logo

13 షెల్‌ కంపెనీలు.. రూ.2,200 కోట్లు!

ఆన్‌లైన్‌ గేమింగ్స్‌, పెట్టుబడుల యాప్స్‌ పేరుతో లక్షలాది మంది నుంచి చైనా మాయగాళ్లు రూ.2,200 కోట్లు కొట్టేశారు. సొమ్మంతా హాంకాంగ్‌ తరలించారు.

Published : 29 Jan 2022 03:06 IST

● చైనా తరలించిన సైబర్‌ నేరగాళ్లు.. నగర సీసీఎస్‌లో కేసు

ఈనాడు, హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌ గేమింగ్స్‌, పెట్టుబడుల యాప్స్‌ పేరుతో లక్షలాది మంది నుంచి చైనా మాయగాళ్లు రూ.2,200 కోట్లు కొట్టేశారు. సొమ్మంతా హాంకాంగ్‌ తరలించారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఇంత భారీగా జరిగిన మోసాలకు సహకరించిన 13 బోగస్‌ సంస్థలపై తెలంగాణ రాష్ట్ర రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ డైరెక్టర్‌ నగర సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ ధ్రువపత్రాలు, ఫోర్జరీ సంతకాలతో అనుమతులు తీసుకుని, నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిన ఆయా కంపెనీల డైరెక్టర్లు, ప్రమోటర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసిన ఒక నిందితుడిని అరెస్టుచేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

హైదరాబాద్‌ కేంద్రంగా దందా

మాల్‌008, మాల్‌ 98, వైఎస్‌0123, మాల్‌ రిబేట్‌ డాట్‌కామ్‌ యాప్స్‌లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయంటూ మాయగాళ్లు ఈమెయిల్స్‌, సెల్‌ఫోన్లకు లింకులు పంపి ఆకట్టుకున్నారు. తక్కువ సమయంలో రాబడి వస్తుందని ఆశపడిన లక్షలాది మంది మోసపోయారు. ఇలా భారీఎత్తున జరిగిన సైబర్‌ మోసాలపై నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం దర్యాప్తులో దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి.

ఇవే షెల్‌ కంపెనీలు.. కస్తూభా ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ ప్రయివేటు లిమిటెడ్‌, నందక ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ ప్రయివేటు లిమిటెడ్‌, పినాకిని ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, లోకపూజ్య ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, అభాస్త ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, అంజనాద్రి ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, గరుడారి ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, నీలాద్రి ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, పాంచజన్య ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, వకుల ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, వనమాలి ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, వాసుకి ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌, విజయకృష్ణ నారల పీసీఎస్‌ బోగస్‌ సంస్థలపై సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వీటి ద్వారానే ఆన్‌లైన్‌ గేమింగ్‌, ఇన్వెస్టిమెంట్‌ యాప్స్‌తో లక్షలాది మంది నుంచి డబ్బులు కొట్టేసి రూ.2,200 కోట్లు హవాలా మార్గంలో చైనా బ్యాంకుకు తరలించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇద్దరు చైనీయులు కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని