logo

సంక్షిప్త వార్తలు

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ (కేఎస్‌బీఎల్‌) కుంభకోణంలో ఆ సంస్థ సీఎండీ పార్థసారథిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కస్టడీకి ఇస్తూ పీఎంఎల్‌ఏ కేసుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఆదేశాలిచ్చింది. ఈనెల 27 నుంచి 31 వరకు కస్టడీకి అనుమతించింది.

Published : 26 Jan 2022 02:46 IST

ఈడీ కస్టడీకి కార్వీ సీఎండీ పార్థసారథి

ఈనాడు, హైదరాబాద్‌: కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ (కేఎస్‌బీఎల్‌) కుంభకోణంలో ఆ సంస్థ సీఎండీ పార్థసారథిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కస్టడీకి ఇస్తూ పీఎంఎల్‌ఏ కేసుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఆదేశాలిచ్చింది. ఈనెల 27 నుంచి 31 వరకు కస్టడీకి అనుమతించింది. వినియోగదారుల షేర్లను వారికి తెలియకుండానే కార్వీ సంస్థ బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు తీసుకున్న కుంభకోణంపై ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ నిధుల్ని ఇతర సంస్థలకు మళ్లించడం ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ ఇప్పటికే ఆధారాలు సేకరించింది. ఈ కేసు దర్యాప్తు క్రమంలోనే నాలుగు రోజుల క్రితం పార్థసారథితోపాటు మరొకరిని బెంగళూరులో అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌ తీసుకొచ్చి పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరిచింది. ప్రస్తుతం పార్థసారథితోపాటు మరో నిందితుడు ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్నారు. నిధుల మళ్లింపు వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు పార్థసారథిని విచారించేందుకు తాజాగా న్యాయస్థానం అనుమతి కోరింది.


సీసీ రోడ్లకు రూ.10.64 కోట్లు మంజూరు: ఎంపీ

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌: చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 157 పంచాయతీల్లో అంతర్గత రహదారులు, మురుగు కాల్వల, భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణానికి రూ.10.64 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు ఎంపీ రంజిత్‌రెడ్డి పేర్కొన్నారు. మొత్తం 7 శాసనసభా నియోక వర్గాలుండగా, అందులో శేరిలింగంపల్లి మినహా, మిగతా వికారాబాద్‌, పరిగి, తాండూరు, చేవెళ్ల, రాజేందర్‌నగర్‌, మహేశ్వరం, నియోజకవర్గాలకు ఈ నిధులు విడుదలయ్యాయని తెలిపారు. ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల చొప్పున కేటాయించామన్నారు. ఇది తొలివిడత మాత్రమేనని, రెండో విడతలో మరికొన్ని గ్రామాలకు నిధులు రానున్నాయన్నారు.


ప్రిన్సిపాళ్ల నియామకం చేపట్టకుంటే చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌ కళాశాలల్లో వారి నియామకాలపై జేఎన్‌టీయూ-హెచ్‌ దృష్టి సారించింది. గడువు ముగిసిన కళాశాలల యాజమాన్యాలు వెంటనే ప్రిన్సిపల్‌ నియామకాలు చేపట్టాలని రిజిస్ట్రార్‌ ఆదేశాలు జారీ చేశారు. నెల రోజుల్లో నియామకాలు పూర్తి చేయడం లేదా ప్రస్తుతం ఉన్నవారిని తిరిగి కొనసాగించవచ్చని సూచించారు. గడువు ముగిసిన తర్వాత నియామకాలు చేపట్టకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే జగిత్యాల ఇంజినీరింగ్‌ కళాశాల న్యాక్‌ ఎ+ గ్రేడ్‌ సాధించింది.


ఏపీ డీజీపీ కార్యాలయానికి తిరుమల అదనపు ఎస్పీ సరెండర్‌

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శాంతి, భద్రతల అదనపు ఎస్పీ ఎం.మునిరామయ్యపై నమోదైన ఛీటింగ్‌ కేసులో ఏపీ డీజీపీ కార్యాలయానికి ఏఎస్పీని సరెండర్‌ చేయాలని తిరుపతి అర్బన్‌ ఎస్పీ కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. ఇప్పటికే అదనపు ఎస్పీ మూడు వారాల వైద్య సెలవుపై వెళ్లారు. దీంతో అర్బన్‌ జిల్లా ఎస్పీ వెంకటప్పలనాయుడు కౌంటర్‌ అప్పీల్‌ వేసి వైద్య సెలవులపై ఉన్న అదనపు ఎస్పీకి డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా నోటీసు జారీ చేశారు. తిరుమల అదనపు ఎస్పీపై హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌)లో ఛీటింగ్‌ కేసు నమోదైన విషయం తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి చుండూరు సునీల్‌కుమార్‌ నుంచి రూ.1.2 కోట్లు కాజేసిన వ్యవహారంపై బాధితుడి ఫిర్యాదు మేరకు సదరు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ఏఎస్పీని ఏపీ డీజీపీ కార్యాలయానికి సరెండర్‌ చేయాల్సిందిగా ఆదేశిస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.


భారత్‌, ఫ్రాన్స్‌ పరిశోధన సంస్థల ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: ప్రపంచం ముందు పొంచి ఉన్న ఆరోగ్య సమస్యలను ధీటుగా ఎదుర్కొనేందుకు భారత్‌, ఫ్రాన్స్‌ దేశాలకు చెందిన పరిశోధనల సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ), ఫ్రాన్స్‌లోని బయాలజీ ప్రైవేటు సంస్థ ఇనిస్టిట్యూట్‌ పాశ్చర్‌ పరిశోధన సంస్థలు అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ శేఖర్‌ మండె, ఇనిస్టిట్యూట్‌ పాశ్చర్‌ అధ్యక్షుడు ఆచార్య స్టీవార్ట్‌ కోలో అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు. వంశపారంపర్య జబ్బులు-వ్యక్తిగత వైద్యం, యాంటిబయోటిక్స్‌ నిరోధకతపై మరింత అవగాహన, ఇన్‌ఫెక్షన్‌ రోగాలు మళ్లీ వచ్చే సామర్థ్యం ఏ మేరకు? ఔషధ పరీక్షలకు నూతన మోడల్స్‌ అభివృద్ధి.. అనే అంశాలపై పరిశోధనలు చేయనున్నారు.


సీసీ రోడ్లకు రూ.25.3కోట్లు మంజూరు

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లాలో సీసీ రహదారుల నిర్మాణానికి రూ.25.3 కోట్లు మంజూరయ్యాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్‌ నిధులు మంజూరు చేశారన్నారు. మండలాలవారీగా నిధులు విడుదలైనట్లు చెప్పారు. అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలానికి రూ.2కోట్లు, చేవెళ్లకు రూ.75లక్షలు, చౌడపూర్‌కు రూ.24లక్షలు, ఫరూఖ్‌నగర్‌కు రూ.1.84కోట్లు, ఇబ్రహీంపట్నానికి రూ.1.75కోట్లు, కందుకూరుకు రూ.3.10కోట్లు, కేశంపేటకు రూ.1.36కోట్లు, కొందర్గుకు రూ.1.23కోట్లు, కొత్తూరుకు రూ.55లక్షలు, మహేశ్వరానికి రూ.3.05కోట్లు, మంచాలకు రూ.2.20కోట్లు, మొయినాబాద్‌కు రూ.1.10కోట్లు, నందిగామకు రూ.90లక్షలు, షాబాద్‌కు రూ.20లక్షలు(మెటల్‌ రోడ్లకు రూ.40లక్షలు), శంషాబాద్‌కు రూ.10లక్షలు, శంకర్‌పల్లికి రూ.10లక్షలు, తలకొండపల్లికి రూ.30లక్షలు, యాచారానికి రూ.2.10కోట్లు కేటాయించినట్లు చెప్పారు.


అంబేడ్కర్‌ వర్సిటీ సిబ్బంది సంఘం ఎన్నికలు

జూబ్లీహిల్స్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ బోధనేతర సిబ్బంది సంఘం ఎన్నికలు ఈనెల 29న జరగనున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులు అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి తదితర పదవులకు పోటీపడుతుండగా.. ఎన్నికల అధికారి పత్రాల పరిశీలన అనంతరం తుది జాబితా విడుదల చేశారు. ఇందులో భాగంగా అధ్యక్ష పదవికి మహేశ్వర్‌గౌడ్‌, ప్రేంకుమార్‌, ఉపాధ్యక్ష పదవికి సత్యనారాయణ, మియాజానీ, ప్రవీణ్‌, భూలక్ష్మి, సంయుక్త కార్యదర్శి పదవికి మాసయ్య, పండు కోశాధికారిగా శంకర్‌బాబు, కమర్‌పాషా, వెంకటపిచ్చయ్య బరిలో ఉన్నారు. ప్రధాన కార్యదర్శిగా వి.మార్కండేయ శర్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


పరిశోధన పూర్తికి గడువు పెంపు

ఉస్మానియా యూనివర్సిటీ, న్యూస్‌టుడే: ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలో పీహెచ్‌డీ పూర్తి చేసే గడువును మార్చి 31 వరకు పొడిగించారు. గతంలో ఈనెల 31 వరకు ఉండేది. పరిశోధనకు సంబంధించిన ప్రీ సబ్మిషన్‌ సెమిషన్‌ను ఈనెల 31లోపు పూర్తి చేయాలని నిబంధన విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని