logo

క్షణాల్లో మంటలు.. మిన్నంటిన హాహాకారాలు

ఖాజాగూడ చౌరస్తా సమీపంలోని హైమార్క్‌ ఛాంబర్‌ నాలుగంతస్తుల భవనంలో శనివారం ఉదయం 9.30-10 మధ్య జరిగిన అగ్నిప్రమాదం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది, అధికారులు స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది. రెండో అంతస్తులో రేగిన మంటలు, పొగ నాలుగో అంతస్తుకు వ్యాపించడంతో అక్కడున్న ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రాణాలు

Published : 29 May 2022 02:26 IST

 ఖాజాగూడ చౌరస్తాలో నాలుగంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం

టెర్రస్‌ పైకి ఎక్కిన 14 మందిని స్కైలిఫ్ట్‌ సాయంతో రక్షించిన సిబ్బంది

హైమార్క్‌ ఛాంబర్‌ భవనం నుంచి దట్టంగా వ్యాపించిన పొగ

ఈనాడు, హైదరాబాద్‌; న్యూస్‌టుడే, రాయదుర్గం, గౌతంనగర్‌: ఖాజాగూడ చౌరస్తా సమీపంలోని హైమార్క్‌ ఛాంబర్‌ నాలుగంతస్తుల భవనంలో శనివారం ఉదయం 9.30-10 మధ్య జరిగిన అగ్నిప్రమాదం నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది, అధికారులు స్పందించడంతో పెనుప్రమాదం తప్పింది. రెండో అంతస్తులో రేగిన మంటలు, పొగ నాలుగో అంతస్తుకు వ్యాపించడంతో అక్కడున్న ఉద్యోగులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు తీశారు. భవనం పైభాగానికి చేరుకొని రక్షించండంటూ కేకలేశారు. రాయదుర్గం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. మాదాపూర్‌ అగ్నిమాపకశాఖ కార్యాలయానికి సమాచారం చేరవేశారు. ప్రాణాలు అరచేత పెట్టుకొని టెర్రస్‌పైకి ఎక్కిన 14 మందిని బ్రాంటో స్కైలిఫ్ట్‌ సాయంతో సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. అంబులెన్స్‌ల్లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మాదాపూర్‌ ఏసీపీ రఘునందన్‌రావు, జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి(డీఎఫ్‌ఓ) శ్రీధర్‌రెడ్డి, రాయదుర్గం సీఐ తిరుపతి సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 

తప్పిన పెనుముప్పు

హైమార్క్‌ ఛాంబర్‌ భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో గ్రీన్‌ బావర్చి హోటల్‌, మొదటి, మూడో అంతస్తులో ఐటీ సంస్థలున్నాయి. రెండు, నాలుగో అంతస్తుల్లో యాక్షన్‌ గార్డింగ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సెక్యూరిటీ సంస్థ కార్యాలయాలున్నాయి. శనివారం సాఫ్ట్‌వేర్‌ సంస్థలకు సెలవు కావడంతో మూసివున్నాయి. ఉదయం 10 గంటలకు రెండో అంతస్తులో విధులకు వచ్చిన యాక్షన్‌ గార్గింగ్‌ సర్వీసెస్‌ సంస్థకు చెందిన ఉద్యోగి సంతోష్‌తోపాటు మరో ఇద్దరు తాళాలు తీసి లోపలకు వెళ్లే ప్రయత్నం చేస్తుండగా స్టోర్‌ రూమ్‌ నుంచి మంటలు రావటం గమనించారు. కార్యాలయంలోని పరికరాలతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. క్షణాల్లో మంటలు, పొగ మరింత వ్యాపించాయి. ఆందోళనకు గురైన ఇద్దరు కిందకు వచ్చి ప్రాణాలు దక్కించుకున్నారు. మరో ఉద్యోగి 11 గంటల ప్రాంతంలో అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు.

తలుపులు బద్దలుకొట్టి..

నాలుగో అంతస్తులోని యాక్షన్‌ గార్డింగ్‌ సంస్థలో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగినులతో సహా 14 మంది ఉన్నారు. భవనంపైకి దట్టమైన పొగలు వ్యాపించడంతో మెట్ల మార్గంలో కిందికి వచ్చే అవకాశం లేకపోయింది. ధైర్యం కూడదీసుకొని అందరూ టెర్రస్‌పైకి చేరుకోవాలనుకున్నారు. మార్గంలో తలుపులకు తాళాలు వేసి ఉండడంతో అద్దాలను బద్దలుకొట్టి పైకి చేరుకున్నారు. రక్షించమంటూ ఆర్తనాదాలు చేశారు. 11.10 గంటలకు మాదాపూర్‌ నుంచి రెండు అగ్నిమాపక శకటాలు చేరుకున్నాయి. టెర్రస్‌ పైన ఉన్నవారికి సిబ్బంది ధైర్యం చెప్పారు. 11.30 గంటలకు బ్రాంటో స్కైలిఫ్ట్‌ చేరుకుని, డీఎఫ్‌ఓ శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో పైన ఉన్న వారిని 40 నిమిషాల్లో కిందికి దించారు. అంబులెన్స్‌ల్లో ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికి ప్రథమ చికిత్స అందించారు. 14 మందిని అరగంట సేపు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. అందరూ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు నిర్ధారించి డిశ్ఛార్జి చేసినట్టు వైద్యులు తెలిపారు.

* సెక్యూరిటీ సంస్థలోని సిబ్బంది యూనిఫారాలు, షూస్‌, బెల్టులు తదితరాలు కాలిపోయాయి. ఫర్నిచర్‌ దగ్ధమైంది. సాఫ్ట్‌వేర్‌ సంస్థ కార్యాలయంలోకి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. 2 గంటలు శ్రమించి మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఆస్తి నష్టం అంచనా వేస్తున్నారు. జిల్లా అగ్నిమాకశాఖ అధికారి ఎస్‌.శ్రీధర్‌రెడ్డి, ఏడీఎఫ్‌వోలు గిరిధర్‌రెడ్డి, విజయ్‌కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఓ బి.శ్రీనివాస్‌, టి.జగన్మోహన్‌ పర్యవేక్షించారు. వేగంగా స్పందించి బాధితులను కాపాడిన రాయదుర్గం పోలీసులను డీసీపీ కె.శిల్పవల్లి అభినందించారు.


బయటపడింది వీరే

కాంచమ్మ(ఖాజాగూడ), విజయ (మధురానగర్‌), సల్మాబేగం(అత్తాపూర్‌), మురాద్‌ కుమార్‌(యూపీ), రామారావు, శైలజ, షేక్‌సల్మా, వెంకట్‌ బాపిరాజు, వెంకటేశ్వర్‌రెడ్డి, టి.శేఖర్‌, తరుణ్‌ గోపి, చందన్‌, స్వర్ణరాజ్‌, మరో మహిళ ఉన్నారు.


భళా.. బాహుబలి స్కైలిఫ్ట్‌

ఐదంతస్తుల భవనంపై నుంచి కాపాడమంటూ హాహాకారాలు. లోపలకు వెళ్లేందుకు మరో మార్గం లేదు. క్రమంగా వ్యాపిస్తున్న పొగతో ఊపిరాడక ఇబ్బందిపడే పరిస్థితి. ఇటువంటి విపత్కర వేళ.. 14 మందిని సురక్షితంగా కిందకు దించి ప్రాణాలు కాపాడటంతో బాహుబలి క్రేన్‌ కీలకమైంది. గ్రేటర్‌ పరిధిలో బ్రాంటో స్కైలిఫ్ట్‌ వాహనాలు ఒకటి సికింద్రాబాద్‌లో.. మరొకటి మాదాపూర్‌ అగ్నిమాపక కేంద్రాల్లో ఉంచారు. హైటెక్‌సిటీ పరిధిలో బహుళంతస్తుల భవనాలు, కార్యాలయాలు ఉండటంతో అత్యవసర పరిస్థితుల్లో దీన్ని బయటకు తీస్తుంటారు. ఖాజాగూడ ప్రమాదంలో మాదాపూర్‌ ఫైర్‌స్టేషన్‌ నుంచి స్కైలిఫ్ట్‌ను రంగంలోకి దించారు. 54 మీటర్ల ఎత్తు వరకూ(18 అంతస్తులు) రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించగలిగే సమర్థత దీని సొంతం. అంత ఎత్తు నుంచి 400 కిలోల బరువు వరకూ సురక్షితంగా కిందకు దించగల సత్తా ఉంది. 14 మంది బాధితులను కిందకు తీసుకురావటంలో స్కైలిఫ్ట్‌ ఎంతో ఉపకరించిందని అగ్నిమాపకశాఖ అధికారులు స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని