logo

దక్షిణాఫ్రికా డ్రగ్స్‌ చేరుతోంది ఎవరికి?

దక్షిణాఫిక్రా నుంచి రాజధానికి రూ.కోట్ల మాదక ద్రవ్యాలు వస్తున్నాయని తెలుసుకున్న కేంద్ర సంస్థలు.. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి అవి ఎవరికి చేరుతున్నాయన్న అంశంపై పరిశోధిస్తున్నారు.

Published : 20 May 2022 02:49 IST

శంషాబాద్‌ విమానాశ్రయంపై కేంద్ర సంస్థల నిఘా

 

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణాఫిక్రా నుంచి రాజధానికి రూ.కోట్ల మాదక ద్రవ్యాలు వస్తున్నాయని తెలుసుకున్న కేంద్ర సంస్థలు.. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి అవి ఎవరికి చేరుతున్నాయన్న అంశంపై పరిశోధిస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో శంషాబాద్‌ విమానాశ్రయంలో రూ.220 కోట్ల విలువైన కొకైన్‌, హెరాయిన్‌ను కస్టమ్స్‌.. డీఆర్‌ఐ, సీఐఎస్‌ఎఫ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇకపై దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విదేశీయులపై నిఘా ఉంచనున్నారు.

గుర్తించడంలో ఇబ్బందులు

శంషాబాద్‌ విమానాశ్రయానికి రోజూ 6 వేల మంది విదేశీయులు వస్తున్నారు. వీరిలో ఎంతమంది మాదక ద్రవ్యాలు తీసుకొస్తున్నారు? ఎలా తెస్తున్నారు? తెలుసుకునేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం శంషాబాద్‌ విమానాశ్రయంలో లేదు. డ్రగ్స్‌ను గుర్తించే సెన్సర్లున్నా రద్దీ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరినీ సెన్సర్ల గుండా రావాలంటూ సూచించడం సాధ్యం కాదు.

* దక్షిణాఫిక్రా నుంచి వచ్చే వారిలో పలువురు లగేజీలు, లోదుస్తులు, పొట్టలో కొకైన్‌ను తెస్తున్నారు.

* భారత్‌లోని ప్రధాన ఓడరేవులు, విమానాశ్రయాల్లో సెన్సర్లను, స్నిఫర్‌ డాగ్స్‌ బృందాలను సమకూర్చుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.

డర్బన్‌.. కేప్‌టౌన్‌.. జొహెన్నెస్‌బర్గ్‌

దక్షిణాఫిక్రాలోని డర్బన్‌.. కేప్‌టౌన్‌.. జొహెన్నెస్‌బర్గ్‌ నగరాలకు సమీపంలో సముద్ర మార్గముంది. డర్బన్‌ ఓడరేవుకు బ్రెజిల్‌ నుంచి టన్నుల కొద్దీ కొకైన్‌ వస్తోంది. డ్రగ్‌ మాఫియా అక్కడి నుంచి భారత్‌కు నౌకల ద్వారా చేరవేస్తోంది. బడా డాన్‌లు కేరళలోని కోచి, గుజరాత్‌లోని ముంద్రా, ముంబయిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ పోర్ట్‌లకు తరలిస్తున్నారు. ఇక్కడున్న స్మగ్లర్లు భారీ నౌకలకు లంగరు వేసి చిన్న పడవల్లో వెళ్లి డ్రగ్స్‌ తీసుకుంటున్నారు. డైరెక్టర్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ గతేడాది సెప్టెంబరులో రూ.21 వేల కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని