logo

కాలుష్య నియంత్రణకు కొత్త కార్యాచరణ

నగరంలో కాలుష్య మేఘాలను నియంత్రించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు కొత్త పంథాను అనుసరించబోతున్నారు. ఇందుకు ఐఐటీ ఖరగ్‌పూర్‌, జేఎన్‌టీయూ (హైదరాబాద్‌)లతో సంప్రదిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు

Published : 19 May 2022 02:11 IST

అధికారులతో మాట్లాడుతున్న జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌ సంతోష్‌, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ సంయుక్త కమిషనర్‌ రంగనాథ్‌

ఈనాడు, హైదరాబాద్‌:   నగరంలో కాలుష్య మేఘాలను నియంత్రించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు కొత్త పంథాను అనుసరించబోతున్నారు. ఇందుకు ఐఐటీ ఖరగ్‌పూర్‌, జేఎన్‌టీయూ (హైదరాబాద్‌)లతో సంప్రదిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు రవాణాశాఖ, కాలుష్య నియంత్రణ మండలి, నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రాజెక్ట్‌ ప్రతినిధులు బుధవారం సమావేశమయ్యారు. పంజాగుట్ట, సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, అసెంబ్లీ వంటి ప్రాంతాల్లో నమోదవుతున్న కాలుష్య పరిమితులు, కాలుష్య నియంత్రణ నివేదికల ఆధారంగా చర్యలు చేపట్టనున్నారు.

కాలుష్య పరిమితులపై నజర్‌.. వాహన కాలుష్యాన్ని అదుపు చేసేందుకు, గాలిలో కలుస్తున్న విష వాయువులను తగ్గించేందుకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ, అటవీ మంత్రిత్వ శాఖలు కొన్నేళ్లుగా వాహన తయారీదార్ల కంపెనీలకు నిబంధనలు విధిస్తున్నాయి. బీఎస్‌ సంఖ్య పెరిగే కొద్దీ ఆ వాహనం తాలూకు కాలుష్యం తగ్గుతుంది. ఉదాహరణకు ఈ ఏడాది తయారైన ఓ ప్రముఖ కంపెనీ కారు 5 శాతం కాలుష్యాన్ని బయటకు వదులుతుంటే... వచ్చే ఏడాది 4 శాతం మాత్రమే వదలాలి అన్న నిబంధనను కేంద్రం విధిస్తోంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న ట్రాఫిక్‌, రవాణాశాఖ అధికారులు రహదారులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వాహనాల కాలుష్య ప్రమాణాలను పరిశీలించనున్నారు.


వాహనాలదే 68శాతం: ఏవీ రంగనాథ్‌, సంయుక్త కమిషనర్‌ (ట్రాఫిక్‌)
హైదరాబాద్‌లో వాహనాల ద్వారా గాల్లో కలిసే కాలుష్యం వాటా 68 శాతం. నగరంలో 50 లక్షల వాహనాల్లో ఎన్నింటిలో కార్బన్‌మోనాక్సైడ్‌ వాయువు, ఇతర హానికర వాయువులున్నాయని గుర్తించడం కష్టం అందుకే వాహనాల తయారీ సంవత్సరం, కాలుష్య నియంత్రణ మండలి ఇస్తున్న ధ్రువపత్రాలన్నింటినీ ఒక డేటాగా మార్చి పోలీస్‌, రవాణా శాఖ సర్వర్లలో ఉంచనున్నాం. తనిఖీల్లో కాలుష్య కారక వాహనాలను గుర్తించనున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని