logo

Nalgonda: నల్గొండ జిల్లాలో యువతి మృతి.. ప్రేమ పేరుతో ఇద్దరి వేధింపులే కారణం..!

ఈ నెల 9న మృతిచెందిన యువతి మరణానికి కారణం ప్రేమ వ్యవహారమేనని పోలీసులు, స్థానికులు బుధవారం తెలిపారు.

Updated : 11 Jul 2024 11:26 IST

కొత్త కల్యాణి (పాత చిత్రం)

మాడ్గులపల్లి, న్యూస్‌టుడే: ఈ నెల 9న మృతిచెందిన యువతి మరణానికి కారణం ప్రేమ వ్యవహారమేనని పోలీసులు, స్థానికులు బుధవారం తెలిపారు. కుక్కడం గ్రామ పరిధిలోని చింతలగూడేనికి చెందిన కొత్త రామలింగం, రజితల కుమార్తె కొత్త కల్యాణి(19) చదువు మానేసి, ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన అరూరి శివ, కొమ్మనబోయిన మధు అనే ఇద్దరు యువకులు ప్రేమ పేరుతో యువతిని కొంతకాలంగా వేధిస్తున్నారు. ఎవరికి వారే తమను ప్రేమించకుంటే తన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించారు.

ఈ నెల 6న తిప్పర్తి మండలం సర్వారం గ్రామంలోని వారి బంధువొకరు చనిపోగా కల్యాణి తల్లిదండ్రులు అక్కడికి వెళ్లారు. వారి కుమారుడు కళాశాలకు వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న కల్యాణికి సదరు యువకులు ఫోన్లు చేస్తూ వేధించసాగారు. దీంతో విరక్తి చెందిన కల్యాణి పురుగుమందు తాగి, విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పింది. అప్పటికే గమనించిన స్థానికులు మిర్యాలగూడ ఆసుపత్రికి, మెరుగైన చికిత్సకు నల్గొండలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మూడు రోజులు చికిత్స పొందిన కల్యాణి మంగళవారం మృతి చెందింది. మృతురాలి తల్లి రజిత ఫిర్యాదు మేరకు మాడ్గులపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం మరణోత్తర పరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కల్యాణి మృతికి కారణమైన నిందితులను వెంటనే అరెస్టు చేసి, న్యాయం చేయాలని కోరుతూ మృతురాలి బంధువులు కుక్కడం వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై మృతదేహంతో నిరసన తెలిపారు. ఆసుపత్రిలోనే జడ్జితో మృతురాలి మరణ వాంగ్మూలం తీసుకున్నందున నిందితులకు కఠిన శిక్ష పడుతుందని పోలీసులు తెలపటంతో నిరసన విరమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు