logo

రోడ్డు ప్రమాదంలో ఊపిరాగి.. అవయవ దానంతో ఆరుగురికి ప్రాణం

రోడ్డు ప్రమాదంలో ఊపిరాగినా అవయవ దానంతో ఆరుగురి జీవితాలకు ప్రాణం పోశాడు ఓ డ్రైవర్‌. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన బానోతు శ్రీను(33) డ్రైవింగ్‌ చేస్తూ

Published : 27 Jan 2022 02:49 IST
శ్రీను

ఈనాడు, హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదంలో ఊపిరాగినా అవయవ దానంతో ఆరుగురి జీవితాలకు ప్రాణం పోశాడు ఓ డ్రైవర్‌. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన బానోతు శ్రీను(33) డ్రైవింగ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతనికి భార్య పల్లవి, చత్రపతి, నవ్యశ్రీ అనే ఇద్దరు పిల్లలున్నారు. ఈ నెల 22వ తేదీన తన సోదరునితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. రాత్రి 8.30గంటల ప్రాంతంలో వాహనానికి పంది అడ్డుగా వచ్చింది. దీంతో వారు అదుపుతప్పి కిందపడి పోయారు. ప్రమాదంలో శ్రీను తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరంలోని మలక్‌పేట యశోద ఆసుపత్రికి తీసుకొచ్చారు. అత్యవసర విభాగంలో మూడు రోజుల పాటు వైద్యం అందించిన వైద్యులు బ్రెయిన్‌ డెడ్‌(జీవన్మృతుడు) అయినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న జీవన్‌దాన్‌ వైద్య బృందం అవయవ దానంపై శ్రీను కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. వారు అంగీకరించడంతో అతని రెండు కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, రెండు కంటి కార్నియాలు సేకరించి శస్త్ర చికిత్స ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు అమర్చినట్లు జీవన్‌దాన్‌ ఇన్‌ఛార్జి స్వర్ణలత వెల్లడించారు.

ఊపిరితిత్తుల తరలింపునకు గ్రీన్‌ ఛానెల్‌

బన్సీలాల్‌పేట్‌, న్యూస్‌టుడే: ఊపిరిత్తులను వేగంగా ఆస్పత్రికి చేర్చడానికి నగర ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌ఛానెల్‌ ఏర్పాటు చేశారు. వైజాగ్‌ నుంచి కిమ్స్‌ ఆసుపత్రికి చేరాల్సిన ఊపిరితిత్తులు తొలుత నగరంలోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నాయి. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మినిస్టర్‌ రోడ్డు కిమ్స్‌ ఆసుపత్రికి నగర ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌ఛానెల్‌ ఏర్పాటు చేశారు. దీంతో బేగంపేట విమానాశ్రయం నుంచి కిమ్స్‌ ఆసుపత్రి మధ్య 3 కి.మీల దూరాన్ని కేవలం 4 నిమిషాల్లో చేరుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని