CPI Narayana: ఐఎస్‌బీ విద్యార్థులపై నిఘా.. దుర్మార్గమైన చర్య: నారాయణ

ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవం, స్నాతకోత్సవాన్ని ఈ నెల 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

Published : 24 May 2022 11:11 IST

హైదరాబాద్‌: ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవం, స్నాతకోత్సవాన్ని ఈనెల 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. దీనికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఐఎస్‌బీ విద్యార్థులపై నిఘా పెట్టారని.. అది అప్రజాస్వామికమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బిజినెస్‌ స్కూల్‌ అని.. అందులో శిక్షణ పొందిన విద్యార్థులు కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం ఉందని చెప్పారు. అలాంటి విద్యార్థులు సోషల్‌ మీడియాలో ప్రధానికి వ్యతిరేకంగానో, ప్రజాస్వామ్యానికి అనుకూలంగానో పోస్ట్‌ చేస్తే అలాంటి వారిపై నిఘా ఉంచి వార్షికోత్సవానికి రాకుండా బ్లాక్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారని నారాయణ ఆరోపించారు. ఇది దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ఈ మేరకు నారాయణ ఓ వీడియోను విడుదల చేశారు.

ప్రజాస్వామ్యంలో ఎవరికైనా వారి భావాలు వ్యక్తపరిచే హక్కు ఉందని నారాయణ అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో కూడా భావాలను వ్యక్తపరచడానికి వీల్లేకుండా చేసే నియంతృత్వ ధోరణి బిజినెస్‌ స్కూల్లో ప్రారంభిస్తే అక్కడి విద్యార్థులు ఎలా తయారవుతారని ప్రశ్నించారు. సమాజానికి ఉపయోగపడేవారిగా తయారవుతారా? లేక నియంతల్లాగా మారతారా?అని ప్రశ్నించారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారాయణ చెప్పారు. వెంటనే నిఘాను ఎత్తివేసి.. విద్యార్థులందరినీ భేషరతుగా వార్షికోత్సవంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. లేకపోతే మోదీ క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని