logo

కరోనా ఉందిగా.. కొన్నాళ్లు ఆగుదాం!

కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, సంక్రాంతి పండక్కి తెలుగు రాష్ట్రాల్లో సొంతూళ్లకు వెళ్లిన వారిలో చాలా మంది నగరానికి ఇంకా తిరిగి రాలేదు.

Published : 27 Jan 2022 02:49 IST

వైరస్‌ తీవ్రత తగ్గాకే నగరానికి వచ్చేందుకు మొగ్గు

ఈనాడు డిజిటల్‌- హైదరాబాద్‌: కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, సంక్రాంతి పండక్కి తెలుగు రాష్ట్రాల్లో సొంతూళ్లకు వెళ్లిన వారిలో చాలా మంది నగరానికి ఇంకా తిరిగి రాలేదు. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించడం.. పలు సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచే విధులకు అవకాశం ఇవ్వడంతో ఎక్కువ మంది గ్రామాల్లోనే ఉండిపోయారు. కేసులు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చాకే తిరిగి వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. సంక్రాంతి పండగకు ముందు సొంతూళ్లకు వెళ్లే వారితో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ కనిపించింది. తిరిగొచ్చే సమయంలో ఆ స్థాయి రద్దీ కనిపించకపోవడం ఇందుకు నిదర్శనం. రోజువారీగా కూలీ దొరుకుతుందో లేదనన్న భయంతో కొందరు, కుటుంబంలో చిన్నారులు, వృద్ధులుండటం, అనారోగ్య సమస్యలున్న వారు.. ఇలా వేర్వేరు కారణాలతో ఎక్కువ మంది నగరానికి తిరిగి రాలేదు.

చిన్న ఇళ్లలో ఉండే వాళ్లకు పెద్ద కష్టం

నగరంలో చిరుద్యోగాలు చేసుకుంటూ చిన్న ఇళ్లల్లో ఉండేవారి కుటుంబ సభ్యులే ఎక్కువగా గ్రామాల్లో ఉండిపోయారు. ఇంట్లో ఒక్కరికి పాజిటివ్‌ నిర్ధారణ అయినా మిగిలిన వారంతా ఇబ్బందిపడాల్సిన పరిస్థితి. ఐసోలేషన్‌లో ఉండాలంటే ఇల్లు సరిపోకపోవడం.. పరిస్థితి చేయిదాటితే సహాయం అందించేవారు లేకపోతే ఏమిటన్న ఆలోచన.. అనవసరంగా అవస్థలు ఎందుకని భావిస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

అశోక్‌నగర్‌లో కనిపించని హడావుడి

ప్రభుత్వ పోటీ పరీక్షలు, సాఫ్ట్‌వేర్‌ కోర్సులు.. వివిధ రకాల శిక్షణకు హైదరాబాద్‌ ప్రధాన కేంద్రం. తెలంగాణతో పాటు ఏపీలోని యువత వస్తుంటారు. అమీర్‌పేట, అశోక్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాలు తదితర ప్రాంతాల్లో కోచింగ్‌ కేంద్రాల హడావుడి కనిపించేది. కొవిడ్‌ దెబ్బతో ఇప్పుడవి నడవడం లేదు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారు లేక అశోక్‌, చిక్కడపల్లి, అమీర్‌పేటలో ప్రైవేటు హాస్టళ్లలో చేరేవారి సంఖ్య కూడా తగ్గిపోయిందని నిర్వాహకులు వాపోతున్నారు.

పని దొరుకుతుందో లేదోనని..

కూలీ పనులు చేసుకునేవారు, హోటళ్లు, భవన నిర్మాణ కార్మికులు, పరిశ్రమల్లో రోజువారీ లెక్కన ఉపాధి పొందే వారంతా సొంతూరులోనే తాత్కాలికంగా ఏదో ఒక పని చూసుకుంటున్నారు. కరోనా తొలి, రెండో దశ సందర్భంగా రోజువారి కూలీలు, వేర్వేరు ప్రాంతాల నుంచి వలస వచ్చినవారు పనుల్లేక అవస్థలు పడ్డారు. మరోసారి అలాంటి పరిస్థితి ఏర్పడితే ఎలాగన్న ఆందోళనలతో కొందరున్నారు. ప్లంబర్లు, ఏసీ మరమ్మతులు చేసేవారిదీ ఇదే పరిస్థితి. బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా తదితర రాష్ట్రాలకు వెళ్లిన కొందరు మళ్లీ నగరానికి చేరుకోలేదు.


కొత్త వ్యాపారానికి కొవిడ్‌ కాటు

ప్రారంభించేందుకు వెనకడుగు

ఙఈనాడు డిజిటల్‌- హైదరాబాద్‌: కొత్త వ్యాపార ఆలోచనలతో పెట్టుబడి సిద్ధం చేసుకున్న వారిని కొవిడ్‌ దెబ్బ మీద దెబ్బ కొడుతోంది. కరోనా తొలి, రెండో దశలు తగ్గుముఖం పట్టిన వెంటనే రెండేళ్లపాటు నిరీక్షించిన ఔత్సాహికులకు.. మూడో దశ దిక్కుతోచని పరిస్థితికి గురిచేసింది. సొంత ఆస్తులు అమ్మిన వారు కొందరు.. పెట్టుబడి కోసం రుణం తెచ్చుకున్నవారు మరికొందరు.. వ్యాపారం ప్రారంభం కాకముందే ఆర్థిక నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. పెట్టుబడి సమకూర్చుకుని.. వ్యాపారం ప్రారంభించేందుకు మంచి ప్రదేశం ఎంపిక చేసుకున్నాక కేసులు పెరగడం వారికి శరాఘాతంగా మారుతోంది. ఇప్పటికే వ్యాపారం చేస్తున్నవారు.. ఉన్నవాటిని విస్తరించాలన్న ఆలోచనతో ఉన్నవారు.. కొవిడ్‌ మూడో దశ విజృంభణతో మరోసారి నష్టాలు తప్పవేమోనని మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా హోటళ్ల రంగంపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. కొందరు అద్దె భారం, సిబ్బందికి వేతనాలివ్వలేక శాశ్వతంగా మూసేశారు. కరోనా అనంతరం చిన్నస్థాయి హోటళ్లు దాదాపు 3 వేల వరకూ మూసేశారని హోటళ్ల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.


వ్యాపార ఆలోచన పక్కన పెట్టా

- బంటు పండరి, బోరబండ.

‘‘ఆటో మొబైల్‌ రంగంలో విస్తృత అవకాశాలున్నాయి. బోరబండలో కారు, బైక్‌లకు సంబంధించి స్పేర్‌పార్ట్స్‌ విక్రయించే దుకాణం ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారం ప్రారంభించాక నష్టాలు ఎదురైతే భరించలేను. అందుకే వ్యాపార ఆలోచన పక్కనపెట్టా’’


వచ్చే ఆదాయం ఖర్చులకే పోతోంది

- కె.సురేశ్‌, కూకట్‌పల్లి

‘‘కూకట్‌పల్లిలో నాలుగేళ్ల క్రితం చిన్న రెస్టారెంట్‌ ప్రారంభించాం. యువతను ఆకట్టుకునేలా పిజ్జా నుంచి అనేక రకాల వెరైటీలు ఉంచాం. తొలి రెండేళ్ల వరకూ వ్యాపారం బాగా జరిగింది. కరోనా కేసులు పెరిగినప్పటి నుంచి వ్యాపారం క్రమంగా తగ్గింది.’’


వడ్డీ కట్టలేక అప్పు తిరిగిచ్చా

- ఎం.విజయ్‌, అడిక్‌మెట్‌

‘‘నా మిత్రుడితో కలిసి రూ.6 లక్షల పెట్టుబడితో చిన్నస్థాయి హోటల్‌ ప్రారంభించాలనుకున్నా. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని మాదాపూర్‌లో హోటల్‌ ఏర్పాటు చేయడానికి శిక్షణ తీసుకున్నాం. రుణానికి వడ్డీ భారం అధికం కావడంతో వెనక్కిచ్చేశా. మళ్లీ కేసులు పెరగడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా మిత్రుడు వ్యాపార ఆలోచన విరమించుకుని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు’’


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని