logo

ఆన్‌లైన్‌ పాఠం..అంతంతమాత్రం..

కరోనా మహమ్మారి కుటుంబాలను అవస్థలపాలు చేయడమేకాదు విద్యా వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రత్యక్ష బోధన బదులు ప్రభుత్వం ఆన్‌లైన్‌ పాఠాలు నిర్వహిస్తోంది. అన్ని సౌకర్యాలు ఉన్న వారికి ఇవి బాగానే ఉన్నాయి. పేదలు, ఆర్థికంగా తక్కువ ఆదాయం ఉన్న వారి పిల్లలకు ఈ పాఠాలు అందని ద్రాక్షగా మారుతున్నాయి.

Published : 28 Jan 2022 02:37 IST

53.55 శాతం హాజరు
పొలం, ఇతర పనుల్లో విద్యార్థులు
చౌడాపూర్‌లో  విద్యార్థి సామర్థ్యాన్ని పరిశీలిస్తున్న ఉపాధ్యాయులు
ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌, దౌల్తాబాద్‌, న్యూస్‌టుడే

కరోనా మహమ్మారి కుటుంబాలను అవస్థలపాలు చేయడమేకాదు విద్యా వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రత్యక్ష బోధన బదులు ప్రభుత్వం ఆన్‌లైన్‌ పాఠాలు నిర్వహిస్తోంది. అన్ని సౌకర్యాలు ఉన్న వారికి ఇవి బాగానే ఉన్నాయి. పేదలు, ఆర్థికంగా తక్కువ ఆదాయం ఉన్న వారి పిల్లలకు ఈ పాఠాలు అందని ద్రాక్షగా మారుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రభుత్వ పాఠశాలల్లోని సగం మంది విద్యార్థులు కూడా వినలేక, చూడలేకపోతున్నారు. కరోనా మూడో దశ నేపథ]్యంలో ఈ నెల 30 వరకు ఆన్‌లైన్‌ పాఠాలు బోధించాలని ప్రభుత్వం భావించింది. దీనికి టీశాట్‌, డిడి ఛానల్‌లో పాఠాలు ప్రసారం చేస్తోంది. అయితే గ్రామీణ నేపథ]్యమున్న వికారాబాద్‌ జిల్లాలో 50 శాతం మంది విద్యార్థులు మాత్రమే పాఠాలు వింటున్నారని విద్యా శాఖ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

రకరకాల మార్గాల అనుసరణ
జిల్లాలో 8, 9, 10 తరగతుల్లో 30 వేల మంది విద్యార్థుల్లో కేవలం 15 వేల మంది మాత్రమే ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నారు. మిగతా విద్యార్థుల్లో ఎక్కువ మంది పొలం, కూలీ పనులు, పశువులు, గొర్రెలు, మేకల కాపలా, ఇతర పనుల్లో నిమగ్నమవుతున్నారు. విద్యా శాఖ సర్వే ప్రకారం మూడు తరగతుల విద్యార్థుల్లో ఇంట్లో టెలివిజన్‌ ఉన్న విద్యార్థులు 10,564 మంది ఉండగా, స్మార్ట్‌ఫోర్‌, ల్యాప్‌ట్యాప్‌, కంప్యూటర్‌ ఉన్నవారు మరో 4,970 మంది ఉన్నారు. ఇక గ్రామ పంచాయతీలోని టీవీల్లో పాఠాలు వీక్షించేవారు మరో 150 మంది ఉండగా, తోటి స్నేహితుల వద్ద కలసి పాఠాలు వింటున్న విద్యార్థులు మరో 618 మంది ఉన్నట్లు విద్యాశాఖాధికారులు పేర్కొంటున్నారు. మొత్తంగా చూసుకుంటే సుమారుగా 53.55 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్‌ తరగతులకు హాజరవుతున్నారని తేలింది.
* 1020 మంది ఉపాధ్యాయులు నిత్యం విద్యార్థులను పర్యవేక్షిస్తున్నారని, తల్లిదండ్రులతో మాట్లాడి పాఠాలు చదివిస్తున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. స్మార్ట్‌ ఫోన్‌, టీవీలు ఉన్నా విద్యార్థుల్లో ఏకాగ్రత తగ్గుతోందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఫోన్‌ చేతికి ఇస్తే గేమ్స్‌ ఆడుకోవడం, సామాజిక మాధ]్యమాల్లో కాలం గడుతుపుతున్నారని వివరించారు. మరికొంత మంది టీవీల్లో పాఠాలు ప్రసారమయ్యే సమయాన్ని సర్దుబాటు చేసుకోలేకపోవడం వల్ల పాఠాలకు దూరమవుతున్నారన్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరమని ఉపాధ్యాయులు సూచిస్తున్నారు.


అంత స్థోమత లేదు
- సునీత, పదోతరగతి, దౌల్తాబాద్‌.

మా ఇంట్లో స్మార్ట్‌ ఫోన్‌ లేదు. కొనేంత ఆర్థిక స్థోమతా లేదు. తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తారు. పెద్ద ఫోన్‌ కావాలంటే కనీసం రూ.8 వేలు అవుతోందన్నారు. అంత డబ్బు పెట్టలేం. టీవీ, ఫోన్‌ ఉంటే చూసి పాఠాలు నేర్చుకునే అవకాశం ఉంది. రెండూ లేకపోవడంతో పాఠాలు వినలేకపోతున్నాను. పుస్తకాలు చదువుకుంటున్నాను.


ప్రత్యేక తెరలు ఏర్పాటు చేయాలి..
- తిరుపతమ్మ, పదో తరగతి, దౌల్తాబాద్‌

నేను పదోతరగతి చదువుతున్నాను. మాది పేద కుటుంబం కావడంతో పొలం పనులకు వెళ్లాల్సి వస్తోంది. మాలాంటి వారు ఎందరో ఉన్నారు. వీరంతా ఆన్‌లైన్‌ చదువులకు దూరం కావాల్సి వస్తోంది. ప్రభుత్వమే ప్రత్యేక తెరలు ఏర్పాటుచేసి పాఠాలు వినే వెసులుబాటు కల్పించాలి. స్మార్ట్‌ ఫోన్‌ లేదు. చిన్న ఫోన్‌ మాత్రమే ఉంది.  


సర్దుబాటు చేస్తున్నాం
- రేణుకా దేవి, జిల్లా విద్యా శాఖాధికారిణి

ఆన్‌లైన్‌ పాఠాలకు హాజరుపై విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా స్మార్ట్‌ ఫోన్‌, టీవీ లేకపోతే పక్కనే ఉన్న స్నేహితులు, ఇతర ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నాం. అందరికీ పాఠాలు అందాలని ప్రయత్నం చేస్తున్నాం. విద్యార్థుల హాజరు శాతం పెంచుతాం.


ఇదీ పరిస్థితి
జిల్లాలో ప్రాథమికోన్నత పాఠశాలలు: 241
మొత్తం విద్యార్థులు: 30,443 (8, 9, 10 తరగతులు)
ఆన్‌లైన్‌ పాఠాలకు  హాజరైన వారు: 
15,134  
హాజరువుతున్న'విద్యార్థులు:'53.55 శాతం
డిజిటల్‌ పరంగా ఏ ఆధారం లేని విద్యార్థులు: 5,651 మంది


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని