logo

శుభ్రత కనుమురుగు.. తప్పదు ముప్పు

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పురపాలికల్లో నాలాలు, వరద, మురుగుకాల్వలు అధ్వానంగా మారాయి. వ్యర్థాలు పేరుకుపోయి దిగువకు నీరు పారడం లేదు.

Published : 13 Jun 2024 06:14 IST

నీలగిరి వరద కాల్వలో పేరుకుపోయిన వ్యర్థాలు

నల్గొండ పురపాలిక, న్యూస్‌టుడే: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పురపాలికల్లో నాలాలు, వరద, మురుగుకాల్వలు అధ్వానంగా మారాయి. వ్యర్థాలు పేరుకుపోయి దిగువకు నీరు పారడం లేదు. ఏటా వేసవిలో పూడిక తీసి వర్షాకాలంలో మురుగు నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడాల్సి ఉంది. చాలా ప్రాంతాల్లో ఈ పరిస్థితులు లేకపోవడంతో వరద నీరు రోడ్లపై ప్రవహించి లోతట్టు ప్రాంతాలను జలమయంగా మారుస్తున్నాయి. వరదల కారణంగా ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వర్షాలు కురుస్తున్నా కొన్ని పురపాలికల్లో కాల్వల శుభ్రతపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

  పురపాలికల్లో పరిస్థితి ఇలా..

ఉమ్మడి జిల్లాలో 19 పురపాలికల్లో వందల కి.మీ. వరద కాల్వలు నిర్మించినా వానాకాలం వచ్చిందంటే ప్రజలకు వణుకు తప్పడం లేదు.

  • సూర్యాపేట పురపాలికలో ఇటీవలే కాల్వల పూడిక తీత పనులు ప్రారంభించగా పూర్తిస్థాయిలో వ్యర్థాలు తొలగించలేదు. దీంతో మురుగు దిగువకు పారకుండా కాల్వల్లోనే పేరుకుపోతోంది.
  • మిర్యాలగూడ పట్టణంలో 32కి.మీ. మేర నల్లాలు ఉండగా కొన్నేళ్లుగా వ్యర్థాలు తొలగించడం లేదు. దీంతో కాల్వలు చాలా చోట్ల దెబ్బతిన్నాయి. వాటిల్లో ఈసారి రూ.50 లక్షల వ్యయంతో పూడిక తీసేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు.
  • నల్గొండ పట్ణణంలో ఈసారి అంతర్గత కాల్వలను మున్సిపల్‌ సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నారు. రూ.5 లక్షల వ్యయంతో మేజర్‌ కాల్వల్లో పూడిక తీసేందుకు ప్రణాళిక తయారు చేశారు.
  • చండూరు పురపాలిక పరిధిలో రోడ్డు విస్తరణ పనుల కారణంగా వరద కాల్వ నిర్మాణ పనులు చేపట్టారు. గుంతలు తవ్వి మధ్యలోనే అసంపూర్తిగా వదిలేయడంతో మురుగు దిగువకు పారకపోవడంతో సమీప ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
  • తిరుమలగిరి పురపాలికలో ఇప్పటి వరకు అధికారులు కాల్వల్లో పూడికతీత పనులపై దృష్టి సారించలేదు. రెండు కాల్వలు వ్యర్థాలతో నిండిపోయాయి.
  • కోదాడ పట్టణంలో ఎర్రకుంట కాల్వ పూడిక తీయకపోవడంతో చెత్తాచెదారంతో నిండిపోయింది.
  •  హుజూర్‌నగర్‌ పట్టణంలో పూడిక తీత పనుల్లో జాప్యం నెలకొంది. దద్దనాల చెర్వు కాలనీ ముంపు బారిన పడుతోంది.
  •  మోత్కూరు, యాదగిరిగుట్ట, ఆలేరు, హాలియా, నందికొండ, పోచంపల్లి, చిట్యాల పట్టణాల్లో నిర్వహణ లేమితో చాలా చోట్ల కాల్వలు శిథిలావస్థకు చేరాయి.

 పనులు ప్రారంభించాం

నల్గొండ పట్టణంలో మురుగుకాల్వలు, వరద కాల్వల శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే వన్‌టౌన్‌ పరిధిలో మున్సిపల్‌ సిబ్బందితో కాల్వలు శుభ్రం చేయించాం. టౌన్‌ టూలో పూడికతీత పనులు కూడా ప్రారంభిస్తాం. రూ.5లక్షల వ్యయంతో పెద్ద కాల్వల్లో పూడిక తీత పనులు చేయిస్తున్నాం. ప్రాణనష్టం జరగకుండా అన్ని వర్గాల ప్రజలతో ఇప్పటికే సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాం.

 ముసాబ్‌ అహ్మద్‌ సయ్యద్, కమిషనర్‌ నల్గొండ పురపాలిక

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని