logo

పబ్బులు.. వేడుకలకు డ్రగ్స్‌!

ముంబయి కేంద్రంగా మాదకద్రవ్యాల వ్యాపారం నిర్వహిస్తున్న నైజీరియన్‌ టోనీ.. గోవాతో పాటు హైదరాబాద్‌, బెంగుళూరు నగరాల్లోని కొన్ని పబ్బులు, పార్టీలకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు హైదరాబాద్‌ పోలీసులు ప్రాథమిక ఆధారాలను సేకరించారు. ముంబయిలో ఇద్దరు ఏజెంట్లతో పాటు మరో ఆరుగురు కొకైన్‌ను ఇస్తున్నారని గుర్తించారు.

Published : 28 Jan 2022 04:02 IST

మాదకద్రవ్యాల రవాణా, సరఫరాపై ఆరా

నైజీరియన్‌ టోనీని విచారించనున్న పోలీసులు

ఈనాడు, హైదరాబాద్‌: ముంబయి కేంద్రంగా మాదకద్రవ్యాల వ్యాపారం నిర్వహిస్తున్న నైజీరియన్‌ టోనీ.. గోవాతో పాటు హైదరాబాద్‌, బెంగుళూరు నగరాల్లోని కొన్ని పబ్బులు, పార్టీలకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్టు హైదరాబాద్‌ పోలీసులు ప్రాథమిక ఆధారాలను సేకరించారు. ముంబయిలో ఇద్దరు ఏజెంట్లతో పాటు మరో ఆరుగురు కొకైన్‌ను ఇస్తున్నారని గుర్తించారు. కొకైన్‌ విక్రయాల్లో టోనీ ప్రధాన ఏజెంట్‌ ఇమ్రాన్‌ బాబూషేక్‌ భార్య ఫిర్‌దౌస్‌కూ భాగస్వామ్యం ఉందని, టోనీ సహా 22మంది నిందితులు కొకైన్‌ వినియోగం, సరఫరా చేస్తున్నారంటూ నాంపల్లి న్యాయస్థానంలో రిమాండ్‌ రిపోర్టు సమర్పించారు. టోనీని ఐదురోజులు విచారించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో శుక్రవారం నుంచి అతడిని పంజాగుట్ట పోలీసులు విచారించనున్నారు. టోనీతో పాటు జైలుకు వెళ్లిన తొమ్మిది మంది నిందితులను అప్పగించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించగా.. కోర్టు తిరస్కరించింది. 

నైజీరియన్‌ టోనీ దక్షిణాఫిక్రాలో ఉంటున్న స్టార్‌బాయ్‌ నుంచి నాలుగేళ్లుగా కొకైన్‌ను తెప్పిస్తున్నాడు.  ఇమ్రాన్‌ బాబూషేక్‌, ఇర్ఫాన్‌ల ద్వారా హైదరాబాద్‌, బెంగుళూరు, గోవాలకు పంపిస్తున్నాడు. గోవా, హైదరాబాద్‌, బెంగుళూరుల్లో కొన్ని పబ్బులకు నిరంతరం కొకైన్‌ సరఫరా చేస్తున్నాడు. ఆగస్టు 2019 నుంచి ఇమ్రాన్‌ బాబూ షేక్‌ను ప్రధాన ఏజెంట్‌గా చేసుకుని నెలకు రూ.లక్ష జీతం ఇచ్చేవాడు. హైదరాబాద్‌లో గిరాకీ పెరగడంతో ఏజెంట్లను పంపిస్తున్నాడు.

నగదు బదిలీకి ఆరుగురి ఖాతాలు.. టోనీ తన పేరు, వివరాలు ఎక్కడా బహిర్గతం కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. డ్రగ్స్‌ విక్రయించగా వచ్చే నగదును తన ఆరుగురు అనుచరులు మహ్మద్‌ ఆసిఫ్‌, ఖాజా మహ్మద్‌ అలం, అఫ్తాబ్‌ పర్వేజ్‌, రహమత్‌, ఇర్ఫాన్‌, ఫిర్‌దౌస్‌ల ఖాతాల్లోకి వేయించి వారి ఏటీఎంలు, యూపీఐ నంబర్ల ద్వారా తన ఖాతాల్లోకి వేసుకుంటున్నాడు. ఆ ఆరుగురి బ్యాంక్‌ ఖాతాల వివరాలను పోలీసులు సేకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని