logo

మళ్లీ కరోనా సోకితే.. 3 నెలల తర్వాతే బూస్టర్‌!

ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న శ్రీనివాస్‌కు ఇది వరకే కరోనా సోకింది. అనంతరం రెండో డోసు టీకా కూడా తీసుకున్నారు. తాజాగా ముందస్తు నివారణ టీకా(బూస్టర్‌)కు సిద్ధమయ్యారు. ఇంతలో మళ్లీ వైరస్‌

Updated : 27 Jan 2022 02:53 IST

యాంటీబాడీల పరీక్షలతోనూ నిర్ధారణ

ఇంట్లోనే కోలుకుంటున్న 98 శాతం మంది

ఈనాడు, హైదరాబాద్‌

ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న శ్రీనివాస్‌కు ఇది వరకే కరోనా సోకింది. అనంతరం రెండో డోసు టీకా కూడా తీసుకున్నారు. తాజాగా ముందస్తు నివారణ టీకా(బూస్టర్‌)కు సిద్ధమయ్యారు. ఇంతలో మళ్లీ వైరస్‌ సోకింది. దీంతో బూస్టర్‌ డోసు ఎప్పుడు తీసుకోవాలనేది సందేహం. చాలామంది పరిస్థితి ఇలాగే ఉంది. పలువురు మొదటి, రెండో విడతల్లో కొవిడ్‌ బారిన పడ్డారు. టీకా అందుబాటులోకి రావడంతో రెండు డోసులు తీసుకున్నారు. ఇలాంటి వారు వ్యాక్సిన్‌ తీసుకొని 6 నుంచి 9 నెలల కూడా దాటింది. బూస్టర్‌కు సిద్ధమవుతున్న సమయంలోనే చాలామంది మళ్లీ మహమ్మారి బారిన పడుతున్నారు. వారంతా ఇంటి వద్దే ఉంటూ కోలుకుంటున్నారు. ఇంతకుముందు తీసుకున్న రెండు డోసుల వ్యాక్సిన్‌ కారణంగా ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితి ఉండటం లేదు. తాజాగా మళ్లీ వైరస్‌ బారిన పడిన నేపథ్యంలో ఎన్ని రోజుల తర్వాత బూస్టర్‌ తీసుకోవాలనేది చర్చనీయాంశమవుతోంది. తొలి, రెండు దశల్లో మహమ్మారి సోకిన అనంతరం 3 నెలల తర్వాత టీకా తీసుకోవాలని వైద్యులు సూచించారు. అప్పటివరకు సహజసిద్ధమైన యాంటీబాడీలు శరీరంలో ఉన్నందున 3 నెలలలోపు మళ్లీ వైరస్‌ సోకే అవకాశం తక్కువ. రెండోసారి ఇన్‌ఫెక్షన్‌ సోకి కోలుకున్న తర్వాత కూడా మూడు నెలల వరకు టీకా అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. 90 రోజులు దాటిన అనంతరం బూస్టర్‌ తీసుకోవచ్చునని సూచిస్తున్నారు.

పరీక్షలకు దూరంగా ఉంటే...

చాలామందిలో ఒమిక్రాన్‌లో స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి. జలుబు, దగ్గు, జ్వరం, గొంతులో గరగర, పొడి దగ్గు ఎక్కువ మందిలో ఉంటోంది. కొందరు పరీక్షలు చేయించుకోవడం లేదు. ఈ లక్షణాలు ఉంటే.. అనుమానంతో ఇంట్లోనే ఉంటూ చికిత్సలు తీసుకుంటున్నారు. 3-5 రోజుల్లో తగ్గిపోతుండటంతో బయటకు వచ్చేస్తున్నారు. పరీక్షలు చేయించుకోని వారికి వైరస్‌ సోకింది.. లేనిది చెప్పడం కష్టమే. మహమ్మరి సోకి...పరీక్షలు చేయించుకోకపోతే.. బూస్టర్‌ డోసు ఎప్పుడు తీసుకోవాలనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి వారు ఐజీఎం, ఐజీజీ యాంటీబాడీల పరీక్షలు చేసుకుంటే శరీరంలో యాంటీబాడీలు ఉన్నవి.. లేనివి తెలిసిపోతుందని వైద్యులు చెబుతున్నారు. ఐజీఎం టెస్టులో యాంటీబాడీలు ఉంటే ఇటీవలే కరోనా సోకినట్లు లెక్క. ఐజీజీలో పరీక్షలో యాంటీబాడీలు ఉంటే...గతంలో కరోనా లేదా టీకా కారణంగా యాంటీబాడీలు తయారైనట్లు అంచనా. ఈ రిపోర్టుల ప్రకారం వైద్యుల సూచనలతో టీకాలు తీసుకోవచ్ఛు ఎక్కువ యాంటీబాడీలు ఉంటే...అప్పటికప్పుడు బూస్టర్‌ అవసరం లేదని, మూడు నెలల వరకు నిరీక్షించినా ఇబ్బంది ఉండదని వైద్యులు పేర్కొంటున్నారు.

గ్రేటర్‌లో 1570 కేసులు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1570 మందికి కరోనా సోకింది. మంగళవారం 1450 మందికి సోకగా.. తాజాగా కేసుల్లో స్వల్ప పెరుగుదల కన్పించింది. మేడ్చల్‌ జిల్లాలో 254 మంది, రంగారెడ్డిలో 284 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఈ రెండు జిల్లాల్లో ముందు రోజు కంటే కేసులు తక్కువ నమోదయ్యాయి. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని, ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకాలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.


అప్పుడే తీసుకోవాలి

-డాక్టర్‌ శివరాజ్‌, సీనియర్‌ ఫిజీషియన్‌, కిమ్స్‌

రెండు డోసుల తర్వాత కొవిడ్‌ సోకి తగ్గిన 3 నెలల తర్వాతే బూస్టర్‌ డోసు తీసుకోవాలి. అప్పటి వరకు సహజ యాంటీబాడీల రక్షణ శరీరానికి ఉంటుంది. ఒమిక్రాన్‌లో తక్కువ లక్షణాలు ఉంటున్నాయి. చాలా తక్కువ మందికి మాత్రమే ఆసుపత్రి సేవలు అవసరం అవుతున్నాయి. ఇంట్లో ఉండి కోలుకున్న వారికి బ్లడ్‌ తిన్నర్‌ మాత్రలు, యాంటీ వైరల్‌ మందులు, సిటీస్కాన్‌లు అవసరం లేదు. అవసరం లేకపోయినా పదే పదే సిటీస్కాన్‌ తీసుకోవడం వల్ల రేడియేషన్‌తో దుష్ఫలితాలు కలిగే ప్రమాదం ఉంది. పిల్లలు, బాలింతలు, గర్భిణులకు యాంటీ వైరల్‌ మందులు సొంతంగా వాడకూడదు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని