logo

కార్పొరేట్‌లో కాదు.. ఉస్మానియాలోనే!

ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉస్మానియా ఆసుపత్రిలో తొలిసారి ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద అరుదైన సర్జరీలు చేశారు. ఎక్కువగా కార్పొరేట్‌ ఆసుపత్రులకే......

Published : 29 Jan 2022 03:32 IST

నలుగురికి మోకీళ్లు, తుంటి మార్పిడి

మరో మహిళకు అరుదైన సర్జరీ

ఆయుష్మాన్‌ భారత్‌ కింద తొలిసారి

శస్త్ర చికిత్స చేయించుకున్న వారితో మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌

ఈనాడు, హైదరాబాద్‌- ఉస్మానియా ఆసుపత్రి, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఉస్మానియా ఆసుపత్రిలో తొలిసారి ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద అరుదైన సర్జరీలు చేశారు. ఎక్కువగా కార్పొరేట్‌ ఆసుపత్రులకే పరిమితమైన మోకీళ్ల, తుంటి మార్పిడి శస్త్ర చికిత్సలను విజయవంతంగా పూర్తి చేశారు. మహారాష్ట్రకు చెందిన మరో మహిళకు ఇదే పథకం కింద క్లిష్టమైన శస్త్ర చికిత్స చేశారు. ఆరోగ్యశ్రీ కింద ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల ప్రజలకే సేవలు అందించే వీలుంది. ఆయుష్మాన్‌ భారత్‌ అందుబాటులోకి రావడంతో నగరంలో ఉంటున్న ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా ఉస్మానియాలో చికిత్సలు తీసుకునే వెసులుబాటు ఏర్పడింది. ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు ఉంటే చాలని వైద్యులు తెలిపారు. దేశంలో ఎక్కడైనా చికిత్స చేసుకోవచ్చన్నారు. తాజాగా నిర్వహించిన శస్త్ర చికిత్సల వివరాలను ఉస్మానియా వైద్యులు శుక్రవారం మీడియాకు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన నాగరాజు(28), ఘట్‌కేసర్‌కు చెందిన రవి(49), సరూర్‌నగర్‌కు చెందిన పద్మ(40), కల్వకుర్తికి చెందిన అమృతమ్మ(49) కొన్నేళ్లుగా మోకీళ్ల, తుంటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రిలో సంప్రదిస్తే మార్పిడి చికిత్సలు చేయాలని ఇందుకు రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు ఖర్చవుతుందన్నారు. ఈ క్రమంలో ఇటీవలే ఉస్మానియా వైద్యులను సంప్రదించారు. వారు పలు పరీక్షల అనంతరం మోకీళ్లు, తుంటి మార్పిడి చేసేందుకు సిద్ధమయ్యారు. ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఇంప్లాంట్స్‌ సమకూర్చారు. ఇటీవలే విజయవంతంగా శస్త్రచికిత్సలు పూర్తి చేశారు. గతంలో ఇంప్లాంట్స్‌ లేక చాలా తక్కువ మందికే ఇలాంటి చికిత్సలు చేసేవారు. ఇక నుంచి ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని వైద్యులు తెలిపారు. నింబోలిఅడ్డలో ఉంటున్న మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన భాగ్యశ్రీ(32) కొంత కాలంగా పొట్ట భాగంలో గడ్డ ఏర్పడి తీవ్ర ఇబ్బంది పడుతోంది. ఈమెకు కూడా ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కింద విజయవంతంగా సర్జరీ చేశామని వైద్యులు తెలిపారు. కోలుకోవడంతో ఆమెను డిశ్చార్జి చేశామన్నారు. శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించిన ఆర్థోపెడిక్‌ విభాగాధిపతి డా.రమేశ్‌, ఫ్రొఫెసర్లు తిమ్మారెడ్డి, కృష్ణారెడ్డి, పాండునాయక్‌, జనరల్‌ సర్జరీ ఫ్రొఫెసర్‌ డా.శ్రీహరి, ఆర్‌ఎంవో డాక్టర్‌ ఎండీ రఫీ ఇతర వైద్యులను సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ ప్రత్యేకంగా అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు