logo

పల్లెలపై కాలుష్యం పడగ.. పర్యవేక్షణ పడక

ఐదేళ్ల క్రితం ఆత్కూరు ఆటవీ ప్రాంతంలో సర్వే సంఖ్య 19లో భారీగా వ్యర్థ రసాయనాలు బయట పడ్డాయి. కంకర తవ్వకాలు చేపట్టిన ప్రదేశంలో రహస్యంగా వీటిని నిల్వ చేశారు. సంగారెడ్డి సమీపంలోని ఓ ఔషధ పరిశ్రమలో మిగిలిన వ్యర్థ

Published : 19 May 2022 02:11 IST

పొలాల మధ్యన జిప్సం తయారీ పరిశ్రమ
న్యూస్‌టుడే, పెద్దేముల్‌  

రంగు మారిన సుద్ద మట్టి

* ఐదేళ్ల క్రితం ఆత్కూరు ఆటవీ ప్రాంతంలో సర్వే సంఖ్య 19లో భారీగా వ్యర్థ రసాయనాలు బయట పడ్డాయి. కంకర తవ్వకాలు చేపట్టిన ప్రదేశంలో రహస్యంగా వీటిని నిల్వ చేశారు. సంగారెడ్డి సమీపంలోని ఓ ఔషధ పరిశ్రమలో మిగిలిన వ్యర్థ రసాయనాలను ఇక్కడికి తెచ్చి పారబోసినట్లు అప్పట్లో పోలీసుల విచారణలో తేలింది. ఘాటైన దుర్వాసన రావడంతో విషయం బయటకు వచ్చింది. ప్రతి ట్యాంకరుకు రూ.20 వేల చొప్పున చెల్లించి వీటిని అటవీ ప్రాంతాల్లో పారబోసినట్లు పోలీసులు గుర్తించారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.


* కందనెల్లి రెవెన్యూ శివారులో గల వ్యవసాయ క్షేత్రంలో అటవీ ప్రాంతానికి పక్కనే వ్యర్థ రసాయనాలతో జిప్సం తయారీ చేస్తున్నారు. దీని తయారీతో ప్రజలు ఊపిరి తీసుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి. రాత్రి సమయంలో చిన్నారులు, వృద్ధులు దుర్వాసన భరించలేక అస్వస్థతకు గురవుతున్నారు. పరిశ్రమను మూసివేయాలని గిరిజనులు కోరుతుంటే నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్నారు.  

వికారాబాద్‌ జిల్లా ఒకప్పుడు పచ్చందాలకు పెట్టింది పేరు. కాలక్రమంలో యథేచ్ఛగా చెట్లను కొట్టేయడం, రోజురోజుకు నిర్మాణాలు పెరుగుతుండటం తదితర కారణాలతో పచ్చదనం తరిగిపోతోంది. దీనికితోడు కోరలుచాస్తున్న కాలుష్యం.. ప్రధానంగా సంగారెడ్డి, హైదరాబాద్‌ నగరాల చుట్టూ నెలకొన్న ఔషధ పరిశ్రమల్లో మిగిలిన వ్యర్థ రసాయనాలను జిల్లాలోని పల్లెలు, అటవీ ప్రాంతాలు, చెట్ల పొదలతో నిండిన పొలాల్లో పారబోసి కంపెనీలు చేతులు దులిపేసుకుంటున్నాయి. తద్వారా ఘాటైన వాసనలు పల్లె ప్రజలను అనారోగ్యం పాలుచేస్తున్నాయి. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం. 

నిల్వ చేసిన వ్యర్థ రసాయనాలు

అసలు ఏం జరుగుతోంది
కందనెల్లి గ్రామ రెవెన్యూ శివారు కందనెల్లి తండా సమీపంలో మూడేళ్ల క్రితం జిప్సం పరిశ్రమను నెలకొల్పారు. పొలాల మధ్యన ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కాదు. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రదేశం ఉంది. అత్యంత రహస్యంగా జిప్సంను తయారు చేస్తున్నారు. ట్యాంకర్లలో వచ్చే రసాయనాలను తొట్ల మాదిరిగా ఉండే వాటిల్లో పారబోస్తున్నారు. దానికి స్థానికంగా లభించే నాపరాతి పొడిని మిశ్రమంగా కలిపేస్తున్నారు. మట్టిలో ఇలా రోజుల తరబడి నిల్వ చేసి ఆ తర్వాత ముద్దలు ముద్దలుగా లారీల్లో తరలిస్తున్నారు.  

నిరసన తెలిపినా హామీలతో సరి
జిప్సం తయారీ నిబంధనలకు విరుద్ధంగా ఉంది. ఏ రసాయనాలు వాడుతున్నారనే విషయాన్ని ఏ ఒక్క అధికారి పరిశీలించలేదు. అనేక సార్లు బాధిత ప్రజలు పరిశ్రమలోకి వెళ్లి నిరసనలు వ్యక్తం చేశారు. తాజాగా స్థానికులు తీవ్ర ఆందోళన చేయడంతో పరిశ్రమను మూసేయిస్తామంటూ అధికారులు హామీలతో సరిపెట్టారు.  

ఎన్నెన్నో కష్టాలు..
జిప్సం తయారీ పరిశ్రమ అటవీ ప్రాంతం పక్కనే ఉంది. ఘాటైన వాసనలతో అడవి జంతువులు సైతం ఊపిరి తీసుకోలేని స్థితి ఏర్పడింది.  
అంతారం పెద్ద చెరువు, జంతి కుంట, అటవీ ప్రాంతంలోని చిన్న కుంటలు, చెక్‌ డ్యాంలు ఉన్నాయి. ఎగువ ప్రాంతంలో ఉన్న పరిశ్రమ నుంచి రసాయనాలు దిగువన ఉన్న చెరువు నీటిలో కలిసి కలుషితం అవుతున్నాయి.  
వ్యర్థ రసాయనాలతో తయారు చేస్తున్న జిప్సం వల్ల తాండూరు మండలం అంతారం, అంతారం తండా, పెద్దేముల్‌ మండలం కందనెల్లి తండా, గొట్లపల్లి గ్రామాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.


గర్భస్రావాలు అధికం అయ్యాయి
భజనీబాయి, కందనెల్లి తండా

ఈ పరిశ్రమ కారణంగా మహిళల ఆరోగ్య పరిస్థితి సరిగా ఉండటం లేదు. గర్భస్రావాలను అవుతున్నాయి. ఇప్పటికే తండాలో నలుగురికి పిండం ఎదగకపోవడం వల్ల గర్భస్రావం చేయించారు.


గింజ ఇంటికి రాలేదు
శంకర్‌, కందనెల్ల్లి తండా

ఏళ్లుగా పంటను సాగు చేసి జీవనం సాగిస్తున్నాం. మూడేళ్లుగా పరిస్థితి మారిపోయింది. పరిశ్రమ ఏర్పాటుతో మా బతుకులలో మట్టి పోశారు. గింజ ఇంటికి రావడం లేదు.  


పోరాటం కొనసాగుతుంది
మధులత, మండల పరిషత్‌ ఉపాధ్యక్షురాలు, పెద్దేముల్‌

నా సొంత రెవెన్యూ గ్రామంలో పరిశ్రమ నుంచి ప్రజలకు కలుగుతున్న ఇబ్బందుల గురించి అధికారులకు రాత పూర్వకంగా తెలియజేశాను.  రెవెన్యూ అధికారులు విచారణ జరిపి మధ్యలోనే వదిలేశారు. పూర్తి స్థాయిలో పరిశ్రమను మూసివేసే వరకు ప్రజల తరపున మా పోరాటం కొనసాగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని