logo

జల వనరుల అభివృద్ధిచదువుకు చేయూత

భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటే సాగు, తాగు నీటికి ఎలాంటి ఢోకా ఉండదు. ఇందుకు చెరువులు, కుంటలు దోహదం చేస్తాయి. ఇదే లక్ష్యంతో నీటి వనరుల్లో పూడికతీత తీయడమే కాకుండా రైతులకు ఒండ్రు మట్టిని పంపిణీ చేస్తూ వినియోగించే తీరుపై

Published : 26 Jan 2022 01:41 IST
సెహగల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో..

మహిళా రైతులతో సమావేశం

న్యూస్‌టుడే, శివ్వంపేట: భూగర్భ జలాలు సమృద్ధిగా ఉంటే సాగు, తాగు నీటికి ఎలాంటి ఢోకా ఉండదు. ఇందుకు చెరువులు, కుంటలు దోహదం చేస్తాయి. ఇదే లక్ష్యంతో నీటి వనరుల్లో పూడికతీత తీయడమే కాకుండా రైతులకు ఒండ్రు మట్టిని పంపిణీ చేస్తూ వినియోగించే తీరుపై అవగాహన కల్పిస్తోంది సెహగల్‌ ఫౌండేషన్‌. ఇప్పటికే దేశంలో 13 రాష్ట్రాల్లో నీటి వనరుల అభివృద్ధి పలు కార్యక్రమాలు చేపట్టడం విశేషం. దీనికితోడు విద్యార్థులు చదువుకునేలా ప్రోత్సహించడంతో పాటు డిజిటల్‌ పాఠాల నిర్వహణ చేపట్టారు. ఈ నేపథ్యంలో సదరు స్వచ్ఛంద సంస్థ సేవా కార్యక్రమాలపై కథనం.

సెహగల్‌ ఫౌండేషన్‌ ముందుగా మెదక్‌ జిల్లాలోని శివ్వంపేట మండలం ఎదుల్లాపూర్‌లో తుర్కవాని కుంట, పోతులబోగుడలో ఊర చెరువు, మనోహరాబాద్‌ మండలం పర్కిబండలో ఆల చెరువు, తుపాకులపల్లిలో నాల్దేని కుంటలను అభివృద్ధి చేయడానికి ఎంపిక చేశారు. కుంటలకు రూ.30 లక్షల చొప్పున, చెరువులకు రూ.60 లక్షల చొప్పున కేటాయించి పనులు చేపట్టడం గమనార్హం.

పొలానికి తరలించి..

ఆయా నాలుగు నీటి వనరుల్లో 65 వేల ట్రాక్టర్ల మట్టిని పూడిక తీసి వేలాది మంది రైతుల పొలాల్లో చల్లాలని ఈ స్వచ్ఛంద సంస్థ లక్ష్యంగా నిర్దేశించుకుంది. పూడికతీత తీయడం వల్ల చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. కట్టను మరింత పటిష్టం చేయడంతో పాటు భూగర్భ జల యాజమాన్యానికి 3 ఫ్యూజో మీటర్లు ఏర్పాట్లు చేస్తారు. ఎప్పటికప్పడు జలాల పెరుగుదలను పరిశీలిస్తారు. ఫీడర్‌ ఛానల్‌కు మరమ్మతు చేపట్టాలని నిర్ణయించారు.

ఎదుల్లాపూర్‌ తుర్కవాని కుంటలో ఒండ్రు మట్టిని ట్రాక్టరులో వేస్తున్న జేసీబీ

కమిటీ సహకారం..

సెహగల్‌ ఫౌండేషన్‌ ద్వారా భవిష్యత్తులో చెరువుల నిర్వహణకు అభివృద్ధి కమిటీని నియమిస్తారు. స్థానిక రైతులే ఇందులో భాగస్వాములు. కమిటీలో రైతులు రూ.లక్ష వరకు జమ చేసుకుని అభివృద్ధి, మరమ్మతులకు వినియోగించేలా ప్రణాళిక రూపొందించారు. ఒండ్రు మట్టిని ట్రాక్టరులో జేసీబీతో లోడ్‌ చేసేందుకు రైతు రూ.10 చొప్పున సంస్థకు చెల్లిస్తే సరిపోతుంది. ఇటీవల శివ్వంపేట మండలం ఎదుల్లాపూర్‌ గ్రామ పరిధిలోని తుర్కవాని కుంటలో పూడిక తీత, పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

ప్రోత్సాహకం..

సంస్థ ఆధ్వర్యంలో పిల్లలు చదువుకునేందుకు ప్రోత్సహిస్తున్నారు. భవనాలు మరమ్మతులు చేయించడమే కాకుండా, డిజిటల్‌ తరగతుల నిర్వహణకు సహకారం అందిస్తున్నారు. శుద్ధి జలం తాగేలా యంత్రాలు అందజేశారు. మేడ్చల్‌ జిల్లా రావన్‌కోల్‌, నూతన్‌కాళ్‌, శ్రీరంగవరంలో సదరు కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో శివ్వంపేట మండలం చండి, మేడ్చల్‌ జిల్లా డబిల్‌పూర్‌, షాబాద్‌ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్‌ తరగతులు, వాన నీటి బయోసైడ్‌ ఫిల్టరు, భవనాలకు మరమ్మతులు, ఇతర సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు పంపించారు. ఒక్కో బడికి రూ.30 లక్షలు వెచ్చించాలని నిర్ణయించారు. సిద్దిపేట జిల్లా పరిధి 10 గ్రామాల్లో మహిళా రైతులకు సాగుపై శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో గ్రామంలో 15 నుంచి 20 మందితో సంఘాలు ఏర్పాటుచేశారు.


ప్రయోజనాలెన్నో ఉన్నాయి..

వేమ నారాయణ, కార్యక్రమం అధికారి

భూ గర్భజలాలు పెంచడమే లక్ష్యంగా సెహగల్‌ ఫౌండేషన్‌ కృషి చేస్తోంది. నీటి వనరుల్లోని మట్టి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ విషయమై అవగాహన కల్పిస్తున్నాం. సేంద్రియ సాగుతో కలిగే లాభాలను వివరిస్తున్నాం. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సేవా కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని