logo

పోషకాహారం.. చిన్నారులకు ఆరోగ్యం

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వివిధ పథకాల కింద కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నాయి. ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ మరిన్ని చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా

Updated : 29 May 2022 03:44 IST

మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు
వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
న్యూస్‌టుడే, పరిగి 

ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వివిధ పథకాల కింద కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్నాయి. ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ మరిన్ని చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా వచ్చే నూతన విద్యా సంవత్సరం నుంచి ‘పీఎం పోషణ్‌ పథకం (మధ్యాహ్న భోజనం)’ కింద పాఠశాలల్లో పల్లీ పట్టీకి బదులుగా రాగి జావ, మొలకలు, బెల్లం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా కేంద్ర విద్యాశాఖ అనుమతించింది. విద్యార్థుల్లో పోషకాహార లోప నివారణకు ఇది చక్కటి మార్గంగా ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ‘న్యూస్‌టుడే’ కథనం.

పేద కుటుంబాలే అధికం

జిల్లా అచ్చంగా గ్రామీణ ప్రాంతం కావడంతో నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులే అధికంగా ఉన్నారు. రవాణా వసతి సక్రమంగా లేకపోవడం, బడిగంట ప్రారంభమవుతుందని చాలా మంది విద్యార్థులు పాఠశాల సమయానికి ఇంట్లో భోజనం చేయకుండానే పరుగులు పెడుతున్న సంఘనలు నిత్యం కనిపిస్తుంటాయి. తద్వారా వారికి పోషకాహారం అందకపోవడంతో అనారోగ్యం బారిన పడి హాజరు శాతంపై ప్రభావం చూపుతోంది. కొంతలో కొంత నయం అన్నట్లుగా బడుల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనం వేలాది మంది పిల్లల కడుపునింపుతోంది. 

1.10 లక్షల మందికి ప్రయోజనం

జిల్లాలోని తాండూరు, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలోని 19 మండలాల్లో 764 ప్రాథమిక, 116 ప్రాథమికోన్నత, 174 ఉన్నత పాఠశాలల్లో 1,10,847 మంది విద్యార్థులు ఉన్నారు. రాగి జావతో పాటు మొలకలు, బెల్లం అందజేస్తే 1.10లక్షల మంది విద్యార్థులకు మేలు చేకూరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. 

మౌలిక సదుపాయాలు కల్పిస్తే..

పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నిధులు విడుదలవుతున్నాయి. క్షేత్రస్థాయిలో నిర్వహణ లోపం కారణంగా అవి మూణ్ణాళ్ల ముచ్చటే అవుతున్నాయి. ప్రధానంగా వంట గదుల నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది. ఉపాధిహామీ నిధులతో మూడేళ్ల క్రితం చేపట్టిన వంట గదుల నిర్మాణాలు ఇంకా అనేక చోట్ల నత్తనడకనే సాగుతున్నాయి. పరిగిలోని జడ్పీహెచ్‌ఎస్‌ నం.2, 1 పాఠశాలలే ఇందుకు నిదర్శనం. ఆరేళ్ల క్రితం రూ.8లక్షల అంచనా వ్యయంతో స్థానికంగా విద్యార్థుల కోసం మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించారు. అవి వాడకుండానే వాటిని కూల్చేశారు. ప్రస్తుతం నం.2 పాఠశాలలో ఇవి విద్యార్థులకు సరిపడా లేవు. ఇలాంటి కనీస సౌకర్యాలు సక్రమంగా లేక సతమతమవుతున్నారు. వీటన్నింటిని మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది.

హాజరు శాతం పెరుగుతుంది : హరిశ్చందర్‌, మండల విద్యాధికారి, పరిగి

మధ్యాహ్న భోజనం అమలుతో విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. చాలా ప్రాంతాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.  రాగి జావతో పాటు మొలకలు, బెల్లం అందజేస్తే నిజంగా పేద విద్యార్థులకు వరంగా మారుతుంది. విద్యార్థుల ఆరోగ్యం కూడా మరింత మెరుగు పడేందుకు దోహదం చేస్తుంది. ప్రైవేట్‌ పాఠశాలల నుంచి గతేడాది జిల్లా వ్యాప్తంగా దాదాపు 10వేలకు పైగా విద్యార్థులు సర్కారు బడుల్లో చేరారు. ప్రభుత్వాలు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలల నిర్వహణలో అనేక మార్పులు వచ్చాయి.

ఆరోగ్యం మరింత మెరుగు: రేణుకాదేవి, జిల్లా విద్యాధికారి

మధ్యాహ్న భోజనంలో మార్పులు తీసుకురావడం చాలా సంతోషం. విద్యార్థులకు పోషకాహారాన్ని అందిస్తే మానసికంగా, శారీరకంగానూ బలంగా తయారవుతారు. రాగి జావతో పాటు మొలకలు, బెల్లం అందజేస్తే నిజంగా పేద విద్యార్థులకు వరంగా మారుతుంది. ప్రైవేట్‌ పాఠశాలల నుంచి గతేడాది జిల్లా వ్యాప్తంగా దాదాపు 10వేలకు పైగా విద్యార్థులు సర్కారు బడుల్లో చేరారు.  ప్రభుత్వాలు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలల నిర్వహణలో అనేక మార్పులు వచ్చాయి. వచ్చే ఏడాది వందల సంఖ్యలో పాఠశాలల రూపురేఖలు మారిపోనున్నాయి. దీంతో ఇంకా విద్యార్థులు చేరే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని