అనుమానితులు

జ్వర సర్వేలో వెల్లడి

కొడంగల్‌లో సర్వే చేస్తున్న సిబ్బంది..

* ధారూర్‌ మండలం నాగసమందర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఫీవర్‌ సర్వే బృందాలు మంగళవారం 200 కుటుంబాలను పరిశీలించాయి. ఇందులో 70 కుటుంబాల్లో జ్వరం, జలుబు, దగ్గు, ఇతర అనారోగ్య లక్షణాలు గుర్తించారు. దీంతో వారికి మందుల కిట్లు అందించారు.


* కొడంగల్‌ మండలం పర్సాపూర్‌ గ్రామంలో 482 కుటుంబాలున్నాయి. ఇటీవల జ్వర సర్వేకు వెళ్లినపుడు ప్రతి ఇంట్లో ఒకరికైనా జ్వరం, జలుబు, దగ్గు, ఇతర లక్షణాలు ఉన్నాయని సర్పంచి చెబుతున్నారు. వైద్యుల బృందం మాత్రం 70 మందిలోనే లక్షణాలు గుర్తించినట్లు పేర్కొంటున్నారు.


* మోమిన్‌పేట్‌ మండలం దేవరంపల్లి సబ్‌ సెంటర్‌ పరిధిలో చక్రంపల్లి, బాల్‌రెడ్డిగూడెం, చీమలదరి, దేవరంపల్లి గ్రామాలు ఉన్నాయి. మంగళవారం జ్వర సర్వే బృందం 659 మందిని పరిశీలించారు. అందులో ఆరుగురికి జ్వరం రావడంతో మందుల కిట్లు అందించారు.


ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌, న్యూస్‌టుడే, కొడంగల్‌, మోమిన్‌పేట్‌

ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జ్వర సర్వే చేపట్టింది. జిల్లా యంత్రాంగం అందుకు అనుగుణంగా బృందాలను ఏర్పాటు చేసి, ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తోంది. ఈ సమయంలో వేలాది మంది ఇంట్లోనే ఉంటూ జ్వరం, జలుబు, దగ్గు, ఇతర రోగాలతో బాధపడుతున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. మరికొన్ని చోట్ల క్షేత్ర స్థాయిలో రోగాల తీవ్రత ఎక్కువగా ఉన్నా వైద్య సిబ్బంది నివేదికల్లో వాటిని తక్కువగా చూపిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

9.20 లక్షల మంది జనాభా

జిల్లాలో 2.20 లక్షల నివాస గృహాలున్నాయి. సమారు 9.20 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు. జిల్లా వైద్యారోగ్య శాఖ నుంచి 23 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మొత్తం 745 బృందాలు జ్వర సర్వే చేపడుతున్నాయి. ఇప్పటి వరకు 1.61 లక్షల కుటుంబాలను పరిశీలించిన వైద్య బృందాలు 7 వేల మందిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. మందుల కిట్లు ఇచ్చి పరిస్థితి సీరియస్‌ అనిపిస్తే సమీప పీహెచ్‌సీలకు వెళ్లాలన్నారు. అలా వెళ్లిన 3,099 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 299 మందికి పాజిటివ్‌గా తేలింది. అత్యధికంగా పెద్దేముల్‌ మండలంలో 49 మంది, వికారాబాద్‌లో 36 మంది ఉన్నారు. యాలాల మండలంలో మొత్తం 9 వేల నివాస గృహాలను సర్వే బృందాలు సందర్శించగా కేవలం 224 కుటుంబాల్లోనే లక్షణాలు గుర్తించారు. అందులో 92 మందికి పరీక్షలు చేయగా కేవలం ఒక్కరికే పాజిటివ్‌ వచ్చిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

అధికారిక లెక్కలు ఇలా

సర్వే బృందాలు: 745

మొత్తం నివాస గృహాలు: 2,20,386

ఇప్పటి వరకు సర్వే చేసినవి: 1,61,808

కరోనా లక్షణాలు గుర్తించిన కుటుంబాలు: 7,078


వాస్తవ దూరమని విమర్శలు

సర్వే నివేదికలు వాస్తవ దూరంగా ఉన్నాయని వైద్య బృందాలతో పర్యటించిన ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు పేర్కొంటున్నారు. అధికారిక నివేదికలకు, క్షేత్ర స్థాయిలో పరిస్థితులు పొంతనే లేదని విమర్శిస్తున్నారు. సర్వే బృందం ఇంటికి వచ్చినపుడు చిన్నచిన్న లక్షణాలు ఉన్నా చెప్పడానికి కొంత మంది ఇష్టపడటంలేదని, మరికొన్ని సందర్భాల్లో చిన్నపాటి జలుబు, దగ్గు, జ్వరం లక్షణాలు ఉన్నా వాటిని వైద్యుల బృందం పరిగణలోకి తీసుకోవడంలేదని తెలిపారు. కొన్ని చోట్ల కుటుంబ సభ్యులు సరైన సమాచారం ఇవ్వడంలేదని తెలుస్తోంది. ఫలితంగా కరోనా లక్షణాలున్న వ్యక్తులు ఎంత మంది ఉన్నారనేది స్పష్టం తేలే పరిస్థితి లేదని పేర్కొంటున్నారు.

* మరోవైపు కరోనా కష్టకాలంలోనూ రాజకీయ నేతలు సభలు, సమావేశాలంటూ ప్రజలను పోగు చేయడం విమర్శలకు తావిస్తోంది. అభివృద్ధి కార్యక్రమాల పేరు చెప్పి సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల కరోనా వ్యాప్తి తొందరగా జరుగుతుందని వైద్యులు సూచిస్తున్నా పట్టించుకుంటున్న దాఖలాలు తక్కువే..


వ్యక్తిగత జాగ్రత్తలే ముఖ్యం

తుకారాం, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి.

ప్రభుత్వ ఆదేశాల మేరకు జ్వర సర్వే చేపట్టాం. కచ్చితమైన సమాచారాన్ని సేకరిస్తున్నాం. అనుమానితులు, లక్షణాలు ఉన్న వ్యక్తులకు పరీక్షలు చేయించి, మందులు అందిస్తున్నాం. కరోనా కట్టడికి వ్యక్తిగత జాగ్రత్తలు ముఖ్యమని ప్రతి ఒక్కరూ భావించాలి. ఏ మాత్రం జ్వరం, జలుబు, దగ్గు ఇతర లక్షణాలు కనిపించినా సమీపంలోని వైద్య సిబ్బందిని సంప్రదించి, కరోనా పరీక్షలు చేయించుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని