logo

పనుల్లో జాప్యం.. ప్రయాణానికి శాపం

సరిహద్దు గిరిజన తండాల ప్రజలకు రోడ్డు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. రెండేళ్లుగా ఆర్టీసీ బస్సులు రావడం లేదు. అతి కష్టం మీద రాకపోకలు సాగిస్తున్నారు. ఓ మార్గంలో వర్షాలతో బురదగా మారి రాకపోకలు స్తంభించడంతో,

Published : 19 May 2022 02:11 IST

రూ.18.5 కోట్ల రోడ్డు పనుల్లో ఇదీ దుస్థితి

బురదగా మారిన మార్గం

పెద్దేముల్‌, న్యూస్‌టుడే: సరిహద్దు గిరిజన తండాల ప్రజలకు రోడ్డు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. రెండేళ్లుగా ఆర్టీసీ బస్సులు రావడం లేదు. అతి కష్టం మీద రాకపోకలు సాగిస్తున్నారు. ఓ మార్గంలో వర్షాలతో బురదగా మారి రాకపోకలు స్తంభించడంతో, మరో మార్గాన్ని ఎంపికచేసుకున్నారు. ప్రస్తుతం ఆ దారి కూడా బురదగా మారి ఇబ్బందులకు గురవుతున్నారు. పెద్దేముల్‌ మండలం తట్టేపల్లి గేటు నుంచి తాండూరు మండలం జిన్‌గుర్తి గేటు వరకు రోడ్డు మార్గాన్ని విస్తరించేందుకు ప్రభుత్వం 2016లో రూ.18.5 కోట్ల నిధులను మంజూరు చేసింది. రోడ్డు పనులను రెండు విభాగాలు చేసి ఇద్దరు గుత్తేదారులకు పనులు అప్పగించారు. రెండేళ్ల క్రితం ఓ గుత్తేదారు తట్టేపల్లి నుంచి అడ్కిచర్ల వరకు విస్తరణ పనులు మొదలుపెట్టారు. పాత రోడ్డును తొలగించి కొత్తగా పనులు చేశారు. మట్టిని పోసి విస్తరించారు. వర్షకాలం ప్రారంభం కావడంతో పనులు కొనసాగలేదు. మట్టి బురదగా మారడంతో ఆర్టీసీ సేవలు నిలిచిపోయాయి. నాటి నుంచి పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఈ మార్గంలో పరిస్థితి అలాగే కొనసాగుతోంది. దీంతో పలు గిరిజన తండాల ప్రజలు తాండూరు నుంచి జిన్‌గుర్తి మీదుగా అడ్కిచర్ల వరకు చేరుకుని ఇళ్లకు వెళ్లేవారు. రెండో గుత్తేదారు వేసవిలో జిన్‌గుర్తి గేటు నుంచి అడ్కిచర్ల వరకు గల రోడ్డు పనులను మొదలు పెట్టారు. పాత రోడ్డును పూర్తిగా తొలగించి మట్టిపోశారు. రెండు రోజులుగా కురుస్తున్న వానలకు ఈ మార్గంలో సైతం రాకపోకలు స్తంభించాయి. వాన కురిస్తే చాలు ద్విచక్ర వాహనదారులు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అడ్కిచర్ల వైపు బాయిమీది తండా, ఊరేంటి తండా, పాషాపూరు, ఓమ్లానాయక్‌ తండా, రాంసింగ్‌ తండా, రచ్చకట్ట తండా ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. మట్టి వేసి కంకర వేయకపోవడంతో పరిస్థితి దారుణంగా తయారైంది.


కంకర పోసి పూర్తి చేయిస్తాం
శ్రీనివాస్‌, డీఈఈ ఆర్‌ ఆండ్‌ బీ తాండూరు

రెండు వైపులా మట్టి పనులు పూర్తి చేయించాం. నీటితో తడులు పెట్టిస్తున్నాం. దానిపై కంకర వేసి తారు పనులు పూర్తి చేయాల్సి ఉంది. నెల రోజుల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని