logo

‘గాంధీ’లో కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌

చాలామంది చిన్నారుల్లో పుట్టుకతోనే వినికిడి లోపం ఉంటుంది. తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడంతో.. వారికి 3-4 ఏళ్లు దాటినా ఈ సమస్యను గుర్తించలేరు. ఇప్పటికే ఎంతోమంది ఈతరహా సమస్యతో బాధపడుతున్నారు. పుట్టిన

Published : 24 May 2022 03:09 IST

 పుట్టుకతోనే వినికిడి లోపం ఉన్న పిల్లలకు వరం

ఈనాడు, హైదరాబాద్‌: చాలామంది చిన్నారుల్లో పుట్టుకతోనే వినికిడి లోపం ఉంటుంది. తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడంతో.. వారికి 3-4 ఏళ్లు దాటినా ఈ సమస్యను గుర్తించలేరు. ఇప్పటికే ఎంతోమంది ఈతరహా సమస్యతో బాధపడుతున్నారు. పుట్టిన పిల్లల్లో ఇలాంటి సమస్య గుర్తించి...సత్వరం చికిత్స అందించేందుకు గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక విభాగం త్వరలో అందుబాటులోకి రానుంది. వినికిడి లోపం ఉన్న పిల్లలకు కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ ప్రక్రియ చేపట్టేందుకు గాంధీలో చికిత్స కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. దవాఖానాలో ఇప్పటికే ప్రసూతి విభాగం ఉంది. పుట్టిన శిశువుల్లో వినికిడి లోపం గుర్తిస్తే...వెంటనే ఈ కేంద్రంలో చికిత్స అందించనున్నారు. దీనిలోభాగంగా కొత్తగా ఆసుపత్రిలోని 8వ అంతస్తులో ప్రత్యేకంగా ఆపరేషన్‌ థియేటర్‌ ఏర్పాటు చేస్తున్నారు.  గ్రహణ శక్తి కల్పించేందుకు చెవి పైభాగంలో తల వద్ద శస్త్రచికిత్స చేసి లోపల చిన్నయంత్రం ఏర్పాటు చేస్తున్నారు. చెవిలో బయటకు కన్పించేలా చిన్న స్పీకరు లాంటివి ఉంటాయి. ఈ రెండింటిని అనుసంధానం చేస్తారు. ఈ యంత్రం సహయంతో పిల్లలు సులువుగా మాటలు వింటారు. 3-5 ఏళ్ల పిల్లలకైతే కాక్లియర్‌ ఇంప్లాంటేషన్‌ తర్వాత ప్రత్యేకంగా స్పీచ్‌థెరఫీ అందిస్తారు. కోఠి ఈఎన్‌టీలో ఈ చికిత్సలు అందిస్తున్నప్పటీ తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే రూ.10-12 లక్షల వరకు వ్యయమవుతుంది. త్వరలో గాంధీలోనూ అవి అందుబాటులోకి రానుండటంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట దక్కనుంది.

కాలేయ మార్పిడులకు మూడో కేంద్రం

కాలేయ మార్పిడి చికిత్సలు ఉస్మానియాతోపాటు నిమ్స్‌లో జరుగుతున్నాయి. త్వరలో గాంధీలో కూడా మూడో కేంద్రం అందుబాటులోకి రానుంది. ఉస్మానియాలో పాత భవనం మూసివేతతో ఇక్కడ కాలేయ మార్పిడి జరగడం లేదు. ప్రస్తుతం 160 మంది వరకు ఉస్మానియాలో కాలేయ మార్పిడి కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకొని నిరీక్షిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని