logo

ధరణి సవరణ.. ఏదీ కార్యాచరణ?

భూముల క్రయవిక్రయాలతో పాటు దస్త్రాల నవీకరణను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల పలు అంశాల్లో రైతులకు ప్రయోజనం కలుగగా, మరికొన్నింటిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Updated : 20 May 2022 05:21 IST

కొత్త ఐచ్ఛికాలకు తెరుచుకోని కలెక్టర్‌ లాగిన్‌

న్యూస్‌టుడే, వికారాబాద్‌


కార్యాలయంలో బారులు దీరిన దరఖాస్తుదారులు

భూముల క్రయవిక్రయాలతో పాటు దస్త్రాల నవీకరణను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. దీనివల్ల పలు అంశాల్లో రైతులకు ప్రయోజనం కలుగగా, మరికొన్నింటిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా డిజిటల్‌ పట్టాదారు పాసుపుస్తకంలో ఏ చిన్న తప్పు దొర్లినా సవరించుకునే అవకాశం లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. గత మూడేళ్లుగా కర్షకుల వినతుల మేరకు ఇటీవలే 11 రకాల సమస్యల పరిష్కారానికి సిటిజన్‌ లాగిన్‌లో ‘అప్లికేషన్‌ ఫర్‌ పాస్‌బుక్‌ డేటా కరెక్షన్‌’(పొరపాట్ల సవరణ దరఖాస్తు) పేరిట నూతన ఐచ్ఛికాలను అందుబాటులోకి తెచ్చారు. ఇంత వరకు బాగానే ఉన్నా, సంబంధిత లాగిన్‌ను తెరిచే అవకాశాన్ని కలెక్టర్లకు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. గత ఫిబ్రవరి వరకు ధరణిలో ఏడు రకాల సమస్యల పరిష్కారంపై 4,231 దరఖాస్తులు రాగా, వీటిలో వెయ్యి వరకు మాత్రమే పరిష్కారమయ్యాయి.

వీటికి అవకాశం..

* పట్టా పాసుపుస్తకంలో దొర్లిన పొరపాట్లు, తప్పులు, ఇతరుల పేర్లు వచ్చినా, అక్షర దోషాలు ఉన్నా సవరించుకునే వెసులుబాటు కలుగుతుంది.

* రిజర్వేషన్‌ కేటగిరీ, ఆధార్‌ సంఖ్య తప్పుగా నమోదైతే సరి చేసుకునే అవకాశం ఉంటుంది.

* భూమి స్వభావం, పట్టా, సీలింగ్‌, భూదాన్‌, దేవాదాయ, వక్ఫ్‌బోర్డు, అసైన్డ్‌మెంట్‌, నిషేధిత జాబితాలో ఉంటే సరి చేసుకోవచ్చు. మాగాణి, మెట్ట, తరి వంటి వివరాలతో పాటు వాస్తవ విస్తీర్ణం కన్నా పాసుపుస్తకంలో ఎక్కువ, తక్కువ నమోదైతే సరిదిద్దుకునే అవకాశం కలుగుతుంది. ఎన్నో రోజులుగా సవరణలకు నిరీక్షిస్తున్న వారికి ప్రభుత్వ నిర్ణయం ఎంతో ఆనందాన్ని కలిగించింది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనతో వేలాది మంది మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆయా అర్జీలను పరిశీలించేందుకు పోర్టల్‌లో కలెక్టర్‌కు లాగిన్‌ ఇవ్వకపోవడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. బాధిత రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కొత్త ఐచ్ఛికాలు అమలవుతున్నాయా..? అంటూ తెలుసుకొని నిరాశగా వెనుదిరుగుతున్నారు.

ఇలా చేస్తారు..

సవరణకు సమర్పించిన అర్జీలను మొదట కలెక్టర్లు పరిశీలించి క్షేత్రస్థాయి విచారణ నిమిత్తం ఆయా మండలాల తహసీల్దార్లకు పంపిస్తారు. అనంతరం వారి నివేదికను అనుసరించి కలెక్టర్‌ ఆయా దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాల్సి ఉంటుంది.

మూడేళ్లుగా తిరుగుతున్నా.. : గోపాల్‌, అల్లీపూర్‌, ధారూర్‌

నా పేరిట అల్లీపూర్‌ గ్రామంలో సర్వే నెం.32లో విస్తీర్ణం 3.30 ఎకరాల పట్టా పొలం ఉంది. ఇది పొరపాటున ప్రభుత్వ భూమిగా నమోదై నిషేధిత జాబితాలో పడింది. మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా, ఐచ్ఛికాలు వచ్చిన వెంటనే సరి చేస్తామంటున్నారే తప్ప పరిష్కారం చూపడం లేదు. కొత్తగా వచ్చాయని తెలుసుకొని సంతోషించా, ఆచరణలో అమలు కాకపోవడంతో నిరాశకు గురయ్యా.

న్యాయం చేయాలి.. : ఈశ్వరమ్మ, మైలార్‌దేవరంపల్లి, వికారాబాద్‌

నా భర్త పెద్ద అంజయ్య తండ్రి ఎల్లన్న పేరిట మైలార్‌దేవరంపల్లి శివారులో సర్వే నెం.92లో విస్తీర్ణం 1.32 ఎకరాలు, సర్వే నెం.93/అ/1లో విస్తీర్ణం 2.09 ఎకరాల పొలం ఉంది. నా భర్త 2021 జనవరి 20న మృతి చెందాడు. ఆయన పేరిట ఉన్న భూమిని నా పేరిట పట్టా మార్పిడి చేసేందుకు మీ సేవలో రూ.6,800 చెల్లించినా తిరస్కరించారు. మళ్లీ చెల్లించినా కారణం చెప్పకుండానే తిరస్కరణకు గురైంది. నాకు న్యాయం చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని