logo

ఆసుపత్రుల్లో ఐసొలేషన్‌ ఖాళీ!

కరోనా మూడో దశలో గ్రేటర్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో నిత్యం 2 వేల మంది వైరస్‌ బారిన పడుతున్నా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఐసొలేషన్‌ కేంద్రాల్లో ఎవరూ చేరడం లేదు. ఒమిక్రాన్‌ వేరియంట్‌లో చాలామందిలో స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి. ఒకట్రెండు రోజులపాటు జ్వరం, దగ్గు, గొంతులో గరగర, తలనొప్పి లాంటి లక్షణాలు వస్తున్నాయి.

Published : 28 Jan 2022 02:37 IST

ఈనాడు, హైదరాబాద్‌

అమీర్‌పేటలోని నేచర్‌క్యూర్‌ ఆసుపత్రి

కరోనా మూడో దశలో గ్రేటర్‌తోపాటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో నిత్యం 2 వేల మంది వైరస్‌ బారిన పడుతున్నా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఐసొలేషన్‌ కేంద్రాల్లో ఎవరూ చేరడం లేదు. ఒమిక్రాన్‌ వేరియంట్‌లో చాలామందిలో స్వల్ప లక్షణాలే ఉంటున్నాయి. ఒకట్రెండు రోజులపాటు జ్వరం, దగ్గు, గొంతులో గరగర, తలనొప్పి లాంటి లక్షణాలు వస్తున్నాయి. మందుల వాడితే తగ్గిపోతున్నాయి. దీంతో చాలామందికి ఆసుపత్రిలో చేరే అవసరమే ఉండటం లేదు.

సాధారణ ఓపీ సేవలు షురూ
తొలి, రెండో విడతలో ప్రభుత్వ ఐసొలేషన్‌ కేంద్రాలు రోగులతో కిటకిటలాడాయి. మూడో దశలో పరిస్థితి తీవ్రత తగ్గిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వ ఐసొలేషన్‌ కేంద్రాల్లో చేరే రోగులే లేరు. తాజాగా అమీర్‌పేటలోని నేచర్‌క్యూర్‌ ఆసుపత్రిలో 100 ఐసొలేషన్‌ పడకలను సిద్ధం చేశారు. ఎర్రగడ్డలోని ఆయుర్వేద ఆసుపత్రిలోనూ ఏర్పాట్లు చేశారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో విరమించుకున్నారు. ప్రస్తుతం సాధారణ ఓపీ ప్రారంభించారు.

ఉస్మానియా కొవిడ్‌ బాధితులు ‘కింగ్‌కోఠి’కి..
నారాయణగూడ: ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రిలో రోజురోజుకూ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. అక్కడే రోగులను చేర్చుకొని చికిత్స అందించాలంటే ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ సాధ్యం కాదు. దీంతో ఇక్కడ చికిత్స పొందుతున్నవారికి, శస్త్రచికిత్సలు చేయించుకున్నవారికి కొవిడ్‌ నిర్ధారణ అయితే.. వారిని కొవిడ్‌ చికిత్స కేంద్రంగా ఇప్పటికే గుర్తింపు పొందిన వైద్య విధాన పరిషత్‌(కింగ్‌కోఠి) జిల్లా ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. నాలుగైదు రోజులుగా కేసులు పంపిస్తూనే ఉన్నారు. దీన్ని  నిరంతరం పర్యవేక్షించడానికి ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి సీఏఎస్‌-ఆర్‌ఎంఓ డాక్టర్‌ రాజ్‌కుమార్‌ను నోడల్‌ అధికారి, సమన్వయకర్తగా నియమిస్తూ గురువారం ఉస్మానియా సూపరింటెండెంట్‌ డాక్టర్‌ బి.నాగేందర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

మూడు షిఫ్టుల్లో వైద్యులు..
ఉస్మానియా ఆసుపత్రికి సంబంధించిన సీనియర్‌ రెసిడెంట్స్‌(ఎస్‌ఆర్‌) డాక్టర్లు మూడు షిఫ్ట్‌లుగా కింగ్‌కోఠి ఆసుపత్రిలో పని చేస్తారు. అన్ని విభాగాల వైద్యులు ఉదయం 9 నుంచి 3 వరకు, మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం వరకు ఇలా నిరంతరం 24 గంటల పాటు అందుబాటులో ఉంటారు. జనరల్‌ మెడిసిన్‌తో పాటు ఆర్థో, అనస్థీషియా, ఇతర విభాగాల వైద్యులు, పీజీలు కూడా విధుల్లో ఉంటారు. వీరికి కింగ్‌కోఠి ఆసుపత్రి వైద్యులు, స్టాఫ్‌నర్సు, సిబ్బంది సహకారాలు అందిస్తారు. ఉస్మానియాలో ఎవరికైనా పాజిటివ్‌ నిర్ధారణ అయితే వారిని 108 అంబులెన్స్‌లో కింగ్‌కోఠి ఆసుపత్రికి పంపించే బాధ్యతను అక్కడి ఆర్‌ఎంఓకు అప్పగించారు.

అదే వరుస..
నగరంలో జ్వరాలు, దగ్గు లక్షణాలతో లక్షలాది మంది బాధపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్ష కేంద్రాల వద్ద అనుమానితులు ఉదయం నుంచే బారులు తీరుతున్నారు. పీహెచ్‌సీల్లో నిత్యం 100-150 మందికి, ఏరియా ఆసుపత్రుల్లో 400 మందికి  పరీక్షలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని