logo

తరుణం ముంపుకొస్తోంది

భాగ్యనగరానికి సెప్టెంబరు 28, 1908లో వచ్చిన వరద తీవ్రంగా దెబ్బకొట్టింది. మూసీకి ఎగువ నుంచి భారీగా వరద రావడం, సమాంతరంగా నగరంలో మూడు రోజులపాటు 43 సెం.మీ వర్షం కురవడంతో నగరం మొత్తం మునిగిపోయింది. తర్వాత అక్టోబరు 17, 2020న ఆరు గంటల వ్యవధిలో 30 సెం.మీ వాన పడింది. మియాపూర్‌ నుంచి అమీర్‌పేట వరకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. లంగర్‌హౌజ్‌ నుంచి మూసారాంబాగ్‌ వరకు మూసీ నదిపై ఉన్న వంతెనలను వరద ముంచెత్తింది. హుస్సేన్‌సాగర్‌ వరదనీటి నాలా ఉప్పొంగడంతో అశోక్‌నగర్‌, హిమాయత్‌నగర్‌ ప్రాంతాల్లోని కొన్ని కాలనీలు నీట మునిగాయి.

Published : 20 May 2022 02:49 IST

నెమ్మదిగా కొనసాగుతున్న నాలాల విస్తరణ

రెండేళ్ల క్రితం వరద మంచెత్తిన ప్రాంతాల్లో భయం

ఈనాడు, హైదరాబాద్‌


గుర్రం చెరువుకు చేరుకుంటున్న బురాన్‌ఖాన్‌ కుంట కాలువ నిర్మాణం

భాగ్యనగరానికి సెప్టెంబరు 28, 1908లో వచ్చిన వరద తీవ్రంగా దెబ్బకొట్టింది. మూసీకి ఎగువ నుంచి భారీగా వరద రావడం, సమాంతరంగా నగరంలో మూడు రోజులపాటు 43 సెం.మీ వర్షం కురవడంతో నగరం మొత్తం మునిగిపోయింది. తర్వాత అక్టోబరు 17, 2020న ఆరు గంటల వ్యవధిలో 30 సెం.మీ వాన పడింది. మియాపూర్‌ నుంచి అమీర్‌పేట వరకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. లంగర్‌హౌజ్‌ నుంచి మూసారాంబాగ్‌ వరకు మూసీ నదిపై ఉన్న వంతెనలను వరద ముంచెత్తింది. హుస్సేన్‌సాగర్‌ వరదనీటి నాలా ఉప్పొంగడంతో అశోక్‌నగర్‌, హిమాయత్‌నగర్‌ ప్రాంతాల్లోని కొన్ని కాలనీలు నీట మునిగాయి. ఉస్మానియా వర్సిటీలోని చెరువులతో అంబర్‌పేట, రామంతాపూర్‌ ప్రాంతాలు అవస్థపడ్డాయి. ఫాక్స్‌సాగర్‌తో కుత్బుల్లాపూర్‌, కూకట్‌పల్లి నాలాతో బేగంపేటలోని లోతట్టు ప్రాంతాలు కనుమరుగయ్యేంత బీభత్సం తలెత్తింది. ఎల్బీనగర్‌ జోన్‌లోని చెరువులు విశ్వరూపం చూపించాయి. ఏటా భారీ వర్షాలు కురుస్తుండటంతో పరిష్కార మార్గంగా నాలాలను విస్తరించి, చెరువుల్లోని ఆక్రమణలను తొలగించి వరద సమస్య తలెత్తకుండా చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం(ఎస్‌ఎన్‌డీపీ) కింద రూ.858కోట్లతో పనులు చేపట్టామంది. మరో నెల రోజుల్లో వర్షాకాలం మొదలవుతుండగా సరూర్‌నగర్‌, పల్లెచెరువు, ఫాక్స్‌సాగర్‌ చెరువుల వద్ద మినహా వేరే ఏ ప్రాంతంలోనూ పరిస్థితి మారలేదు.

ఎల్బీనగర్‌ జోన్‌లో 2020నాటి వరద బీభత్సం ఇలా..

మునిగిన కాలనీలు 170

తూములు లేనివి 9

మొత్తం చెరువులు 20

బాధిత కుటుంబాలు 80,000

దెబ్బతిన్న నిర్మాణాలు2760


పూర్తికాని అప్పా చెరువు ముంపు వరద కాలువ విస్తరణ

కాటేదాన్‌: రాజేంద్రనగర్‌ సర్కిల్‌ మైలార్‌దేవులపల్లి డివిజన్‌లోని చారిత్రక అప్పాచెరువుకు గతేడాది గండి పడింది. ముంపును తప్పించే నాలా పనులు ఇటీవల మొదలయ్యాయి. రాబోయే వర్షాకాలానికి పూర్తవడం కష్టమని, వేగం పెంచాలని స్థానికులు బల్దియాను కోరుతున్నారు.


ఎక్కడెలా ఉందంటే..


2020 అక్టోబరులో వరద నీటితో మునిగిపోయిన ముర్కినాలా

కేశవగిరి: అక్టోబరు 2020లో కురిసిన కుండపోత వాన పాతబస్తీ బండ్లగూడ పల్లెచెరువు, బార్కస్‌లోని గుర్రం చెరువులు పూర్తిగా నిండి ముర్కినాలాను ముంచెత్తాయి. పరిస్థితులను చక్కదిద్దేందుకు పల్లెచెరువు వరద నాలా విస్తరణ పనులు రూ.25 కోట్లతో చేపట్టారు. జహంగీరాబాద్‌, అలీనగర్‌, కబ్‌గీర్‌నగర్‌, అల్‌జుబైల్‌కాలనీల్లో నాలాను విస్తరించి రక్షణ గోడ నిర్మించారు. ఫలక్‌నుమా ఆర్వోబీ కింద నాలా విస్తరణ పూర్తయింది. దాంతో ఆయా ప్రాంతాలు కొంత ధైర్యంగా ఉన్నాయి. గుర్రంచెరువు దిగువన గుల్షన్‌ ఎక్బాల్‌కాలనీ నుంచి సాయిబాబానగర్‌ వరకు ముర్కినాలా విస్తరణకు చేపట్టిన రూ.25 కోట్ల పనులు ఇంకా టెండరు దశలో ఉన్నాయి. మళ్లీ భారీ వర్షం కురిస్తే మునగాల్సిందే.

గోల్కొండ: నానల్‌నగర్‌ డివిజన్‌లోని నిజాంకాలనీ, మెరాజ్‌కాలనీ, టోలిచౌకి డివిజన్‌లోని నదీంకాలనీ, విరాసత్‌కాలనీలు ఏటా ముంపు బారిన పడుతున్నాయి. సమస్యను పరిష్కరించేందుకు హకీంపేట నుంచి అల్‌హస్‌నత్‌కాలనీ, నానల్‌నగర్‌, రేతీబౌలి మీదుగా మూసీలో వరదనీటిని కలిపేందుకు చేపట్టిన నాలా పనులు మొదలుకాలేదు. టోలిచౌకి బాల్‌రెడ్డినగర్‌లో పనులు కొంత మేర పూర్తయ్యాయి. విరాసత్‌కాలనీలో పనులు మొదలయ్యాయి.

హయత్‌నగర్‌: రెండేళ్లుగా హయత్‌నగర్‌ డివిజన్‌లోని బాతుల చెరువుకు దిగువనున్న బంజారాకాలనీ, అంబేడ్కర్‌ నగర్‌, రంగనాయకులగుట్ట తదితర కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ముంపును నివారించేందుకు రూ.10కోట్లతో బంజారా కాలనీ రోడ్డులోని ఆర్టీసీ మజ్దూర్‌ కాలనీ, తిరుమల కాలనీ మీదుగా పనులు ప్రారంభించగా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు సాగుతున్నాయి.

పహాడీషరీఫ్‌: జల్‌పల్లి పురపాలిక పరిధి బురాన్‌ఖాన్‌ చెరువు పరిసరాలను రెండేళ్లుగా వరద ముంచెత్తుతోంది. ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాల విషయం న్యాయస్థానంలో ఉందని దీంతో పనులు చేపట్టలేకపోతున్నామని అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు చేతులు దులిపేసుకుంటున్నారు. సమస్యను పరిష్కరించకపోతే రాబోయే వర్షాకాలంలో బడంగ్‌పేట కార్పొరేషన్‌ పరిధిలోని వెంకటాపూర్‌ నీట మునిగే అవకాశముంది.

అంబర్‌పేట: అంబర్‌పేటలో నాలాల విస్తరణకు రూ.22కోట్లు కేటాయించినా.. పనులు ప్రారంభం కాలేదు. నాలా విస్తరణతో సమస్యను పరిష్కారిస్తామంటూ నేతల హామీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.

బండ్లగూడ: వందలాది ఇళ్లను, పదుల కాలనీలను ఏటా నీట ముంచుతోన్న బండ్లగూడ చెరువు ఆక్రమణలతో రూపం కోల్పోయింది. వరద ఎక్కువైనప్పుడు వెనకున్న బండ్లగూడ ప్యారనగర్‌, అయ్యప్పకాలనీ, మల్లికార్జుననగర్‌, తదితర ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. మన్సూరాబాద్‌-బండ్లగూడ-నాగోలు-మూసీ వరకు నాలా పనులు రూ.63 కోట్లతో చేపట్టారు. సగం పూర్తయ్యాయి.


పల్లెచెరువు దిగువన బండ్లగూడ జహంగీరాబాద్‌ వద్ద విస్తరించిన ముర్కినాలా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని