Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. ప్రేమ వివాహం చేసుకున్నాడని చంపేశారు

భాగ్యనగరం నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. నగరంలోని మచ్చి మార్కెట్‌ వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నీరజ్‌ పన్వార్‌ అనే వ్యక్తిని నలుగురు దుండగులు

Updated : 20 May 2022 22:21 IST

హైదరాబాద్: భాగ్యనగరం నడిబొడ్డున దారుణం చోటుచేసుకుంది. నగరంలోని మచ్చి మార్కెట్‌ వద్ద వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నీరజ్‌ పన్వార్‌ అనే వ్యక్తిని నలుగురు దుండగులు కత్తులతో అత్యంత దారుణంగా పొడిచి హతమార్చారు. ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కక్షతో దుండగులు హత్య చేసినట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం నీరజ్‌ ప్రేమ వివాహం చేసుకోవడంతో యువతి కుటుంబసభ్యులు ఈ దారుణానికి ఒడిగట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్య కేసులో మొత్తం ఐదుగురు నిందితుల ప్రమేయం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రంగంలోకి టాస్క్‌ఫోర్స్‌ సహా నాలుగు బృందాలు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు. రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు గుర్తించారు.

మాకు న్యాయం కావాలి: నీరజ్‌ తండ్రి

‘‘మా అబ్బాయి ఏడాది క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. నీరజ్ ప్రేమ వివాహం చేసుకున్నాడని యువతి కుటుంబసభ్యులు కక్ష పెట్టుకొని కిరాతకంగా హత్య చేశారు. ఇంటి సమీపంలోని ఫిల్ఖానా వద్దనున్న ఓ షాప్‌కు నీరజ్‌ వెళ్ళాడు. అంతలోనే రెండు బైక్‌ల మీద వచ్చిన ఐదుగురు యువకులు నీరజ్‌ను 5 నిమిషాల్లోనే హతమార్చారు. నీరజ్ ప్రేమ వివాహం అనంతరం యువతి కుటుంబసభ్యులతో ఇబ్బందులున్నట్లు గతంలోనే అఫ్జల్‌గంజ్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. మాకు న్యాయం కావాలి. అమ్మాయి కుటుంబసభ్యులే ఈ దారుణానికి ఒడిగట్టారు’’ అని నీరజ్‌ తండ్రి ఆరోపించారు.

‘‘ఏడాది క్రితం నీరజ్‌ ఆర్య సమాజ్‌లో కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి 4 నెలల బాబు ఉన్నాడు. అమ్మాయి కుటుంబసభ్యులే నీరజ్‌ను హత్య చేశారని ప్రాథమికంగా గుర్తించాం. మృతుడి తండ్రి ఫిర్యాదు ఇచ్చారు. ఈ హత్య కేసులో ఐదుగురు ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించాం. కేసు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. త్వరలోనే నిందితులను పట్టుకుంటాం’’ - గోషామహల్‌ ఏసీపీ సతీష్‌ కుమార్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని