logo

రోడ్డెక్కని ఆటో.. క్యాబ్‌లు

కేంద్ర మోటారు వాహన చట్టం- 2019 రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆటో, క్యాబ్‌ సేవల్ని గురువారం నిలిపేయడంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ ఆటో, క్యాబ్‌, లారీ సంఘాల ఐకాస పిలుపుమేరకు, నగరంలో కొన్ని ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచే ఆటో, క్యాబ్‌ సేవలు నిలిచిపోయాయి.

Published : 20 May 2022 02:49 IST

ప్రధాన కూడళ్లలో డ్రైవర్ల ఐకాస ఆధ్వర్యంలో నిరసన


సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ వద్ద ఇళ్లకు వెళ్లేందుకు ప్రయాణికుల ఎదురుచూపులు

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర మోటారు వాహన చట్టం- 2019 రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆటో, క్యాబ్‌ సేవల్ని గురువారం నిలిపేయడంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలంగాణ ఆటో, క్యాబ్‌, లారీ సంఘాల ఐకాస పిలుపుమేరకు, నగరంలో కొన్ని ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుంచే ఆటో, క్యాబ్‌ సేవలు నిలిచిపోయాయి. ఉదయాన్నే వివిధ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారికి నిరీక్షణ తప్పలేదు. బంద్‌ నేపథ్యంలో ప్రజల అవసరాల మేరకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ప్రకటించినా అవి సరిపోలేదు. ప్రత్యేక బస్సులు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ముఖ్యంగా కాలనీల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు అవస్థలు ఎదుర్కొన్నారు. ఆన్‌లైనులో క్యాబ్‌, ఆటోలు బుక్‌ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసి ప్రయాణించాయి. ఇంటర్‌ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఇబ్బందులు తప్పలేదు. పరీక్ష ముగిశాక ఇళ్లకు చేరుకొనేందుకు బస్సుల కోసం పరుగులు పెట్టారు.

వేర్వేరు ప్రాంతాల్లో ఆందోళనలు

ఫిట్‌నెస్‌ ధ్రువీకరణ ఆలస్యమైతే రోజుకు రూ.50 చొప్పున జరిమానా ఉపసంహరించాలని, మోటారు వాహన చట్టం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ఆటో, క్యాబ్‌, లారీ డ్రైవర్ల ఐకాస గురువారం నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించింది. ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కమిషనర్‌ కార్యాలయ ముట్టడికి యత్నించడంతో గంటకుపైగా ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయం ముందు ప్రధాన రహదారిపై ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. ప్రధాన కూడళ్లు, ఎల్‌బీనగర్‌, సికింద్రాబాద్‌లో ఆటోలు, క్యాబ్‌ సేవల్ని ఐకాస నేతలు నిలిపివేశారు. ఎస్‌ఆర్‌ నగర్‌లో ఆందోళన చేస్తున్న డ్రైవర్లను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.


చైతన్యపురిలో కిటకిటలాడుతూ వెళ్తున్న ఆర్టీసీ సిటీ బస్సు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని