logo

జీవనశైలి వ్యాధులకు చెక్‌!

మారుతున్న జీవనశైలితో అధిక రక్తపోటు, మధుమేహం బాధితులు పెరుగుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వైద్య ఆరోగ్యశాఖ హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని జీవనశైలి వ్యాధులు(ఎన్‌సీడీ)పై ఆయా ప్రాథమిక ఆరోగ్య

Updated : 19 May 2022 04:42 IST

హైబీపీ.. మధుమేహ రోగుల కోసం ప్రత్యేక కిట్లు
ఈ నెలాఖరు నుంచి పంపిణీకి సన్నాహాలు

రోగులకు అందించనున్న కిట్‌

ఈనాడు, హైదరాబాద్‌: మారుతున్న జీవనశైలితో అధిక రక్తపోటు, మధుమేహం బాధితులు పెరుగుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వైద్య ఆరోగ్యశాఖ హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని జీవనశైలి వ్యాధులు(ఎన్‌సీడీ)పై ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తోంది. 30 శాతం మంది ప్రజలకు ఈ పరీక్షలు చేశారు. చాలామందిలో హైబీపీ, మధుమేహం రోగాలు బయటపడుతున్నాయి. వీరికి వైద్య ఆరోగ్యశాఖ ఉచితంగా మందులు పంపిణీ చేయనుంది. ఈ నెలాఖరు నుంచి ఎన్‌సీడీ కిట్లను వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అందించనున్నారు.

ప్రయోజనాలు ఎన్నో
ప్రధానంగా ఈ కిట్‌లో తెలుపు, గోధుమ, నలుపు రంగుల్లో మూడు అరలు ఉంటాయి. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేసుకునే మందులను ఈ మూడింటిలో నింపి అందిస్తారు. చదువు రాని వారు సైతం సులభంగా వాడొచ్చు.
ప్రతి రోగిపై ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు పర్యవేక్షణ ఉంటుంది. ఇప్పటికే ఆ దిశగా వారికి శిక్షణ  అందించారు.
ఒక్కో కిట్‌లో నెల రోజులకు సరిపడా మందులు ఉంటాయి. ఇవి పూర్తి అయిన వెంటనే ఆయా వైద్య ఆరోగ్య సిబ్బంది మళ్లీ ఈ కిట్‌లో మందులు నింపి అందిస్తారు.
కొందరికి హైబీపీ, మధుమేహం రోగాలకు మందులు కొనుక్కోవాలంటే ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. నెలకు వీటి కోసమే రూ.వేయి వరకు ఖర్చు అవుతోంది. ఆ భారం భరించలేక మధ్యలో మందులు మానేసేవారు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఉచిత కిట్‌ ద్వారా ఇలాంటి వారికి ఖర్చు ఆదా కానుంది.
మందులు వాడుతున్నారా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు స్వయంగా రోగికి ఫోన్‌ చేసి వివరాలు ఆరా తీయనున్నారు.
నగరంలో ఉన్న 52 తెలంగాణ డయోగ్నోస్టిక్‌ కేంద్రాల ద్వారా ఇలాంటి వారిందరికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరీక్షలు చేయనున్నారు. ఒకవేళ అధిక రక్తపోటు, మధుమేహం నియంత్రణలోకి రాకపోతే మందుల డోసు మరింత పెంచనున్నారు.
ఇక పరీక్షల్లో అధిక రక్తపోటు, మధుమేహమే కాకుండా ఇతర జీర్ణకోశ సమస్యలు, గుండెజబ్బులు, కేన్సర్‌ లాంటి వ్యాధులు బయటపడిన సరే.. గాంధీ, ఉస్మానియా, ఎంఎన్‌జే ఆసుపత్రులకు పంపించి చికిత్స అందించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని