logo

చికిత్స పొందుతూ వృద్ధుడుమృతి

ఎదురుగా వచ్చిన అడవి పందులను తప్పించబోయే క్రమంలో ట్రాక్టరు అదుపు తప్పి బోల్తాపడటంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి శివారులో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, స్థానికులు తెలిపిన వివరాలు..

Published : 26 Jan 2022 01:41 IST

చిన్నకోడూరు, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై చిన్నకోడూరు ఠాణాలో మంగళవారం కేసు నమోదైంది. స్థానిక ఎస్‌ఐ శివనందం తెలిపిన వివరాలు.. కరీంనగర్‌కు చెందిన మండల కొమురయ్య(70) చెర్లఅంకిరెడ్డిపల్లిలోని యశోద ఛారిటబుల్‌ ట్రస్టును పదేళ్లుగా నడుపుతున్నాడు. ప్రతి రోజు ఉదయం కరీంనగర్‌ నుంచి వచ్చి ఆశ్రమంలోని వృద్ధులకు కావాల్సిన భోజనం, ఇతర సామగ్రి అందజేసి రాత్రి తిరిగి ఇంటికి వెళ్తాడు. అదే మాదిరిగా సోమవారం మధ్యాహ్నం అతను చెర్లఅంకిరెడ్డిపల్లి స్టేజీ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా సిద్దిపేట నుండి కరీంనగర్‌ మార్గంలో అతివేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. సిద్దిపేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. మంగళవారం అతని భార్య భాగ్యలక్ష్మి ఫిర్యాదు చేశారు.


ట్రాక్టరు బోల్తా.. ఒకరి దుర్మరణం

పాపన్నపేట, న్యూస్‌టుడే: ఎదురుగా వచ్చిన అడవి పందులను తప్పించబోయే క్రమంలో ట్రాక్టరు అదుపు తప్పి బోల్తాపడటంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి శివారులో చోటుచేసుకుంది. స్థానిక ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, స్థానికులు తెలిపిన వివరాలు.. మండలంలోని కొడపాక గ్రామానికి చెందిన గుండు బాలకిష్టయ్య (52) సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం బోరుమోటారుకు మరమ్మతులు చేయించేందుకు ట్రాక్టరులో మెదక్‌కు తీసుకెళ్లాడు. అర్ధరాత్రి వేళ ఇంటికి తిరిగి బయల్దేరాడు. ఈ క్రమంలో నాగ్సాన్‌పల్లి శివారులోకి రాగానే అడవి పందులు ఎదురుగా వచ్చాయి. వాటిని తప్పించే క్రమంలో చోదకుడు రాజు వాహనాన్ని రోడ్డు పక్కకు తిప్పడంతో అదుపుతప్పి రోడ్డు పక్కన బోల్తా పడింది. ట్రాక్టర్‌పై ఉన్న బాలకిష్టయ్య కింద పడిపోగా, అతడికి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. రాజుకు గాయాలయ్యాయి. విషయం తెలసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. మృతుడికి భార్య పోచమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.


ఆగి ఉన్న లారీని ఢీ కొట్టి.. ద్విచక్ర వాహనదారుడి మృతి

శంకర్‌పల్లి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: ఆగి ఉన్న లారీని ఢీకొని ఓ ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన సోమవారం రాత్రి శంకర్‌పల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై క్రిష్ణ కథనం ప్రకారం.. పర్వేద గ్రామానికి చెందిన పాండు(28) శంకర్‌పల్లిలో ప్రైవేటు ఉద్యోగి. సోమవారం ఉదయం ఉద్యోగానికి వెళ్లిన పాండు రాత్రి తిరుగు ప్రయాణంలో పర్వేద గ్రామ శివారులో ఆగి ఉన్న లారీని బలంగా ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతని భార్య ప్రస్తుతం 5 నెలల గర్భవతి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని