logo

ఆ నలుగురు ఎక్కడ?

రాజధాని నగరంలో డ్రగ్స్‌ వినియోగిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్న హైదరాబాద్‌ పోలీసులు.. డ్రగ్స్‌ స్మగ్లర్‌ టోనీ నుంచి మాదక ద్రవ్యాలను తీసుకున్న నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Updated : 27 Jan 2022 02:51 IST

కొకైన్‌ కేసులో నిందితుల కోసం పోలీసుల వేట

రెండేళ్లుగా టోనీ నుంచి మాదకద్రవ్యాల కొనుగోలు

ఈనాడు, హైదరాబాద్‌

రాజధాని నగరంలో డ్రగ్స్‌ వినియోగిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్న హైదరాబాద్‌ పోలీసులు.. డ్రగ్స్‌ స్మగ్లర్‌ టోనీ నుంచి మాదక ద్రవ్యాలను తీసుకున్న నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం టోనీ సహా పది మందిని అరెస్ట్‌ చేసిన పంజాగుట్ట పోలీసులు ఈ కేసులో గజేంద్రపారిఖ్‌, సోమాశశికాంత్‌, అలోక్‌జైన్‌, సంజయ్‌లకు సంబంధం ఉందని ఆధారాలు సేకరించారు. ఈ నలుగురిలో ఒకరు నగరంలోని ప్రముఖ వ్యాపారి కుమారుడని గుర్తించారు. వీరంతా రెండేళ్లుగా టోనీ నుంచి కొకైన్‌ను తీసుకుంటున్నారని సమాచారం. వీరితో పాటు డ్రగ్స్‌ తీసుకుంటున్న నిందితులను కొద్ది రోజుల ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో అప్రమత్తమైన గజేంద్రపారిఖ్‌, అలోక్‌జైన్‌, సంజయ్‌, సోమాశశికాంత్‌లు పారిపోయారు. అప్పటి నుంచి పోలీసులు వీరికోసం వేట కొనసాగిస్తున్నారు. వీరిలో ఇద్దరు నిందితులు బంజారాహిల్స్‌, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌లోని కొన్ని పంచతార హోటళ్లు, పబ్బుల్లో పార్టీలు నిర్వహించి అందులో కొకైన్‌ను సరఫరా చేసేవారని పోలీసులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు.

వినియోగమా? సరఫరానా??

మాదక ద్రవ్యాలను తరచూ తీసుకుంటున్న నిరంజన్‌ కుమార్‌ జైన్‌, అలోక్‌జైన్‌, అగర్వాల్‌, గజేంద్ర పారిఖ్‌లు తమ సొంతానికి డ్రగ్స్‌ వాడుతున్నారా? లేక టోనీ నుంచి కొకైన్‌ను కొనుగోలు చేసి హైదరాబాద్‌లో ఇంకా ఎవరికైనా విక్రయిస్తున్నారా?కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. డ్రగ్స్‌ అవసరమైనప్పుడు నిరంజన్‌, అగర్వాల్‌లు తమ డ్రైవర్లను ముంబయికి పంపించి టోనీ నుంచి కొకైన్‌ను తెప్పించేవారని, సొంత వినియోగానికైతే ఇంత కొకైన్‌ అవసరం లేదని పోలీసులు అంచనా వేస్తున్నారు. రూ.వందల కోట్ల టర్నోవర్‌ ఉన్న వ్యాపారాలను నిర్వహిస్తున్న వీరంతా డ్రగ్స్‌కు ఎలా అలవాటు పడ్డారన్న కోణాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న నిందితుల్లో ఒకరు రహస్యంగా క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడని, ముంబయి, దిల్లీల్లోని బుకీలతో సంబంధాలు ఉన్నాయని తెలుసుకున్నారు. డ్రగ్స్‌ వ్యవహారంలో మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో పోలీస్‌ కస్టడీకి పిటిషన్‌ వేయగా.. నిందితులు బెయిల్‌ కోసం కోర్టును అభ్యర్థించారు. ఈ రెండు అంశాలపై గురువారం నిర్ణయం వెలువడనుందని పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌ నిరంజన్‌రెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని