logo

తల్లిలాంటి ఆలన.. స్వయం పాలన

రాజధానిలో కొత్తగా నిర్మించనున్న మూడు ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో నిమ్స్‌ తరహాలో స్వయం పాలిత వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. మూడింటిలో రోగుల సహాయకులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా ధర్మశాలలను నిర్మించాలని మరిన్ని అదనపు సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్లను ఏర్పాటు చేయాలన్న సీఎం ఆదేశాలతో ఇంజినీరింగ్‌ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఆస్పత్రిలో మాతా శిశు విభాగాలు ఉండనున్నాయి.

Published : 19 May 2022 02:11 IST

కొత్త ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాతాశిశు విభాగాలు

హెలీప్యాడ్లు, నర్సింగ్‌ హాస్టళ్లు

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

కొత్తపేటలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ కట్టనున్న ప్రదేశం

రాజధానిలో కొత్తగా నిర్మించనున్న మూడు ప్రభుత్వ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో నిమ్స్‌ తరహాలో స్వయం పాలిత వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. మూడింటిలో రోగుల సహాయకులు ఇబ్బందులు పడకుండా ప్రత్యేకంగా ధర్మశాలలను నిర్మించాలని మరిన్ని అదనపు సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్లను ఏర్పాటు చేయాలన్న సీఎం ఆదేశాలతో ఇంజినీరింగ్‌ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఆస్పత్రిలో మాతా శిశు విభాగాలు ఉండనున్నాయి. రూ.3600 కోట్ల వ్యయంతో నిర్మితమయ్యే ఈ వైద్యశాలల భవనాల నిర్మాణాలకు త్వరలోనే టెండర్లను పిల్చి పనులను అప్పగించడానికి ఆర్‌అండ్‌బీ కసరత్తు చేస్తోంది.

నగరంలో పేదలందరికీ మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎల్బీనగర్‌ సమీపంలోని కొత్తపేటలో ఒకటి, అల్వాల్‌ వద్ద మరొకటి, ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి దగ్గర ఒకటి కలిపి మొత్తం మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు ఇప్పటికే సర్కార్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మూడింటికి సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. వెయ్యి పడకల చొప్పున మొత్తం 3 వేల పడకలు అందుబాటులోకి రానున్నాయి.


నూతన వైద్యశాలల్లో సౌకర్యాలివి

మాతా శిశు విభాగాలు: మూడు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా మాతాశిశు విభాగాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు ప్రత్యేక బ్లాక్‌లను ఏర్పాటు చేయాలన్న సీఎం ఆదేశాలకు అనుగుణంగా భవన నిర్మాణల సమయంలోనే చర్యలు చేపడుతున్నారు. కనీసం వంద పడకలను అందుబాటులో ఉంచాలనుకుంటున్నారు.

ధర్శశాలలు: ప్రస్తుతం నగరంలోని ఏ ప్రభుత్వ దవాఖానాలోనూ రోగుల సహాయకులకు రాత్రుళ్లు ఉండటానికి ఎటువంటి సౌకర్యాలు లేవు. రోడ్ల పక్కనో చెట్ల కిందో పడుకుంటున్నారు. కొత్త వైద్యశాలల్లో రోగుల సహాయకుల కోసం అన్ని వసతులతో కూడిన ప్రత్యేక భవనాన్ని నిర్మించబోతున్నారు. ఇందులో డార్మిటరీలు, ప్రత్యేక గదులు, అత్యాధునిక క్యాంటీన్‌, భోజనశాల తదితర ఏర్పాట్లు ఉంటాయి. ముఖ్యమంత్రి ఆదేశంతో ఈ భవనానికి ధర్మశాల అని పేరు పెట్టనున్నారు.

హెలీప్యాడ్లు: అత్యవసర వేళల్లో రాష్ట్రంలోని దూర ప్రాంతాల నుంచి రోగులను హైదరాబాద్‌కు ఆంబులెన్స్‌ల్లోనే తరలిస్తున్నారు. భవిష్యత్తులో హెలికాప్టర్లలో తరలించే పరిస్థితి వస్తే ఉపయోగపడటానికి వీలుగా మూడు కొత్త ఆస్పత్రుల్లో హెలిప్యాడ్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారు.

నర్సింగ్‌ హాస్టళ్లు: మూడు చోట్ల నర్సింగ్‌ హాస్టళ్లు ఏర్పాటు చేయబోతున్నారు. నర్సులకు అక్కడే ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

స్వయం ప్రతిపత్తి: మూడు నిమ్స్‌ తరహాలో స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటాయి. ఒక డైరెక్టర్‌తోపాటు కొంతమంది ఆర్‌ఎంవోల అధీనంలోనే పాలనంతా సాగుతుంది.

పేదలకు ఉచిత వైద్యం: నిమ్స్‌ తరహాలోనే కొత్త వైద్యశాలల్లో పేదలకు ఉచిత వైద్యం అందిస్తారు. అన్ని రకాల వైద్య సేవలు, అత్యాధునిక యంత్రాలు అందుబాటులో ఉంటాయి.


భవనాల నిర్మాణాలకు త్వరలో టెండర్లు
గణపతిరెడ్డి, ఈఎన్‌సీ, ఆర్‌అండ్‌బీ

సీఎం ఆదేశాల మేరకు కొత్త ఆస్పత్రుల భవనాల నిర్మాణం కోసం టెండర్లను పిలవబోతున్నాం. కొత్తపేటలోని 22 ఎకరాల్లో 15 అంతస్తుల పైనే ఆస్పత్రి భవనం నిర్మించనున్నాం. కంటోన్మెంట్‌ బోర్డు ఇచ్చే అనుమతి మేరకు అల్వాల్‌లోని 28 ఎకరాల్లో ఎన్ని అంతస్తులు నిర్మించాలన్న దానిపై నిర్ణయం తీసుకుంటాం. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రుల్లో 50 ఎకరాలు అందుబాటులో ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓ నిర్ణయానికి వస్తాం. గుత్తేదారు సంస్థకు పనులను అప్పగించిన తరువాత వేగంగా పనులను పూర్తి చేయడానికి ప్రణాళికను రూపొందించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని