logo

పరీక్షలు రాయకుండానే ఇంజినీరింగ్‌, డిగ్రీ పట్టాలు

విద్యార్హతలు లేకుండా, పరీక్షలు రాయకుండా ఇంజినీరింగ్‌.. డిగ్రీ పట్టాలు ఇస్తున్న వ్యవహారంలో భోపాల్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ ఎం.సి.ప్రశాంత్‌ పిళ్లై, మాజీ ఉపకులపతి డాక్టర్‌ ఎస్‌.ఎస్‌. కుష్వాలను గురువారం అరెస్ట్‌

Updated : 19 May 2022 10:41 IST

ఎస్‌ఆర్‌కే వర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ అరెస్ట్‌
మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ఎస్‌.ఎస్‌.కుష్వానూ అరెస్ట్‌ చేసిన పోలీసులు
భోపాల్‌, ఇండోర్‌లలో మరింతమంది నిందితుల కోసం వేట
ఈనాడు, హైదరాబాద్‌

విద్యార్హతలు లేకుండా, పరీక్షలు రాయకుండా ఇంజినీరింగ్‌.. డిగ్రీ పట్టాలు ఇస్తున్న వ్యవహారంలో భోపాల్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్‌ ఎం.సి.ప్రశాంత్‌ పిళ్లై, మాజీ ఉపకులపతి డాక్టర్‌ ఎస్‌.ఎస్‌. కుష్వాలను గురువారం అరెస్ట్‌ చేశామని హైదరాబాద్‌ అదనపు సీపీ(నేర పరిశోధన)ఎ.ఆర్‌.శ్రీనివాస్‌ తెలిపారు. విద్యార్హతలు లేని వారికి డిగ్రీ సర్టిఫికెట్లను, విదేశాలకు వెళ్లేందుకు అవసరమైన ఇంజినీరింగ్‌ పట్టాలను ఎస్‌ఆర్‌కే యూనివర్సిటీ పేరుతో జారీ చేస్తున్నారని వివరించారు. డిగ్రీకి రూ.2లక్షలు, ఇంజినీరింగ్‌కు రూ.2.5లక్షల నుంచి రూ.4లక్షలు వసూలు చేసుకుంటున్నారు. ఈ అక్రమాల్లో డాక్టర్‌ ప్రశాంత్‌ పిళ్లై, ఎస్‌.ఎస్‌.కుష్వాలకు ప్రమేయం ఉందని ఆధారాలు లభించడంతో భోపాల్‌కు వెళ్లిన పోలీసులు వారిద్దరినీ మంగళవారం అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు. ఐదేళ్ల నుంచి వీరు అక్రమాలకు పాల్పడుతున్నారని, మరికొంతమంది వర్సిటీ అధికారులకూ ఈ నేరంతో సంబంధం ఉండడంతో వారిని అరెస్ట్‌ చేసేందుకు భోపాల్‌, ఇండోర్‌ నగరాల్లో ప్రత్యేక బృందాలు పరిశోధన కొనసాగిస్తున్నాయని వివరించారు.

అక్రమాలు.. కన్సల్టెన్సీలకు కమీషన్లు
భోపాల్‌లోని సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విశ్వవిద్యాలయం మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం, యూజీసీల నుంచి ప్రైవేటు యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. విశ్వవిద్యాలయంలోని వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పెంచుకునేందుకు వర్సిటీ యాజమాన్యం, వర్సిటీ అధికారులు ఐదేళ్ల క్రితం హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, ముంబయి, దిల్లీలో ఉంటున్న కన్సల్టెన్సీల ప్రతినిధులను కలుసుకున్నారు. యూనివర్సిటీకి రాకుండానే, పరీక్షలు రాయకుండానే డిగ్రీ, ఇంజినీరింగ్‌ సర్టిఫికెట్లు ఇస్తామంటూ చెప్పారు. తమకు యాభైశాతం ఇస్తే.. మీరు యాభై శాతం తీసుకోండంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పటి నుంచి కన్సల్టెన్సీల ప్రతినిధులు, ఎస్‌ఆర్‌కే వర్సిటీ అధికారులు రూ.లక్షలు తీసుకుని వందలమందికి ఇంజినీరింగ్‌, డిగ్రీ, ఏంబీఏ, పట్టాలను జారీ చేశారు. మూడునెలల క్రితం నకిలీ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారన్న ఆరోపణలపై హైదరాబద్‌ పోలీసులు మలక్‌పేట్‌లో ఓ కన్సల్టెన్సీ నిర్వాహకుడిని అరెస్ట్‌ చేయగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎస్‌ఆర్‌కే వర్సిటీ అధికారి కేతన్‌ సింగ్‌ పేరు బయటకు రావడం, అతడిని అరెస్ట్‌ చేయడంతో విశ్వవిద్యాలయంలో ఉపకులపతి వరకూ ప్రమేయం ఉందని తేలింది. వీటికి సంబంధించి పక్కా సాక్ష్యాధారాలను పోలీసులు సేకరించి ఉప కులపతి, మాజీ ఉప కులపతులను అరెస్ట్‌ చేశారు.

వైద్య నిపుణులు.. దారి తప్పారు
సర్వేపల్లి రాధాకృష్ణన్‌ విశ్వవిద్యాలయం కులపతి ప్రశాంత్‌ పిళ్లై, మాజీ వీసీ ఎస్‌.ఎస్‌.కుష్వా ఇద్దరూ వైద్య నిపుణులే. 2017 నుంచి నాలుగేళ్లు  ఉప కులపతిగా బాధ్యతలు నిర్వర్తించిన డాక్టర్‌ ఎస్‌.ఎస్‌.కుష్వా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంలోని ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఉన్నత పదవుల్లో పనిచేశారు. ప్రభుత్వ వైద్యవిద్య సంచాలకుడిగా విధులు నిర్వహించారు. పదవీ విరమణ పొందాక ఎస్‌ఆర్‌కే విశ్వవిద్యాలయం యాజమాన్యం అభ్యర్థన మేరకు ఏడేళ్ల క్రితం ఉప కులపతిగా పదవి చేపట్టారు. 70 ఏళ్ల వయస్సులోనూ చురుకుగా ఉన్న డాక్టర్‌ ఎస్‌.ఎస్‌.కుష్వా అక్రమాల మకిలిని అంటించుకున్నారు. భోపాల్‌లో దంత శస్త్రచికిత్స నిపుణుడిగా పేరొందిన ప్రశాంత్‌ పిళ్లై తొలుత ఆర్‌కేడీఎఫ్‌ దంతవైద్య కళాశాల డీన్‌గా పనిచేశారు. గతేడాది ఎస్‌ఆర్‌కే వర్సిటీ వీసీగా బాధ్యతలు చేపట్టారు. నకిలీ పట్టాల వ్యవహారంపై ప్రశాంత్‌ పిళ్లైకు వాటా ఉందని పోలీసులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని