Telangana News: కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వమూ తగ్గించాలి: బండి సంజయ్‌

పెట్రోల్‌, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతమైనదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ఎంతో ఉపశమనం కలగనుందన్నారు...

Updated : 22 May 2022 02:39 IST

హైదరాబాద్: పెట్రోల్‌, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత సాహసోపేతమైనదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో దేశంలోని కోట్లాది మంది ప్రజలకు ఎంతో ఉపశమనం కలగనుందన్నారు. ఈ మేరకు బండి సంజయ్‌ ప్రకటన విడుదల చేశారు. దేశ ప్రజల అవసరాల దృష్ట్యా పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం సంతోషకరమైన విషయమన్నారు. తాజా నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఆదాయం రూ.లక్ష కోట్ల మేరకు తగ్గే అవకాశమున్నప్పటికీ ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

‘‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్‌పై 200 రూపాయలు తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించడం సంతోషించదగ్గ విషయం. దీనివల్ల దేశంలోని 9 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుంది. తాజా నిర్ణయం వల్ల ప్రత్యక్షంగా కేంద్రంపై రూ.6,100 కోట్ల మేర భారం పడుతున్నప్పటికీ పేదల సంక్షేమం కోసం కేంద్రం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్‌లో ఎరువులు ధరలు పెరుగుతున్నప్పటికీ... ఆ భారాన్ని రాయితీ రూపంలో భరించేందుకు ప్రస్తుత బడ్జెట్ లో 1 లక్షా 5 వేల కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్రం.. అవసరమైతే అదనంగా మరో రూ.లక్షా 10 వేల కోట్లను కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించం గొప్ప నిర్ణయం. పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వం గతంలోనూ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించింది. వరుసగా రెండోసారి కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు పెట్రోల్‌, డీజిల్‌పై పన్నును తగ్గించకపోవడం దారుణం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా రాష్ర ప్రభుత్వం కూడా వెంటనే వ్యాట్‌ తగ్గించి రాష్ట్ర ప్రజలకు మరింత ఉపశమనం కలిగించాలి. లేనిపక్షంలో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అవసరమైతే వ్యాట్ తగ్గించే దాకా ప్రజల పక్షాన పోరాటం చేస్తాం’’ అని బండి సంజయ్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని