logo

ఏక రూపం... కుట్టేద్దామా ఎంచక్కా..

‘రోజుకో రూపాయి పొదుపు’తో సుమారు పాతికేళ్ల కిందట మహిళా సంఘాలు ఆవిర్భవించాయి. నాటి నుంచి నేటివరకు ప్రభుత్వ  సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాలతో అప్రతిహతంగా సాగుతున్నాయి. ఆర్థికంగా కుటుంబాలను బాగు చేసుకుంటున్నాయి.

Published : 24 May 2022 00:46 IST

 పొదుపు సంఘాలకు బాధ్యతలు  
జతకు రూ.50
న్యూస్‌టుడే, బొంరాస్‌పేట,కొడంగల్‌ గ్రామీణం

‘రోజుకో రూపాయి పొదుపు’తో సుమారు పాతికేళ్ల కిందట మహిళా సంఘాలు ఆవిర్భవించాయి. నాటి నుంచి నేటివరకు ప్రభుత్వ  సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాలతో అప్రతిహతంగా సాగుతున్నాయి. ఆర్థికంగా కుటుంబాలను బాగు చేసుకుంటున్నాయి. అలాంటి సంఘాలకు ప్రభుత్వం తాజాగా ఏకరూప దుస్తులు కుట్టించే బాధ్యతలను అప్పగించే పనిలో ఉంది. దీన్లో భాగంగా సంఘాల్లో ఉంటూ కుట్టు పని వచ్చి ఆసక్తి, అనుభవమున్న మహిళలను గుర్తించే పనిలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఇందుకు సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

జిల్లాలో ఇలా....

జిల్లాలోని 19 మండలాల్లో ప్రభుత్వ బడులకు తోడుగా కస్తూర్బా, గురుకుల, ఆదర్శతో కలిపి 1,107 పాఠశాలలున్నాయి. కరోనా ప్రభావంతో రెండేళ్లు పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు సాగలేదు. ఈ ఏడాది ప్రారంభం అనంతరం ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగింది. దీనికి తోడు 2022- 23 విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక స్థాయిలోనూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడానికి అడుగులు పడుతున్నాయి. ఒకటి నుంచి 8వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు ఇప్పటికే శిక్షణ సైతం ఇచ్చారు. ఈ కారణంగా ఈసారి ప్రవేశాల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

లక్ష్యం నెరవేర్చేందుకే ఈ మార్పు...

ప్రభుత్వ లక్ష్యం నెరవేరటం లేదని గుర్తించిన పాఠశాల విద్యాశాఖ రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా విద్యా శాఖాధికారులతో సమీక్షించారు.  పొదుపు సంఘాలు చురుగ్గా పని చేస్తున్న నేపథ్యంలో ఏకరూప దుస్తులు కుట్టే బాధ్యతలను వారికే అప్పగించాలనే ఆలోచనకు వచ్చారు. స్థానికంగా ఉంటున్న మహిళలైతే విద్యార్థులకు దుస్తులు కుట్టడంలో నాణ్యత పాటిస్తారని, తేడాలున్నా వారే సరి చేస్తారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ప్రతి జత దుస్తులకు రూ.50 చొప్పున అందిస్తామనే విషయాన్ని తెలియజేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం పొదుపు సంఘాల్లో చురుగ్గా ఉంటూ కుట్టు పని చేస్తున్న మహిళలను క్షేత్రస్థాయిలో అధికారులు గుర్తిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పొదుపు సంఘాల మహిళలతోనే కుట్టించాలని అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. 

ఏటా రెండు జతలు ఉచితం

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి రెండు జతలు ఏకరూప దుస్తులను ఉచితంగా అందిస్తున్నారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీలకు వస్త్రం వస్తే స్థానిక దర్జీలతో కుట్టించి విద్యార్థులకు అందించాలనేది ప్రభుత్వ ధ్యేయం. ఇలా చేస్తే సొంతూరులోని దర్జీలకు ఉపాధి లభిస్తుందని అధికారులు ఆశించారు. కుట్టు కూలీ సకాలంలో అందకపోవటం, గిట్టుబాటు లేని ధరలతో స్థానికులు కుట్టేందుకు ముందుకు రావడంలేదు. ఈ నేపథ్యంలో పట్టణాల్లోని పెద్ద దర్జీలే వస్త్రం తీసుకెళ్లి కుట్టిన దుస్తులు పాఠశాలలకు ఇస్తూ వస్తున్నారు.

దర్జీల వివరాలు సేకరిస్తున్నాం
- రవికుమార్‌, విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి, వికారాబాద్‌
పొదుపు సంఘాల్లోని దర్జీలతోనే ఏకరూప దుస్తులు కుట్టించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అందుకు అనుగుణంగా ఆయా సంఘాల్లోని కుట్టు పని తెలిసిన మహిళల వివరాలను గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను అడిగాం. ఆసక్తి, అనుభవమున్న మహిళల సమాచారం సేకరిస్తున్నాం. వస్త్రం వచ్చిన వెంటనే విద్యార్థుల సంఖ్య ఆధారంగా పాఠశాలలకు చేరవేస్తాం. వారంతా స్థానికంగా పొదుపు సంఘాల మహిళలతో దుస్తులు కుట్టిస్తారు.



 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని