logo

రూ. 2,500 కోట్లతో శివారుకు రహదారి భాగ్యం

శివారుకు రహదారులకు అనుసంధానంగా పెద్దయెత్తున లింకు రోడ్లు నిర్మించేందుకు హైదరాబాద్‌ రహదారుల అభివృద్ధి సంస్థ(హెచ్‌ఆర్‌డీసీఎల్‌) రంగం సిద్ధం చేసింది. రూ.2,500 కోట్లతో జీహెచ్‌ఎంసీ పరిధిని ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం

Published : 26 May 2022 02:30 IST

104 లింకు  రోడ్ల నిర్మాణానికి హెచ్‌ఆర్‌డీసీఎల్‌ ప్రతిపాదన
డీపీఆర్‌లు పూర్తి చేసిన డీటీసీపీ, హెచ్‌ఎండీఏ

ఈనాడు, హైదరాబాద్‌: శివారుకు రహదారులకు అనుసంధానంగా పెద్దయెత్తున లింకు రోడ్లు నిర్మించేందుకు హైదరాబాద్‌ రహదారుల అభివృద్ధి సంస్థ(హెచ్‌ఆర్‌డీసీఎల్‌) రంగం సిద్ధం చేసింది. రూ.2,500 కోట్లతో జీహెచ్‌ఎంసీ పరిధిని ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం చేయడం, రద్దీ ప్రాంతాల మధ్య రహదారులను విస్తరించేందుకు 104 లింకు రోడ్లను నిర్మించాలని ప్రతిపాదలను సర్కారుకు పంపింది. నిధుల సమస్య లేకుండా ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేలా పురపాలకశాఖ ఏర్పాట్లు చేసిందని, త్వరలో మొదటి దశ పనులకు ప్రభుత్వం ఆమోదముద్ర వేయనుందని స్పష్టం చేస్తున్నారు. పనులు పూర్తయితే శివారు ప్రాంతాల మధ్య దూరం తగ్గుతుంది. కార్పొరేషన్లలోని ఇరుకు రోడ్లు విస్తరణకు నోచుకుంటాయి.

భవిష్యత్తు దృష్ట్యా 100 అడుగుల రోడ్లు..
హైదరాబాద్‌ నగరంలో మాదిరి.. నగర శివారులోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో జనాభా అంతకంతకు విస్తరిస్తోంది. జనావాసాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నార్సింగి, మణికొండ, బండ్లగూడజాగీర్‌ ప్రాంతాల జనాభా విపరీతంగా పెరుగుతోంది. నగరానికి తూర్పున ఉన్న ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం గతంలో శివారులోని పలు మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా మార్చింది. కొనసాగింపుగా.. ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో రోడ్ల విస్తరణకు నడుం బిగించింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మెజార్టీ రహదారులను 100అడుగుల మేర, భూసేకరణ కష్టంగా ఉన్న ఐదు ప్రాంతాల్లో 80అడుగుల మేర రహదారిని విస్తరిస్తున్నామని ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారులు ‘ఈనాడు’తో తెలిపారు. ఉదాహరణకు.. దమ్మాయిగూడ నుంచి జవహర్‌నగర్‌ వెళ్లే రోడ్డు ప్రస్తుతం 60అడుగులుగా ఉంది. దానిపై వాహనాల రాకపోకలు కష్టతరమవుతున్నాయి. ఆ రోడ్డును 100 అడుగుల మేర విస్తరించాలని హెచ్‌ఆర్‌డీసీఎల్‌ నిర్ణయించింది. వర్షాకాలంలోనూ పనులు కొనసాగుతాయని, ప్రభుత్వం అనుమతిస్తే ఏడాది నుంచి రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుందని అధికారులు తెలిపారు.

హెచ్‌ఎండీఏ ద్వారా..
జీహెచ్‌ఎంసీ పరిధిలో రెండు దశల లింకు రోడ్ల పనులు ఇప్పటికే పురోగతిలో ఉన్నాయి. గ్రేటర్‌లోని మూడో దశ లింకు రోడ్ల ప్రతిపాదనలతోపాటు కేవలం శివారు ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన రూ.2,500 కోట్ల పనుల ప్రతిపాదనలూ ప్రభుత్వం వద్ద ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రాధాన్యక్రమంలో మొదట చేపట్టేందుకు 40 లింకు రోడ్లను గుర్తించామని అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని