logo

నిబంధనలకు విరుద్ధంగా బ్యాటరీ రీసైక్లింగ్‌

నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న మూడు లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీ తయారీ యూనిట్లపై కాలుష్య నియంత్రణ మండలి కొరడా ఝుళిపించింది. ఔటర్‌ రింగు రోడ్డుకు సమీపంలోని జిన్నారం పారిశ్రామికవాడలో అక్రమంగా బ్యాటరీలు రీసైక్లింగ్‌ చేస్తూ.

Published : 24 May 2022 01:50 IST

 జిన్నారంలో మూడు యూనిట్ల మూసివేతకు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న మూడు లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీ తయారీ యూనిట్లపై కాలుష్య నియంత్రణ మండలి కొరడా ఝుళిపించింది. ఔటర్‌ రింగు రోడ్డుకు సమీపంలోని జిన్నారం పారిశ్రామికవాడలో అక్రమంగా బ్యాటరీలు రీసైక్లింగ్‌ చేస్తూ..పర్యావరణానికి విఘాతం కలిగేలా వాటిని ధ్వంసం చేస్తున్న మూడు యూనిట్లను మూసేయాలని ఇటీవల ఆదేశించింది. నిర్దిష్ట పద్ధతులు అనుసరించకుండా బ్యాటరీలను కార్మికులతో ధ్వంసం చేయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ధ్వంసం చేశాక వెలువడే సీసాన్ని అశాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహిస్తున్నారు. ఈ మూడు యూనిట్ల కారణంగా భారీగా కాలుష్యం వెలువడడంతో పాటూ అందులో పనిచేసే కార్మికులు, స్థానికుల ఆరోగ్యంపై విపరీత ప్రభావం చూపుతుందని అధికారుల తనిఖీల్లో తేలింది. ఎలాంటి బోర్డు లేకుండా..పీసీబీ అనుమతి తీసుకోకుండా యూనిట్లను కొనసాగిస్తున్న వీటిపై స్థానికులు ఫిర్యాదు చేయగా..అధికారులు మూసివేతకు ఆదేశాలిచ్చారు. సదరు యూనిట్లకు విద్యుత్‌ సరఫరా నిలిపేసినట్లు తెలిపారు.
పాత బ్యాటరీలతో ముప్పే.. కాల పరిమితి ముగిసిన లెడ్‌(సీసం) యాసిడ్‌ బ్యాటరీల్ని ఇష్టారీతిన నిల్వ, ధ్వంసం చేయడం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) నిబంధనలకు విరుద్ధం. లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీలను కంప్యూటర్‌ యూపీఎస్‌(ఇన్వర్టరు), ఎలక్ట్రిక్‌ చక్రాల కుర్చీలు, బ్యాటరీ ఆధారిత ఎలక్ట్రిక్‌ వాహనాల్లో వినియోగిస్తారు. వీటి పనితీరు మందగించిన తర్వాత లేదా కాలపరిమితి ముగిశాక జాగ్రత్తగా ధ్వంసంచేయాలి. ఒకవేళ బ్యాటరీలను రీసైక్లింగ్‌ చేయాలంటే ప్రత్యేక విధానం అనుసరించాలి. పునర్వినియోగ ప్రక్రియలో విడుదలయ్యే వ్యర్థాలను ‘స్పెషల్‌ స్టోరేజ్‌ డిస్పోజల్‌ కేంద్రాని’కి పంపాలి. లేనిపక్షంలో రీసైక్లింగ్‌ చేసే సమయంలో బ్యాటరీ కేసులు తెరుచుకుని సీసం ధూళి, హానికారక ఆమ్లాలు వెలువడి గాలి విషతుల్యం అవుతుంది. వీటిని చిన్నారులు పీలిస్తే మెదడు, నాడీ వ్యవస్థ, గుండె, ఊపిరితిత్తులు, మూత్ర పిండాల సమస్యలు, గర్భస్థ శిశువులకు అవయవలోపాలు తలెత్తుతాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని