logo

మత్తు రవాణాపై ఉక్కుపాదం!

మత్తు పదార్థాలకు అడ్డాగా మారిన ప్రాంతాలపై సైబరాబాద్‌ పోలీసులు నిఘా పెంచారు. గంజాయి, కొకైన్‌, హెరాయిన్‌, ఎల్‌ఎస్‌డీ వంటి మాదకద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సమన్వయంతో సన్నద్ధమయ్యారు. గోవా, ముంబయి నుంచి ఖరీదైన మాదకద్రవ్యాలు, ఒడిశా, ఏపీ నుంచి నగరంలోకి గంజాయి రవాణా సాగుతోంది

Published : 28 Jan 2022 02:37 IST

దూకుడు పెంచిన సైబరాబాద్‌  పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌: మత్తు పదార్థాలకు అడ్డాగా మారిన ప్రాంతాలపై సైబరాబాద్‌ పోలీసులు నిఘా పెంచారు. గంజాయి, కొకైన్‌, హెరాయిన్‌, ఎల్‌ఎస్‌డీ వంటి మాదకద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సమన్వయంతో సన్నద్ధమయ్యారు. గోవా, ముంబయి నుంచి ఖరీదైన మాదకద్రవ్యాలు, ఒడిశా, ఏపీ నుంచి నగరంలోకి గంజాయి రవాణా సాగుతోంది. రాచకొండ, సైబరాబాద్‌ పోలీసుల తనిఖీల నుంచి బయటపడితే తేలికగా మహారాష్ట్ర చేరవచ్చనేది వారి అభిప్రాయం. ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన కీలక స్మగ్లర్లు రంగంలోకి దిగారు. ఏవోబీ సరిహద్దు మన్యం ప్రాంతాల్లో వేలాది కిలోల గంజాయి నిల్వ చేసినట్టు ఇటీవల పట్టుబడిన నిందితుడు పోలీసుల విచారణలో పెదవి విప్పాడు. తాజాగా శంషాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్‌ చేసిన ఆరుగురి నిందితుల్లో యూపీ నివాసి రాహుల్‌కుమార్‌పై మత్తు పదార్ధాల రవాణాపై కేసులున్నాయి. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్నాడు. డబ్బు సంపాదనకు మళ్లీ పాత మార్గం ఎంచుకున్నాడు. ప్రస్తుతం పోలీసుల తనిఖీల్లో చిక్కుతున్న వారిలో డ్రైవర్లు, దినసరి కూలీలు, వంటవాళ్లు, విద్యార్థులు ఉంటున్నారు.

అరెస్టులు.. పీడీ యాక్ట్‌లు.. 2021-22(జనవరి21 వరకు) సైబరాబాద్‌ పోలీసులు మత్తుపదార్థాల రవాణాపై 222 కేసులు నమోదు చేశారు. 459 మందిని అరెస్ట్‌ చేశారు. 25 మందిపై పీడీయాక్ట్‌ ప్రయోగించారు.

పటాన్‌చెరు దాటితే చాలు..
ఏవోబీ నుంచి భద్రాచలం, కొత్తగూడెం, మధిర, సూర్యాపేట మీదుగా హైదరాబాద్‌లోకి ప్రవేశిస్తున్నారు. వాహనాలు, నంబరు ప్లేట్లు, డ్రైవర్లను మారుస్తూ పటాన్‌చెరు దాటితే తేలికగా మహారాష్ట్ర చేరతామనే ధీమాగా ఉన్నారు. అన్ని విభాగాల పోలీసులు   రేయింబవళ్లు నిఘా ఉంటున్నారు. స్మగ్లర్ల ఎత్తులను సాంకేతిక పరిజ్ఞానం తో కట్టడి చేస్తున్నారు. యాంటీ నార్కొటిక్‌ సెల్‌ ద్వారా కొందరు మాదకద్రవ్యాలపై సమాచారం అందిస్తున్నారు. సీపీ స్టీఫెన్‌ రవీంద్ర, ఎస్‌వోటీ డీసీపీ జి.సందీప్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.  


స్వాధీనం చేసుకున్న సరకు..
గంజాయి 2863.9 కిలోలు
గంజాయి మొక్కలు 128(37.3కిలోలు)
హాషిష్‌ ఆయిల్‌ 8.63 లీటర్లు
గంజా పిల్స్‌ 14
లైరికా 150 ఎంజీ 12 మాత్రలు
ఆల్ఫ్రోజొలం 141 కిలోలు
ఎండీఎంఏ 240.29 గ్రాములు
ఓపియం 200 గ్రాములు
ఎక్స్‌టసీ 61 మాత్రలు
ఎల్‌ఎస్‌డీ పేపర్లు 47


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని