logo

కోలుకోని కోచింగ్‌ సెంటర్లు..!

ఐటీ ఉద్యోగం, విదేశీ కొలువుల కలలతో కోచింగ్‌ సెంటర్లకు వచ్చే విద్యార్థులతో సందడిగా కనిపించే అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌, కూకట్‌పల్లి.., ప్రభుత్వ ఉద్యోగం కోసం అహర్నిశలు

Published : 27 Jan 2022 02:49 IST

నిర్వహణ భారంతో మూతపడుతున్నాయ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ఐటీ ఉద్యోగం, విదేశీ కొలువుల కలలతో కోచింగ్‌ సెంటర్లకు వచ్చే విద్యార్థులతో సందడిగా కనిపించే అమీర్‌పేట, ఎస్సార్‌నగర్‌, కూకట్‌పల్లి.., ప్రభుత్వ ఉద్యోగం కోసం అహర్నిశలు పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులతో కిటకిటలాడే అశోక్‌నగర్‌.., పోలీస్‌, బ్యాంకింగ్‌ పరీక్షల్లో రాణించాలని తపించే అభ్యర్థులతో కనిపించే దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాలు కరోనా కారణంగా బోసిపోయాయి.

స్పష్టమైన హామీ ఇస్తేనే... బల్దియా లెక్కల ప్రకారం అమీర్‌పేట ప్రాంతంలో మొత్తం 1,871 ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. ఎస్సార్‌నగర్‌, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, దిల్‌సుఖ్‌నగర్‌, హిమాయత్‌నగర్‌, ఎల్బీనగర్‌, అశోక్‌నగర్‌, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో మరో 1500 ఇన్‌స్టిట్యూట్‌లు ఉన్నాయి. క్రాష్‌ కోర్సులు, ఫాస్ట్రాక్‌ కోర్సులు, బ్యాంకింగ్‌, ఎస్సెస్సీ, గ్రూప్స్‌, రైల్వే, జావా, పైథాన్‌, సీ, సీప్లస్‌ప్లస్‌, ఏడబ్ల్యూఎస్‌, సాప్‌, జావాస్క్రిప్ట్‌ ఫ్రంట్‌ ఎండ్‌, బ్యాక్‌ ఎండ్‌, ఫుల్‌స్టాక్‌ వంటి సాఫ్ట్‌వేర్‌ కోర్సులతోపాటు పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాలు విద్యార్థులతో కిటకిటలాడేవి. కొవిడ్‌ మొదటి వేవ్‌ నుంచి విద్యార్థులు ఇంటి బాట పట్టడం, లాక్‌డౌన్‌ ఆంక్షలతో మూడు నెలలపాటు కోచింగ్‌ సెంటర్లను మూసివేశారు. ఈ ప్రాంతాల్లో 400 లకుపైగా ఇన్‌స్టిట్యూట్‌లు మూతపడ్డాయి. ఒక్కో బ్యాచ్‌లో వంద మందికిపైగా విద్యార్థులు చేరే కోచింగ్‌ సెంటర్లలో ప్రస్తుతం 50కి మించడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. కరోనా తర్వాత విద్యార్థుల ఆలోచనల్లో మార్పు వచ్చిందని.. శిక్షణతోపాటే ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే వస్తున్నాట్లు ప్రజ్ఞా ఇన్‌స్టిట్యూట్‌ నిర్వాహకుడు మనోజ్‌ తెలిపారు.

పెరిగిన రెంటల్‌ షేరింగ్‌ విధానం...

నగరంలో రెండు, మూడు ప్రాంతాల్లో బ్రాంచీలు ఏర్పాటు చేసిన ఇన్‌స్టిట్యూట్‌లు సైతం ఆ సంఖ్యను తగ్గించుకున్నాయి. ఒకే అపార్ట్‌మెంట్‌ లేదా గదుల్లోకి మారిపోయి రెంటల్‌ షేరింగ్‌ విధానాన్ని అవలంభిస్తున్నాయి. రెండు గదులు అద్దెకు తీసుకొని వేర్వేరు కార్యాలయాలు నిర్వహిస్తూ అద్దెను పంచుకుంటున్నారు. అక్కడే అడ్మిషన్లు తీసుకొని శిక్షకుల ద్వారా ఆన్‌లైన్‌లో ఇంటి నుంచి తరగతులు నిర్వహిస్తున్నట్లు ఓ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వాహకుడు మురళి తెలిపారు.

అరకొరగా అడ్మిషన్లు

- వంశీ, మైండ్‌ క్యూ సిస్టమ్స్‌ నిర్వాహకుడు

కరోనా మొదటి వేవ్‌ నుంచి ఇన్‌స్టిట్యూట్‌లపై నిర్వహణ భారం పడుతూనే ఉంది. మొదటి లాక్‌డౌన్‌ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు మాత్రమే జరగుతున్నాయి. అడ్మిషన్లు అరకొరగానే వస్తున్నాయి. భౌతికంగా తరగతులు లేకపోయినా భవనాల అద్దెలు, వేతనాలు చెల్లించాల్సిందే. నిర్వహణ భారం పెరుగుతోంది.

50 శాతం ప్రభావం

- ఉమేశ్‌, కెరీర్‌ పవర్‌ ఇన్‌స్టిట్యూట్‌, దిల్‌సుఖ్‌నగర్‌

కోచింగ్‌ సెంటర్లపై కరోనా ప్రభావం ఉంది. రెండో వేవ్‌ తర్వాత నోటిషికేషన్లు వస్తాయని ప్రకటన రాగానే అడ్మిషన్ల కోసం వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఇంతలోనే ఒమిక్రాన్‌ వ్యాప్తి పెరుగుతోందని వార్తలు రావడంతో 50 శాతం మంది అభ్యర్థులు వెనక్కి తగ్గారు. మళ్లీ లాక్‌డౌన్‌ ఉంటుందేమో.. హాస్టళ్ల నుంచి పంపిస్తారేమోనని చాలా మంది భావించారు. ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని