logo

జారిపడతారు.. జర జాగ్రత్త..!

వేగంగా వెళ్తే అంతే..: చివ్వెంల మండలం గుంజలూరు గ్రామంలో మూడేళ్ల క్రితం హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వర్షానికి నీళ్లు నిలిచాయి.

Updated : 13 Jun 2024 06:43 IST

వేగంగా వెళ్తే అంతే..: చివ్వెంల మండలం గుంజలూరు గ్రామంలో మూడేళ్ల క్రితం హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వర్షానికి నీళ్లు నిలిచాయి.  అతివేగంగా వచ్చిన ఓ కారు వాననీటి వద్ద అదుపుతప్పి బోల్తా కొట్టింది.  ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. నిలిచిన నీటి మీదుగా అతి వేగంగా వెళ్లడంతో కారు టైరు, రోడ్డుకు మధ్య ఘర్షణ తగ్గి ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎండలు దంచి కొట్టాయి. ఇప్పుడిప్పుడే వర్షాల కురవడంతో వాతావరణం చల్లబడింది. విద్యాసంస్థలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యేలోపు ఏదైనా పర్యాటక, ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లేందుకు అనేక మంది కార్లు, ఇతర అద్దె వాహనాలను ఆశ్రయిస్తున్నారు. వర్షాకాలంలో వాహనాలు తరచూ ప్రమాదాలకు గురవుతుంటాయి. గతంలో ఉమ్మడి జిల్లాలో అనేక ప్రమాదాలు సైతం జరిగాయి. ఉమ్మడి జిల్లాలో ప్రతి నెలా మూడు వేలకు పైగా వాహనాలు రిజిస్ట్రేషన్‌ అవుతుండగా.. లక్ష పైగా వాహనాలు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో తిరుగుతున్నాయి. వర్షాలు కురుస్తున్నందున వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని ఆటోమొబైల్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కారణాలు ఇవీ..

భారీ వాహనాల రాకపోకలతో చాలాచోట్ల రోడ్డు ధ్వంసమై గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతల్లో వర్షాలకు నీళ్లు నిలిచి.. వాహనదారులు అంచనా వేయలేక.. అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతుంటాయి. వాహనాలు వానలకు తడిస్తే బ్రేకులు సక్రమంగా పని చేయవు. లైట్లు కాంతివంతంగా వెలగకపోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు దగ్గరికి వచ్చే వరకు కనపడవు. తడిసిన రోడ్లపై వాహనాల టైర్లు జారడం, రోడ్డు దిగినప్పుడు నానిన మట్టిలో వాహనాలు కూరుకుపోతాయి. అద్దంపై నీటిని తుడిచే వైపర్లు పని చేయకపోయినా.. అతి వేగంగా వాహనాలు నడిపినా బోల్తాపడే అవకాశం ఉంటుంది.

ఆర్టీసీ డ్రైవర్లకు అధికారుల సూచనలు..

వర్షాకాలంలో ఆర్టీసీ బస్సులు సైతం తరచూ ప్రమాదాల బారిన పడుతుంటాయి. వీటిని నివారించేందుకు రీజినల్‌ మేనేజర్‌ శ్రీదేవి ఆధ్వర్యంలో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రత్యేకంగా పలు సూచనలు సైతం చేశారు. తారురోడ్డు పైనే బస్సులు నడపాలని.. రోడ్డు దిగితే మట్టిలో బస్సు టైర్లు దిగబడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మలుపు వద్ద నిదానంగా వెళ్లాలని సూచిస్తున్నారు.

అతివేగం ప్రమాదకరం

వర్షాకాలంలో క్రమం తప్పకుండా వాహనాలను సర్వీసింగ్‌ చేయించడంతో పాటు ఫిట్‌నెస్, ఇతర ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా ఉంచుకోవాలి. పరిమితికి మించి వేగంగా ప్రయాణించడం కూడా ప్రమాదాలకు కారణం అవుతుంది.

ఎల్‌.వీరస్వామి, మోటారు వాహనాల తనిఖీ అధికారి, మిర్యాలగూడ

ముందు బ్రేక్‌ వేయొద్దు

వర్షంలో ద్విచక్రవాహనం నడిపేటప్పుడు ముందు బ్రేక్‌ వాడితే కిందపడే ప్రమాదం ఉంది. బ్రేకులను మెల్లగా వేస్తూ వాహనాన్ని ఆపాలి. వాననీరు హెడ్‌లైట్‌ లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి. నీరు వెళ్తే లైటు కాంతివంతంగా వెలగదు.

 నర్సింగోజు నాగాచారి, ద్విచక్రవాహనాల మెకానిక్, మిర్యాలగూడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని