logo

నాలా ఉంటేనే.. ప్లాట్ల రిజి~రస్టేషన్‌

వ్యవసాయ భూమిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రభుత్వం నాలాకు (వ్యవసాయేతర భూమి) ముడి పెట్టింది. దీంతో మార్చుకోని వారికి చుక్కెదురవుతోంది. 2020 డిసెంబరు 30 వరకు ఈ వ్యవహారం సజావుగా సాగింది.

Published : 29 Jan 2022 05:37 IST


తాండూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద

న్యూస్‌టుడే, తాండూరు: వ్యవసాయ భూమిలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రభుత్వం నాలాకు (వ్యవసాయేతర భూమి) ముడి పెట్టింది. దీంతో మార్చుకోని వారికి చుక్కెదురవుతోంది. 2020 డిసెంబరు 30 వరకు ఈ వ్యవహారం సజావుగా సాగింది. 2021 జనవరి 1 నుంచి కొత్త నిబంధన అమలులోకి వచ్చింది. వీటిని విస్మరించి రిజిస్ట్రేషన్‌ చేస్తే ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇలాంటి వ్యవహారంలోనే వికారాబాద్‌ సబ్‌రిజిస్ట్రార్‌ను గత నవంబరులో విధుల నుంచి తప్పించారు.

తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌లో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. బీజాపూరు, బెంగళూరు జాతీయ రహదారుల పక్కనే వేల కొద్ది ఎకరాల పొలాలు ఉన్నాయి. వీటిల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. నగరాల్లో నివాసం ఉండే వారు కూడా ప్రశాంతంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. మండల కేంద్రాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఇంటి స్థలానికి డిమాండ్‌ ఎక్కువగా ఉంది. గ్రామాల్లో నివాసం ఉండే వారు తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌, పరిగి పట్టణాల్లో స్థిరాస్తుల కింద ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. డిమాండ్‌ పెరగడంతో చాలా మంది వ్యాపారులు పొలాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి, ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. 2020 డిసెంబరు వరకు నాలా లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రస్తుతం ఆ పత్రం ఉంటేనే చేస్తున్నారు. దీంతో అక్రమ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు పాట్లు పడుతున్నారు. డీటీసీపీ ఉన్న ప్లాట్ల రిజిస్ట్రేషన్లలో మాత్రం సబ్‌రిజిస్ట్రార్‌ల నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేక పోవడంతో రిజిస్రేష్టన్లు జరుగుతున్నాయి. ఈ సమయంలో ప్లాట్‌ విలువలో 7.5 శాతం రుసుం చెల్లించి చేసుకునే నిబంధన ఉంది. అదే గిప్ట్‌ డీడ్‌ కింద రిజిస్ట్రేషన్‌ చేస్తే విలువలో 3 శాతం రుసుం చెల్లించాలనే నిబంధనను అమలు చేస్తున్నారు. జిల్లాలో కొత్తగా పుట్టుకు వస్తున్న అక్రమ లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లను నిలువరించేందుకు ప్రభుత్వం నాలా నిబంధన అమల్లోకి తెచ్చింది.

పురాతన నిర్మాణాలకు తప్పని ఎన్‌ఓసీ: జిల్లాలోని పట్టణాలతో పాటు గ్రామాల్లో చాలా ఏళ్ల కిందట నిర్మాణమైన గృహాల రిజిస్ట్రేషన్‌ జరగాలంటే సంబంధిత అధికారులు నిరభ్యంతర పత్రాన్ని ఇవ్వాలి. ఇది జరగాలంటే నిర్మాణమైన ఇళ్లకు టౌన్‌ప్లానింగ్‌ అనుమతి అవసరం ఉంది. ఇది లేని వాటికి ఎన్‌ఓసీ ఇవ్వడానికి అధికారులు తమకెందుకు వచ్చిన గొడవ అని పక్కకు పెడుతున్నారు. దీంతో సదరు యజమానులు ఇళ్లను విక్రయించాలన్నా..బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. చేసేది లేక కొంత మంది టౌన్‌ప్లానింగ్‌ అనుమతి తీసుకున్నాకే రిజిస్ట్రేషన్లకు వెళుతున్నారు. ఇక గ్రామాల్లో అయితే పాత తేదీల్లో సర్పచుల సంతకాలు తీసుకున్న పత్రాలను సబ్‌రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో చూపిస్తున్నారు.

ఫిబ్రవరి నుంచి పెరగనుండటంతో..: ఫిబ్రవరి 1 నుంచి భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచనుండడంతో చాలా మంది ప్రస్తుతం తక్కువగా ఉన్న వాటిని అనుసరించి రిజిస్ట్రేషన్లకు ఆసక్తి చూపుతున్నారు. గడచిన నాలుగు రోజుల్లో తాండూరు, కొడంగల్‌, వికారాబాద్‌, పరిగి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 220కి పైగా ప్లాట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి రూ.కోటి వరకు ఆదాయం సమకూరింది. జిల్లాలో ఏఏ ప్రాంతాల్లో ఏఏ ప్లాట్లకు, భూములకు ఎంత మేర విలువ ఉందనే విషయాన్ని ఇప్పటికే సబ్‌రిజిస్ట్రార్‌లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆమేరకు గిరాకీని బట్టి ప్లాట్లు, భూముల విలువను పెంచనుందని సిబ్బంది తెలిపారు. ఇదే జరిగితే జిల్లా నుంచి ప్రస్తుతం ప్రభుత్వానికి వెళుతున్న ఆదాయం రెట్టింపు కంటే ఎక్కువగానే ఉండనుందని తెలుస్తోంది.

2013 నుంచి ఇది రెండో సారి

ప్రభుత్వం 2013లో ఒక సారి రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచింది. అప్పటి నుంచి 2021 జూన్‌ వరకు అసలు ఛార్జీలు పెంచలేదు. తాజాగా ఫిబ్రవరి నుంచి మరో సారి పెరగనున్నాయి. ఇళ్ల స్థలాల కొనుగోలు దారులు తమకు నచ్చిన ప్రాంతాల్లో ప్రస్తుతం ప్లాట్లను కొనుగోలు చేసి పాత ఛార్జీలతో రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు. ఇంకొందరు స్థిరాస్తి వ్యాపారుల వద్ద నాలా చెల్లించని ప్లాట్లను కొనుగోలు చేస్తున్నారు. వీటికే కోర్టు నుంచి తెచ్చిన ఉత్తర్వులను అనుసరించి పాత ఛార్జీలతో చేసుకుంటున్నారు.

న్యాయస్థానం ఉత్తర్వులకు అనుగుణంగా...

నాలా పత్రాలు లేనివారు కొందరు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వు ప్రతులను సమర్పిస్తున్నారు. ఒక్కో ప్రతిలో 10 నుంచి 50 ప్లాట్ల వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని పేర్కొంటున్నారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేస్తే నాలా లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొంత వరకు ఆగిపోయే అవకాశం ఉంటుంది. ఈలోగా వచ్చే ప్లాట్లకు నాలా ఆపాదింపు ఉంటుంది ప్రభుత్వానికి రాబడి కూడా పెరుగుతుంది. అయితే ఉన్నత స్థాయి అధికారులు ఈ కోణంలో ఆలోచించడం లేదు. నాలా లేని ప్లాట్లకు కోర్టు నుంచి వచ్చే ఉత్తర్వులను అనుసరించి తాము రిజిస్ట్రేషన్‌ చేస్తున్నామని తాండూరు సబ్‌రిజిస్ట్రార్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని