logo

నగరంలో 132 కేవీ.. శివార్లలో 220 కేవీ

విద్యుత్తు వాడకం అధికమవడం.. ఇప్పటికే ఉన్న ఉప కేంద్రాలపై లోడు పెరుగుతుండటంతో ట్రాన్స్‌కో నూతన విద్యుత్తు ఉప కేంద్రాల నిర్మాణంపై దృష్టిపెట్టింది. అవుటర్‌ రింగ్‌ రోడ్డు చేరువలో విల్లాలు, పెద్ద సంఖ్యలో అపార్ట్‌మెంట్లు,

Updated : 26 May 2022 05:52 IST

నూతన విద్యుత్తు ఉప కేంద్రాల నిర్మాణం

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు వాడకం అధికమవడం.. ఇప్పటికే ఉన్న ఉప కేంద్రాలపై లోడు పెరుగుతుండటంతో ట్రాన్స్‌కో నూతన విద్యుత్తు ఉప కేంద్రాల నిర్మాణంపై దృష్టిపెట్టింది. అవుటర్‌ రింగ్‌ రోడ్డు చేరువలో విల్లాలు, పెద్ద సంఖ్యలో అపార్ట్‌మెంట్లు, ఫార్మా సంస్థల కార్యకలాపాలు ఊపందుకోవడంతో అక్కడ విద్యుత్తు డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నగరంలో 132 కేవీ, శివార్లలో (అవుటర్‌) 220 కేవీ ఉపకేంద్రాలు నిర్మించనున్నారు. బౌరంపేటలో ఇప్పటికే 220 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం పనులు పురోగతిలో ఉండగా, సీతారాంబాగ్‌లో కొత్తగా 132 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం నిర్మాణం చేపట్టబోతుంది. అసిఫ్‌నగర్‌ నుంచి సీతారాంబాగ్‌ వరకు భూగర్భ కేబుళ్లు వేయనున్నారు.

70 శాతానికి చేరితే..

విద్యుత్తు మౌలిక వసతుల కల్పనకు సంబంధించి 33/11 కేవీ విద్యుత్తు ఉప కేంద్రాలను టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ నిర్మించి నిర్వహిస్తోంది. ఇందుకోసం 400, 220, 132 కేవీ ఉప కేంద్రాలు నిర్మిస్తుంది. జెన్‌కో, ఇతర ఉత్పత్తి కేంద్రాల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును స్టెప్‌డౌన్‌ చేస్తూ ట్రాన్స్‌కో సరఫరా చేస్తుంది. ఉప కేంద్రాలపై లోడు 70 శాతానికి చేరితే.. కొత్త వాటి నిర్మాణంపై దృష్టిపెడుతుంది. ప్రస్తుతం అసిఫ్‌నగర్‌ ఉప కేంద్రం లోడు 70 శాతానికి చేరిందని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టు సీతారాంబాగ్‌లో కొత్తగా 132 కేవీ ఉప కేంద్రాన్ని నిర్మించనున్నారు. టెండర్‌ ప్రక్రియ పూర్తయ్యింది. ఈ రెండు ఉపకేంద్రాల మధ్య ఆరు లేన్లలో అసిఫ్‌నగర్‌ నుంచి మెహిదీపట్నం మీదుగా సీతారాంబాగ్‌ వరకు దాదాపు నాలుగున్నర కిలోమీటర్ల దూరం భూగర్భ కేబుళ్లు వేస్తారు. రద్దీగా ఉండే మెహిదీపట్నం రహదారి కింద  1.8 మీటర్ల లోతులో ఆరు కేబుళ్లు వేయనున్నారు. మెహిదీపట్నంలో ఇప్పటికే రహదారి తవ్వి వివరాలను సేకరించారు. పనుల వ్యయం రూ.60 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఖర్చు తగ్గించేందుకు స్టోర్‌లోని కేబుల్‌నే వినియోగించనున్నారు. చివర్లో తగ్గితే అప్పుడు కొనుగోలు చేస్తామని ట్రాన్స్‌కో ట్రాన్స్‌మిషన్‌ డైరెక్టర్‌ టి.జగత్‌రెడ్డి తెలిపారు.

మూడు విధాలుగా..

బౌరంపేటలో హైటెన్షన్‌ టవర్లు, మోనోపోల్స్‌, భూగర్భ కేబుళ్లు.. ఇలా మూడు విధాలుగా కేబుళ్లు వేస్తున్నారు. నర్సాపూర్‌ నుంచి గండిమైసమ్మ మీదుగా బౌరంపేట వరకు దాదాపు 35 కి.మీ. దూరం ఉంటుంది. అవుటర్‌ దాకా హైటెన్షన్‌ టవర్ల ద్వారా దాదాపు 25 కిలోమీటర్లు ఓవర్‌ హెడ్‌ లైన్లు వేస్తున్నారు. అవుటర్‌ వెంట 5 కి.మీ. పొడవున మోనోపోల్స్‌ వేస్తున్నారు. తొలిసారి ఈ స్తంభాలను రాయదుర్గం 400 కేవీ విద్యుత్తు ఉప కేంద్రం లైన్లలో వాడారు. ఇప్పుడు బౌరంపేటలో ఉపయోగిస్తున్నారు. అవుటర్‌ లోపల నుంచి బౌరంపేట వరకు మరో ఐదు కిలోమీటర్లు భూగర్భ కేబుళ్లు వేయనున్నారు. యూజీ కేబుల్‌ పనులు ఇప్పటికే 3 కి.మీ. పూర్తయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని