logo

ఈసారి భూసార పరీక్షలు లేనట్లే..!

భూమి ఆరోగ్యం కాపాడటానికి, రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు చేపట్టిన భూసార పరీక్షలు ఈ ఏడాది సైతం జరిగేట్లు లేవు.

Published : 13 Jun 2024 06:22 IST

ప్రభుత్వం ఏఈవోలకు ఇచ్చిన భూసార పరీక్ష కిట్‌

గరిడేపల్లి, న్యూస్‌టుడే: భూమి ఆరోగ్యం కాపాడటానికి, రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించేందుకు చేపట్టిన భూసార పరీక్షలు ఈ ఏడాది సైతం జరిగేట్లు లేవు. ఇప్పటికే వర్షాలు పడుతుండటంతో మట్టి నమూనాలు సేకరించడం కష్టమని అధికారులు చెబుతున్నారు. గత రెండేళ్లుగా పరీక్షల నిర్వహణ లేకపోయినా ఈసారైనా ఉంటుందని రైతులు భావించారు. ఇంత వరకు బడ్జెట్‌ కేటాయించక పోవడంతో పాటు కొత్త మార్గదర్శకాలు రాలేదు. వచ్చే యాసంగి కోసం మట్టి నమూనాలు తీయాలన్నా అప్పుడు వర్షాలు కురుస్తుండటం, వానాకాలం పంటలు కొనసాగుతున్నందున మట్టి తేమగా ఉంటుంది. అప్పుడు పరీక్షలు కష్టమైన పనితోపాటు కచ్చితమైన ఫలితం రాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

భూఆరోగ్య కార్డులు ఇవ్వాలని..

కేంద్రంలో భాజపా అధికారంలోకి రాగానే భూఆరోగ్య కార్డులు ఇవ్వాలని సంకల్పించింది. అదే ఏడాదిలో మార్గదర్శకాలు విడుదల చేసి ప్రతి మండలంలోని రెవెన్యూ గ్రామాల్లో మూడో వంతు భూముల్లో భూసార పరీక్షలు చేసి వానాకాలం పంట సాగు చేసే ముందు, అంటే జూన్‌లో భూఆరోగ్య కార్డులు ఇవ్వాలని సూచించింది. అందులో ఏఏ భూముల్లో ఏ పోషకాలు ఎక్కువగా ఉన్నాయో తక్కువగా ఏమి ఉన్నాయో రైతులకు వివరించి తదనుగుణంగా ఎరువులు సిఫారసు చేయాలని ఆదేశించింది. అలా మూడేళ్లపాటు భూసార పరీక్షలు నిర్వహించారు. తర్వాత కేంద్రం దీనిపై దృష్టి సారించలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏఈవోలకు కిట్‌లు ఇచ్చి స్థానికంగానే మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు చేయాలని నిర్ణయించింది. 50 నమూనాలకు సరిపడా రసాయనాలు ఇచ్చింది. మరుసటి ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం సైతం కిట్‌లను పట్టించుకోలేదు. దాంతో పరీక్షల తంతు అటకెక్కింది. రెండేళ్ల క్రితం మార్కెటింగ్‌ శాఖ ద్వారా ప్రతి జిల్లాలో 2,400 నమూనాలు సేకరించి పరీక్షలు చేయాలని సంకల్పించి చేశారు. 2022-23 నుంచి ఇప్పటి వరకు ఏ పరీక్షలు లేవు. 2024-25లో నమూనాలు సేకరించి పరీక్షలు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు.

యాప్‌ రూపకల్పన దిశగా అడుగులు

భూసార పరీక్షలకు కొత్త మార్గదర్శకాలు రానున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వ్యవసాయాధికారులు పంటల సమగ్ర సర్వే చేసే సమయంలో వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్‌లో పొలం వద్దకు వెళ్లి సర్వే నంబరులో నిల్చొని ఫొటోలు తీసి వివరాలు నమోదు చేస్తున్నారు. అప్పుడు రైతు పేరుతో పాటు ఏ సర్వే నంబర్, అక్షాంశాలు, రేఖాంశాల వివరాలు ఉంటాయి. అదే పద్ధతిలో భూసార పరీక్షలకు యాప్‌ను తయారు చేసి మట్టి నమూనాల సేకరణలో అవలంబించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు సంబంధించిన కసరత్తు మొదలు పెట్టింది. ప్రతి రైతు వేదికలో ప్రయోగశాల ఏర్పాటు చేసి అందులో అవసరమైన రసాయనాలు అందించాలని, అక్కడే ఏటా పరీక్షలు చేసి రైతులకు వివరించవచ్చని భావిస్తోంది. ఇప్పటికే రైతు వేదికలు ఎక్కడ(లోకేషన్‌) ఉన్నాయో వివరాలు సేకరించినట్లు తెలిసింది. వచ్చే యాసంగి పంట కోతల అనంతరం ఈ పరీక్షలు ఉండవచ్చని అంచనా.

మార్గదర్శకాలు రాలేదు

ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రాలేదు. వాటి కోసం చూస్తున్నాం. మార్గదర్శకాలు వచ్చిన వెంటనే నమూనాలు సేకరిస్తాం. ఆలస్యమైతే యాసంగి సీజన్‌లో తీస్తాం.

శాంతినిర్మల, ఏడీఏ, మిర్యాలగూడ భూసార పరీక్షల విభాగం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు