logo

ఈసురోమంటున్న ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్లు

తాగునీరు ఉండదు. మరుగుదొడ్లకు తాళాలు. మందుబాబులు, పోకిరీల సంచారం.. వెరసి నగరంలోని ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్లలో ఆలనాపాలన కరవైంది. ఎంఎంటీఎస్‌ సేవలు మొదలై రెండు దశాబ్దాలైనా.. ప్రయాణికులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు సమకూరలేదు. స్టేషన్‌కు ఒకవైపే టిక్కెట్లు ఇస్తారు. నాలుగైదు స్టేషన్లు మినహా ఆర్టీసీ సిటీ బస్సు దొరకని పరిస్థితి. రైలు ప్రయాణానికి

Updated : 19 May 2022 04:47 IST

రెండు దశాబ్దాలైనా అపరిష్కృతంగానే  సమస్యలు

తాగునీటికి కటకట... మరుగుదొడ్లకు తాళాలు

సికింద్రాబాద్‌లో 6,7 ప్లాట్‌ఫాంలపై మూసివేసిన ఎంఎంటీఎస్‌ టికెట్ల కౌంటర్‌

ఈనాడు - హైదరాబాద్‌; న్యూస్‌టుడే, చాంద్రాయణగుట్ట, రెజిమెంటల్‌బజార్‌, ఖైరతాబాద్‌, శేరిలింగంపల్లి, కాచిగూడ : తాగునీరు ఉండదు. మరుగుదొడ్లకు తాళాలు. మందుబాబులు, పోకిరీల సంచారం.. వెరసి నగరంలోని ఎంఎంటీఎస్‌ రైల్వేస్టేషన్లలో ఆలనాపాలన కరవైంది. ఎంఎంటీఎస్‌ సేవలు మొదలై రెండు దశాబ్దాలైనా.. ప్రయాణికులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు సమకూరలేదు. స్టేషన్‌కు ఒకవైపే టిక్కెట్లు ఇస్తారు. నాలుగైదు స్టేషన్లు మినహా ఆర్టీసీ సిటీ బస్సు దొరకని పరిస్థితి. రైలు ప్రయాణానికి గరిష్ఠంగా రూ.10 టిక్కెట్‌ అయితే.. స్టేషన్‌ నుంచి ఇళ్లకు చేరేందుకు రెట్టింపు వెచ్చించాల్సి వస్తోంది.

తాగునీటికి కటకట
ప్రధానమైన రైల్వేస్టేషన్లలో తప్ప మిగతా చోట్ల ఎక్కడా మంచినీటి జాడలేదు. గతంలో నల్లాల్లో నీళ్లు వచ్చేవి. స్థానికులు నీళ్లు పట్టుకెళ్లి పోతున్నారని నల్లాలు బంద్‌ చేశారు. పైకి నల్లాలు పాడయ్యాయని చెబుతున్నా.. తాగునీటిని సరఫరా చేయలేకే బంద్‌ చేసినట్టు తెలుస్తోంది. ‘వాటర్‌ వెండింగ్‌ మెషిన్లు’ కరోనా తర్వాత తీసేశారు.

సమస్యలకు నిలయాలు  
ఫలక్‌నుమా రైల్వేస్టేషన్‌ వెళ్లే రహదారి గుంతలు, ముళ్ల పొదలతో అధ్వానంగా మారింది. వీధిదీపాలు లేకపోవడంతో రాత్రుళ్లు వెళ్లేందుకు జనం భయపడుతున్నారు. ఈ మార్గంలో గతంలో చోరీలు, దోపిడీలు, హత్యలు చోటుచేసుకోవడం గమనార్హం.
నాంపల్లి స్టేషన్‌లో  ప్లాట్‌ఫాంలపై తాగుబోతులు, ఆకతాయిలు తిష్ఠవేస్తున్నారు.
రెండు సెం.మీ. వర్షం పడితే ఖైరతాబాద్‌ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌లోని కార్యాలయం మునుగుతోంది. ఏడాదిన్నర కిందట పునర్నిర్మించాలని రైల్వే నిర్ణయించింది. ఈ వర్షాకాలానికైనా పూర్తవుతుందన్న నమ్మకంలేదు. వంతెనవైపు పోకిరీలు తిష్ఠ వేస్తుండగా, మందుబాబులు ఆవరణలోనే ఉంటున్నారు.

* పాతనగరంలోని ఉప్పుగూడలో గత కొన్నేళ్లుగా మూత్రశాలలు, మరుగుదొడ్లకు తాళం వేలాడుతోంది. బహిరంగ మూత్రవిసర్జన వల్ల దుర్వాసన వస్తోంది. మంచినీటి సౌకర్యం లేదు. ఆర్‌ఓ కేంద్రం మూసేశారు.

ప్రైవేటు వాహనాలే దిక్కు
లింగంపల్లికి ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు సొంత వాహనాల్లో కానీ ఆటోలు, క్యాబ్‌ల్లో కానీ వెళ్లాల్సి వస్తోంది. ఆటోవాలాలు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతున్నాయి.

వేడి నీళ్లే గతి
కాచిగూడ రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు వేడి నీళ్లే దిక్కవుతున్నాయి. రూపాయికి గ్లాసు, రూ.5కు లీటర్‌ చల్లటి నీళ్లను విక్రయించే కేంద్రం మూత పడింది. నగరం నలుమూలలకు ఆర్టీసీ బస్సులు తిప్పకపోవడం వల్ల క్యాబ్‌లు, ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. గోల్నాక వైపు టిక్కెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ మూసేశారు.

నాంపల్లిలో రైల్వే టికెట్‌ కౌంటర్ల ప్రవేశ ద్వారం వద్ద లేని భద్రతా సిబ్బంది  

ఏ రైలు ఎక్కడికి వస్తుందో..
సికింద్రాబాద్‌లో ఎంఎంటీఎస్‌ల కోసం ప్రత్యేకించిన 6, 7 ప్లాట్‌ఫాంలపై టిక్కెట్ల కౌంటర్లు ఉండేవి. ప్రస్తుతం మూసేశారు. రైళ్లు ఏ ప్లాట్‌ఫాం మీదకు వస్తాయో చివరి వరకు తెలియదు. 1, 10 ప్లాట్‌ఫాంల పక్కన టిక్కెట్లు కొని రైలు కోసం వచ్చేలోపు ఎంఎంటీఎస్‌ వెళ్లిపోతోంది. సంజీవయ్య పార్కు స్టేషన్‌లో మూత్రశాలలకు తాళాలు వేశారు.

సర్వీసుల  స్వరూపం
కరోనాకు ముందు: 121 
సర్వీసులు

రోజుకు వినియోగించుకొనే ప్రయాణికులు: 1.80 లక్షలు

ప్రస్తుతం తిరుగుతున్నవి: 76 సర్వీసులు

ప్రయాణికులు: 70 వేలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని