logo

యోగా శిక్షణ.. తప్పని నిరీక్షణ

ప్రస్తుతం నిత్యం ఉరుకులు, పరుగుల జీవితం. భార్యాభర్త ఇరువురూ పనిచేస్తేగానీ కుటుంబం గడవని రోజులివీ. ఈ తరుణంలో మానసిక ప్రశాంతత కొరవడి చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు.

Updated : 13 Jun 2024 06:39 IST

ఏడాదిగా ఔత్సాహికుల ఎదురుచూపులు

రాజపేటలో నిర్మాణం పూర్తి చేసుకున్న యోగా కేంద్ర భవనం

రాజపేట, భువనగిరి, న్యూస్‌టుడే: ప్రస్తుతం నిత్యం ఉరుకులు, పరుగుల జీవితం. భార్యాభర్త ఇరువురూ పనిచేస్తేగానీ కుటుంబం గడవని రోజులివీ. ఈ తరుణంలో మానసిక ప్రశాంతత కొరవడి చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇందుకు ఇటీవల కాలంలో వ్యక్తుల జీవన విధానంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆహారంతో పాటు నిత్య విధివిధానాల్లో తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. మరికొందరు ధ్యానం, యోగా తదితర అంశాలపట్ల మొగ్గు చూపుతున్నారు. నిపుణులైన బోధకులు లేని కారణంగా రుసుం చెల్లించి ఆన్‌లైన్‌లో తర్ఫీదు పొందుతున్న వారు జిల్లాలో ఎందరో ఉన్నారు. ముఖ్యంగా శారీరక శ్రమకు దూరమవుతూ మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్‌ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్న వారిని నిలువరించే ప్రయత్నంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏడాదిక్రితం యోగా కేంద్రాల ఏర్పాటుకు పూనుకుంది. ప్రజల్లో ఒత్తిడి తగ్గించుకోవడానికి నిపుణులతో శిక్షణ ఇస్తే ప్రయోజనం ఉంటుందని భావించింది. ఈ విషయమై జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, ఉపకేంద్రాలకు అనుబంధంగా ‘జాతీయ ఆయుష్‌ మిషన్‌’ ద్వారా యోగా (ఆరోగ్య స్వస్థత) కేంద్రాలను ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆశా కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి యోగా గురువులుగా నియమించాలని నిర్ణయించారు. కానీ ఆ ప్రక్రియ పూర్తి కాక ముందే ప్రభుత్వం మారడంతో శిక్షకుల నియామకం మళ్లీ మొదటికి వచ్చింది.

మొదటి విడతలో పదమూడు..

జిల్లాలో మొత్తం 17 మండలాలుండగా 21 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు ఉన్నాయి. వీటిలో మొదటి విడతగా 13 యోగా కేంద్రాల నిర్మాణానికి నిధులను రెండేళ్ల క్రితం ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో కేంద్రానికి రూ.6 లక్షలు చొప్పున మొత్తం రూ.78 లక్షలు కేటాయించారు. జిల్లాలోని ఆత్మకూర్‌ (ఎం), బీబీనగర్, బొల్లేపల్లి, సంస్థాన్‌ నారాయణపురం, భూదాన్‌ పోచంపల్లి, కొలనుపాక, చౌటుప్పల్, రాజపేట, చిన్నకందుకూరు, రామన్నపేట, సర్వేల్, రాయగిరి, వెల్మజాల ప్రాంతాల్లో వీటి నిర్మాణానికి పూనుకున్నారు. ముఖ్యంగా వీటిని ఆరోగ్యకేంద్రాలు, ఉపకేంద్రాల ఆవరణలో నిర్మాణాలను చేపట్టారు. యోగా కేంద్రాల భవన నిర్మాణాలు పూర్తయి ఏడాది కావొస్తున్నా వాటిని వినియోగంలోకి తేవడంలేదు. ఫలితంగా అవి నిరుపయోగంగానే ఉన్నాయి.

గురుముఖంగా నేర్చుకోవాలని తపన..

ధ్యానం, యోగా, ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంతత పొందుతున్నాను. ధ్యానం, యోగా అంటే అమితమైన ఆసక్తి. యూట్యూబ్‌ ద్వారా చూసి నిత్యం కొన్ని యోగాసనాలు, ధ్యాన ప్రక్రియలు చేపడుతుంటాను. ఈ రంగాలపై అనేక సందేహాలు వస్తుంటాయి. గురువు సమక్షంలో నేర్చుకుంటే సందేహాలు నివృత్తి చేయడమే కాకుండా మరింత ఫలితం పొందవచ్చని ఆశిస్తున్నాను. ప్రభుత్వం త్వరగా యోగా కేంద్రాలు వినియోగంలోకి తెస్తే మాలాంటి వారికి బహుళ ప్రయోజన కరంగా ఉంటుంది.

   బోగ జ్ఞానేందర్, రాజపేట

ప్రభుత్వ నిర్ణయం తదుపరి కార్యాచరణ

ప్రభుత్వం శిక్షకుల నియామకం చేపట్టిన తదుపరి యోగా కేంద్రాల్లో తర్ఫీదు ఉంటుంది. ఈ విషయమై శాఖాపరంగా గతంలోనే ఉన్నతాధికారులకు నివేదించాం. ఈ యోగా కేంద్రాలను వినియోగంలోకి తెస్తే ఆరోగ్యపరంగా మేలు జరుగుతుంది. ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్యంపైన మరింత శ్రద్ధ పెరుగుతుంది.

 స్వాతి, ఇన్‌ఛార్జి వైద్యురాలు

శిక్షకుల నియామకంపై స్పష్టత రాని వైనం..

అప్పట్లో ఒక్కో యోగా కేంద్రానికి ఇద్దరు శిక్షకులను నియమించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మహిళలు, పురుషులకు వేర్వేరుగా శిక్షకులను నియమిస్తారని చెప్పారు. నియామకాల ప్రక్రియపై ప్రభుత్వపరంగా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. యోగా, ధ్యానం పట్ల ఆసక్తి కలిగిన వారికి నిపుణుల నియామకంతో తర్ఫీదు పొందుతామని ఆశించిన వారికి నిరాశే మిగిలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని