logo

పరిశోధన సమర్పణకూ భారం!

పీహెచ్‌డీ థీసిస్‌ సమర్పణ పరిశోధక విద్యార్థులకు భారంగా మారింది. రూ.వేలు వసూలు చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్ణయించడంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని

Published : 27 Jan 2022 05:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: పీహెచ్‌డీ థీసిస్‌ సమర్పణ పరిశోధక విద్యార్థులకు భారంగా మారింది. రూ.వేలు వసూలు చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్ణయించడంతో ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని వాపోతున్నారు. ఉస్మానియా వర్సిటీలో దాదాపు 3,500 మంది పరిశోధక విద్యార్థుల ఉన్నారు. రెగ్యులర్‌ విద్యార్థి ఐదేళ్లు, పార్ట్‌టైం విద్యార్థి ఆరేళ్లలో పీహెచ్‌డీ పూర్తి చేయాలి. 2013 కంటే ముందు పీహెచ్‌డీ ప్రవేశాలు తీసుకున్న విద్యార్థులందరూ గత డిసెంబరు 31లోపు థీసిస్‌ సమర్పించాలని గతేడాది ఓయూ అధికారులు ప్రకటించారు. దీనిపై వ్యతిరేకతతోపాటు విద్యార్థుల నుంచి పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు రావడంతో తొలుత ఈ నెల 31 వరకు పొడిగించి.. తాజాగా మార్చి 31 వరకు పెంచారు. థీసిస్‌ సమర్పణ గడువును మూడేళ్లకు విస్తరించుకునే అవకాశం ఉండగా.. ఏటా రూ.2 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రూ.11 వేలు చెల్లించాలని ఓయూ అధికారులు ప్రకటించారు.

ఫెలోషిప్‌లు రాక.. రెండేళ్లుగా కరోనా కారణంగా పీహెచ్‌డీకి పరిశోధనలు ముందుకు సాగలేదు. ఈ దశలో అదనపు ఫీజులు చెల్లిస్తేనే థీసిస్‌ సమర్పణకు అవకాశం ఇస్తామని చెప్పడం దారుణమని విద్యార్థులు వాపోతున్నారు. ఈ నిర్ణయాన్ని అధికారులు పునఃసమీక్షించుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ ఓయూ మాజీ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. ఈ విషయమై ఓయూ రిజిస్ట్రార్‌ లక్ష్మీనారాయణను సంప్రదించగా.. 2019లో తీసుకున్న నిర్ణయాన్నే అమలు చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని