logo

సీటు రద్దు చేసుకున్నా.. ఫీజులివ్వరు!

కన్వీనర్‌ కోటా కింద ఇంజినీరింగ్‌ సీటు పొంది.. ఆ తర్వాత రద్దు చేసుకొని వెళ్లిన విద్యార్థులకు ఫీజు వాపసు చేయడంలో ఉన్నత విద్యా మండలి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. నెలల తరబడి ఎంసెట్‌ కన్వీనర్‌, ఉన్నత

Published : 27 Jan 2022 02:49 IST

కన్వీనర్‌ కోటా రుసుములపై ఉన్నత విద్యా మండలి నిర్లక్ష్యం

ఈనాడు, హైదరాబాద్‌

కన్వీనర్‌ కోటా కింద ఇంజినీరింగ్‌ సీటు పొంది.. ఆ తర్వాత రద్దు చేసుకొని వెళ్లిన విద్యార్థులకు ఫీజు వాపసు చేయడంలో ఉన్నత విద్యా మండలి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. నెలల తరబడి ఎంసెట్‌ కన్వీనర్‌, ఉన్నత విద్యా మండలి కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ప్రయోజనం ఉండటం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎంసెట్‌ రాసిన విద్యార్థులు కన్వీనర్‌ కోటా కింద కళాశాలలను ఎంచుకొంటే బ్రాంచీలు, కళాశాలల ఆధారంగా రూ.65 వేల నుంచి రూ.1.3 లక్షల వరకు ఫీజు చెల్లించి సీటు ఖరారు చేసుకుంటారు. ఆ తర్వాత జేఈఈ-మెయిన్‌ లేదా జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు వస్తే ఇక్కడి సీటు రద్దు చేసుకొని ఐఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఎన్‌ఐటీల బాట పడుతుంటారు. ఇక్కడ సీటు రద్దు చేసుకొని ఫీజు తిరిగి పొందేందుకు ఉన్నత విద్యా మండలి ప్రత్యేకంగా సమయం ఇస్తుంది. ఆ సమయంలో సీటు రద్దు చేసుకుంటున్నట్లుగా దరఖాస్తు చేసుకొని ఫీజు తిరిగి పొందేందుకు వీలుంటుంది. అలా దరఖాస్తు చేసుకొని ఫీజు తిరిగి ఇవ్వాలని ఉన్నత విద్యా మండలి, ఎంసెట్‌ కన్వీనర్‌ కార్యాలయ అధికారులను కలిసినా.. అధికారులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. అప్పు తెచ్చి ఫీజు కడుతున్నామని, అవి వెనక్కి ఇవ్వకపోవడంతో ఇబ్బందిపడుతున్నామని చెబుతున్నారు. 206 మంది విద్యార్థులకు కన్వీనర్‌ కోటా కింద ఫీజులు వెనక్కి ఇవ్వాల్సి ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు.

ఎప్పటికి వస్తుందో..

నగరానికి చెందిన ముడి కృష్ణవంశీ(హాల్‌టికెట్‌ నం.2026డీ01336) 2020-21 విద్యా సంవత్సరంలో ఎంసెట్‌ రాసి వాసవి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈసీఈ సీటు సాధించాడు. ఎంసెట్‌ కన్వీనర్‌ కోటా రూ.1.3 లక్షల ఫీజు చెల్లించాడు. కళాశాలకు లైబ్రరీ ఫీజులు చెల్లించాడు. జేఈఈలోనూ మంచి ర్యాంకు రావడంతో ఇక్కడ సీటు రద్దు చేసుకొని ట్రిపుల్‌ ఐటీ చిత్తూరులో చేరాడు. కళాశాలకు చెల్లించిన ఫీజులు యాజమాన్యం వాపసు ఇచ్చింది. కన్వీనర్‌ కోటా కింద చెల్లించిన రూ.1.3 లక్షల ఫీజును తిరిగి వెనక్కి ఇవ్వకుండా ఉన్నత విద్యా మండలి నిర్లక్ష్యం ప్రదర్శించింది. కృష్ణవంశీ తండ్రి అంజయ్య అప్పు చేసి తెచ్చి ఫీజులు చెల్లించారు. నిర్దేశిత సమయంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫీజు వెనక్కి ఇవ్వలేదని ఆయన వాపోయారు.

ఏటా ఈ సమస్య..

ఏటా ఎంసెట్‌, జేఈఈ విషయంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతున్నప్పటికీ సమస్యను పరిష్కరించే విషయంలో ఉన్నత విద్యామండలి దృష్టి పెట్టడం లేదు. ఎంసెట్‌ కౌన్సెలింగ్‌ ముందుగానే నిర్వహిస్తుండటం.. తర్వాత జేఈఈ సీట్ల కేటాయింపు జరుగుతోంది. దీనివల్ల ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో సీట్లు పొంది.. తర్వాత జేఈఈలో ర్యాంకు వస్తే వెళ్లిపోతున్నారు. దీనివల్ల ప్రభుత్వ విభాగంలోనూ సీట్లు మిగిలిపోతున్నాయి. ఏటా సమస్య ఉత్పన్నమవుతున్నా.. అధికారులు ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ కట్టిన ఫీజులు వెనక్కి రాకపోవడంతో ఐఐటీ, ట్రిపుల్‌ఐటీలో చేరిన తర్వాత మళ్లీ అప్పు చేసి కట్టాల్సి వస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు.

వెనక్కి ఇచ్చేస్తాం - ఆర్‌.లింబాద్రి, ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌

ఫీజు వాపసుకు నిర్దేశిత సమయంలో దరఖాస్తు చేస్తే అవకాశం కల్పిస్తున్నాం. వాపసు రాని విద్యార్థులు ఉన్నత విద్యా మండలికి దరఖాస్తు చేసుకోవచ్ఛు ఇబ్బంది లేకుండా చూస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు