logo

మూసీ ఒడ్డున అనుమానాస్పద స్థితిలో బాలుడి దుర్మరణం

మూసీనది ఒడ్డున అనుమానాస్పద స్థితిలో ఓ బాలుడు తీవ్ర గాయాలతో అత్యంత దయనీయస్థితిలో మృతిచెందిన సంఘటన కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

Published : 20 May 2022 02:49 IST

వీధి కుక్కల దాడి చేశాయా? ఇతర కారణాలా?


సయ్యద్‌ సోఫియాన్‌

జియాగూడ, న్యూస్‌టుడే: మూసీనది ఒడ్డున అనుమానాస్పద స్థితిలో ఓ బాలుడు తీవ్ర గాయాలతో అత్యంత దయనీయస్థితిలో మృతిచెందిన సంఘటన కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడిచేసి గాయపర్చడం వల్లే ఆ బాలుడు మృతి చెంది ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. కుల్సుంపురా పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌కుమార్‌ వివరాల ప్రకారం... కార్వాన్‌ పంచ్‌బాయ్‌హలావా ప్రాంతానికి చెందిన సయ్యద్‌ అలీ, జమృత్‌బేగం దంపతులకు ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. సయ్యద్‌ అలీ స్థానిక హోటల్‌లో టీ విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పిల్లలను చదివిస్తున్నాడు. వీరి చిన్న కుమారుడు సయ్యద్‌ సోఫియాన్‌ (12) కార్వాన్‌లోని గ్రేస్‌ మోడల్‌ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించడంతో సూఫియాన్‌ ఇంట్లోనే ఉంటున్నాడు. మూసీలో చేపలు పట్టేందుకు తోటి స్నేహితులతో కలిసి వెళ్లేవాడు. గురువారం ఉదయం పది గంటలకు ఇంట్లోంచి బయటికి వెళ్లిన సోఫియాన్‌.. మూసీ నది తీరాన శవమై కనిపించాడు. వీధి కుక్కలు.. మృతదేహాన్ని పీక్కుతింటుండగా.. స్థానికులు గమనించి ఆ కుక్కలను అక్కడి నుంచి తరిమేసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలిని గోషామహల్‌ ఏసీపీ సతీష్‌కుమార్‌ సందర్శించి పరిస్థితులను సమీక్షించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని కుల్సుంపురా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని